logo

ఇసుకాసురుల దాహానికి చెయ్యేరు బలి!

చెయ్యేరు నది... జిల్లాలోని రాజంపేట, పెనగలూరు, పుల్లంపేట, చిట్వేలి, నందలూరు మండలాలకు సాగు, తాగునీరందించే జీవనాడి. ఇసుకాసురులు నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పంట కాలువలు, మాయమయ్యాయని ఆయా మండలాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 23 May 2024 03:04 IST

యథేచ్ఛగా నదిలో అక్రమ తవ్వకాలు, రవాణా 
పంట కాలువల మాయం, చుక్కనీరివ్వని బోర్లు 

చెయ్యేరు నదిలో నిరుపయోగంగా మారిన తాగునీటి బోర్లు

చెయ్యేరు నది... జిల్లాలోని రాజంపేట, పెనగలూరు, పుల్లంపేట, చిట్వేలి, నందలూరు మండలాలకు సాగు, తాగునీరందించే జీవనాడి. ఇసుకాసురులు నదిలోని ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో పంట కాలువలు, మాయమయ్యాయని ఆయా మండలాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమార్కుల కబంద హస్తాల్లో చిక్కుకున్న నది నుంచి గత అయిదేళ్లుగా భారీఎత్తున ఇసుకను తరలించుకునిపోయి సొమ్ము చేసుకున్నారు. ఈ క్రమంలో వేలాది ఎకరాలకు సాగునీరందించే కాలువలు మాయం కాగా, తాగునీటి బోర్లు నిరుపయోగంగా మారాయి. 

న్యూస్‌టుడే, రాజంపేట గ్రామీణ, పెనగలూరు : రాజంపేట మండలం మందరం కొత్తపల్లి గ్రామ సమీపంలోని చెయ్యేరు నదిలో గత అయిదేళ్లుగా ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతున్నాయి. నారాయణ నెల్లూరు గ్రామ సమీపంలోని 930 ఎకరాలకు సాగునీరందించే కాలువ కనిపించని  విధంగా తవ్వకాలు సాగించారు. రానున్న వర్షాకాలంలో సమృద్ధిగా వాన కురిసినా కాలువ ద్వారా సాగునీరందే అవకాశం లేకుండాపోయింది. భారీ స్థాయిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నా అధికారులు కనీస చర్యలు తీసుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

  పొందలూరు కాలువను పూడ్చేసిన అక్రమార్కులు  

పెనగలూరు మండలం పొందలూరులోని వేలాది ఎకరాలకు సాగునీరందించే కాలువను నారాయణ నెల్లూరు వద్ద పూడ్చేశారు. ఇసుక రవాణాకు కాలువ అడ్డుగా ఉండడంతో నామరూపాల్లేకుండా మట్టితో పూడ్చేశారు. దీనిపై సాగునీటిపారుదలశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రైతులు చెబుతున్నారు. ఇసుక అక్రమంగా తరలించే వారి చేతిలో అధికారులు కీలుబొమ్మలుగా తయారయ్యారని వారంతా ఆరోపిస్తున్నారు. చెయ్యేరులో ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన తాగునీటి బోర్లు సైతం ఎండిపోయాయని, తాగునీటి పథకాలు నిలిచిపోవడంతో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పరిశీలించి చర్యలు తీసుకుంటాం 

రాజంపేట, పెనగలూరు మండలాల పరిధిలోని పంట కాలువలు, ఉపకాలువలను పరిశీలిస్తాం. కాలువలను పూడ్చివేసి ఉంటే వెంటనే తొలగించి పంటపొలాలకు సాగునీరందేవిధంగా చర్యలు తీసుకుంటాం. 

రాజన్న, ఏఈ, సాగునీటి పారుదలశాఖ, రాజంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని