logo

గ్రావెల్‌ తరలింపుపై వైకాపా శ్రేణుల రగడ

సీఎం జగన్‌ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో గ్రావెల్‌ తరలింపు విషయమై వైకాపాలో రగడ చోటు చేసుకుంది. తనకు ఇచ్చిన డీకేటీ భూమిలో యంత్రాలతో మట్టిని తరలించకూడదంటూ వైకాపా కార్యకర్త కొమ్మద్ది ఓబులేసు ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతిని అడ్డుకున్నారు.

Published : 23 May 2024 03:13 IST

ఎంపీటీసీ సభ్యురాలిని అడ్డుకున్న కార్యకర్త

వాగ్వాదానికి దిగిన వైకాపా ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతి, కార్యకర్త ఓబులేసు 

వేంపల్లె, న్యూస్‌టుడే : సీఎం జగన్‌ ఇలాకా పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలో గ్రావెల్‌ తరలింపు విషయమై వైకాపాలో రగడ చోటు చేసుకుంది. తనకు ఇచ్చిన డీకేటీ భూమిలో యంత్రాలతో మట్టిని తరలించకూడదంటూ వైకాపా కార్యకర్త కొమ్మద్ది ఓబులేసు ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతిని అడ్డుకున్నారు. ఈ విషయం పోలీస్‌స్టేషన్‌ వరకు చేరింది. స్థానిక పామలూరు రోడ్డులోని 207వ సర్వే నంబర్‌లో బుధవారం వైకాపా ఎంపీˆటీసీˆ సభ్యురాలు భారతి జేసీˆబీ యంత్రం, ట్రాక్టర్లతో గ్రావెల్‌ తవ్వకాలు చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక దళితవాడకు చెందిన వైకాపా కార్యకర్త ఓబులేసు ఈ సర్వే నంబర్‌లో తనకు ప్రభుత్వం 1.06 సెట్ల భూమి కేటాయించి డీకేటీ పట్టా ఇచ్చిందంటూ గ్రావెల్‌ తవ్వకాలను అడ్డుకున్నారు. తనకు ఇచ్చిన ప్రభుత్వ భూమిలో మీరెలా మట్టిని తవ్వుతారని ప్రశ్నించారు. తానూ అధికార పార్టీకి చెందిన వాడినేనని ఆమెను నిలదీశారు. అయితే తనకు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు ఈ ప్రాంతంలోనే గ్రావెల్‌ తరలింపునకు లీజుకు ఇచ్చారని, ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి మట్టిని తరలిస్తున్నానని ఎంపీˆటీసీˆ సభ్యురాలు వాదించారు. ఈ విషయమై ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఎన్ని ఎకరాలైనా లీజుకు తీసుకున్నా తన భూమిలో మట్టిని తరలించేందుకు వీలు లేదని ఓబులేసు తేల్చి చెప్పారు. మట్టిని తరలింపు వాహనాలను వెనక్కి పంపారు. ఈ విషయమై పట్టణ సీˆఐ చాంద్‌బాషాకు సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గ్రావెల్‌ తరలించే ప్రాంతం ఎవరిదో మైనింగ్, రెవెన్యూ అధికారుల వద్ద తేల్చుకోవాలని సూచిస్తూ ఇరువురిని అక్కడి నుంచి పంపించారు. గ్రావెల్‌ తరలించే అంశంపై వైకాపా వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు