logo

సర్కారుకు సర్పంచుల షాక్!

వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు మండలం తప్పెట్ల గ్రామసచివాలయానికి నవంబరులో విద్యుత్తు బిల్లు రూ.16 వేలు రాగా చెల్లించరాదని సర్పంచి నిర్ణయించుకున్నారు. గతంలో చాలావరకు సొంత నిధులు వెచ్చించిన సర్పంచి రాష్ట్ర సర్పంచుల సంఘం పిలుపు మేరకు విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిపేశారు.

Updated : 04 Dec 2022 05:18 IST

విద్యుత్తు బిల్లులు చెల్లించేది లేదు
పారిశుద్ధ్య కార్మికులకు జీతాలివ్వం
సహాయ నిరాకరణకు నిర్ణయం

- ఈనాడు డిజిటల్‌, కడప

రామాపురం మండలం సరస్వతిపల్లె గ్రామ సచివాలయం

వైయస్‌ఆర్‌ జిల్లా వల్లూరు మండలం తప్పెట్ల గ్రామసచివాలయానికి నవంబరులో విద్యుత్తు బిల్లు రూ.16 వేలు రాగా చెల్లించరాదని సర్పంచి నిర్ణయించుకున్నారు. గతంలో చాలావరకు సొంత నిధులు వెచ్చించిన సర్పంచి రాష్ట్ర సర్పంచుల సంఘం పిలుపు మేరకు విద్యుత్తు బిల్లుల చెల్లింపులు నిలిపేశారు. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి.

అన్నమయ్య జిల్లా కలకడ మండలం కె.దొడ్డిపల్లె గ్రామపంచాయతీకి న్యాయవాది ఫీజు కింద రూ.4,125 వడ్డించారు. రైతు భరోసా కేంద్రాన్ని గ్రామ సచివాలయ కేంద్రానికి అనుబంధంగా ఏర్పాటు చేయాలంటూ గ్రామ పంచాయతీ తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వైకాపా నేతలు కత్తివారిపల్లెలో ఏర్పాటు చేశారు. కేసుకు సంబంధించి స్టాండింగ్‌ కౌన్సిల్‌ మెంబరుకు ఫీజు చెల్లించాలంటూ పంచాయతీకి నోటీసు జారీ చేశారు. ప్రభుత్వం తరఫున నియమించుకున్న న్యాయవాది భారాన్ని పంచాయతీలపై మోపడాన్ని సర్పంచులు నిరసిస్తున్నారు.

సర్కారుకు సర్పంచులు షాకిచ్చారు. సహాయ నిరాకరణకు సిద్ధమయ్యారు. విద్యుత్తు బిల్లులతోపాటు హరిత రాయబారుల పేరిట పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించేదిలేదని నిర్ణయించు కున్నారు. విధులు, నిధులు లేకుండా తమ పెత్తనాన్ని లాక్కున్న సచివాలయాలకు సహకరించరాదనే అభిప్రాయానికొచ్చారు. గతంలో వైకాపా ప్రభుత్వం గ్రామపంచాయతీలకు మంజూరైన వివిధ రకాల నిధులను మళ్లించుకుపోయింది. ఈ నేపథ్యంలో వివిధ దశల్లో ఆందోళనలు చేపట్టిన సర్పంచులు చివరి అస్త్రంగా సర్కారుపై సమరభేరి మోగించారు.

వైయస్‌ఆర్‌ జిల్లాలో ఎన్నికలు జరిగిన గ్రామపంచాయతీలు 553, అన్నమయ్యలో 473 ఉన్నాయి. వీటికి టైడ్‌, అన్‌టైడ్‌ కింద ఆర్థిక సంఘం నిధులొచ్చాయి. వీటి నుంచి బలవంతంగా విద్యుత్తు బిల్లులు చెల్లించడానికి అధికారులు సర్పంచులపై ఒత్తిడి తీసుకొచ్చారు. కొందరు కొంత మేర చెల్లించగా, మరికొందరు పూర్తిగా చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇటీవల తిరుపతిలో సర్పంచులు ఆందోళన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ తరుణంలో సహాయ నిరాకరణకు రాష్ట్ర సర్పంచుల సంఘం పిలుపునివ్వగా సీఎం జగన్‌ సొంత గడ్డ వైయస్‌ఆర్‌ జిల్లాలో మంచి స్పందన లభిస్తోంది. అన్నమయ్య జిల్లాలోనూ సర్పంచులు ఏకతాటిపైకి వచ్చి తమ డిమాండ్లు నెరవేరేవరకు సహాయ నిరాకరణ చేపట్టాలనే అభిప్రాయానికొచ్చారు.

పంచాయతీలపై సచివాలయాల భారం

గ్రామ సచివాలయాల భారమంతా పంచాయతీలే భరిస్తున్నాయి. విద్యుత్తు బిల్లులు, స్టేషనరీ తదితర నిర్వహణ భారాన్ని మోస్తున్నాయి. పేరు ప్రఖ్యాతలు ప్రభుత్వం పొందుతుండగా భారాన్ని మాత్రం పంచాయతీలు భరిస్తున్నాయి. సచివాలయాలొచ్చాక... తమకు ఏమాత్రం విలువ లేకుండాపోయిందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో సంఘం ఇచ్చిన పిలుపు మేరకు విద్యుత్తు బిల్లులు, స్టేషనరీ తదితరాలు కొనుగోలుకు నిధులివ్వరాదని నిర్ణయించుకున్నారు. గతంలో హరిత రాయబారుల జీతాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుండగా ఇటీవల నిలిపి వేసింది. ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలపై మోపింది. వీరికి జీతాల చెల్లింపునకు సహకరించరాదని రెండు జిల్లాల్లోని సర్పంచులు ఏకాభిప్రాయంతో ఉన్నారు.

భారీగా బకాయిలు

గ్రామ పంచాయతీల నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో రూ.253 కోట్లు, అన్నమయ్యలో రూ.440 కోట్ల విద్యుత్తు బిల్లుల బకాయిలున్నాయి. ఆర్థిక సంఘం నిధుల నుంచి వైయస్‌ఆర్‌ జిల్లాలో రూ.3 కోట్లు, అన్నమయ్య జిల్లాలో రూ.8 కోట్లు వరకు వసూలు కాగా,  సర్పంచుల ఆందోళన నేపథ్యంలో పూర్తిగా వసూళ్లు నిలిచిపోయాయి. మరోవైపు విద్యుత్తు పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్‌ మాత్రం బిల్లులు కట్టకుంటే కనెక్షన్లు కట్‌ చేస్తామని హెచ్చరిస్తోంది.


బిల్లులు కట్టొద్దు

సర్పంచులెవరూ విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దని రాష్ట్ర నేతలు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తాం. ప్రభుత్వం మళ్లించిన గ్రామ పంచాయతీల నిధులు తిరిగి ఇవ్వాలి.

- కొత్తపు మునిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పంచాయతీరాజ్‌ ఛాంబరు


ప్రభుత్వం భారం మోపుతోంది

ఇప్పటికే సొంత నిధులు వెచ్చించి ప్రజలకు సేవలందిస్తున్నాం. గ్రామ పంచాయతీల గల్లాపెట్టె ఖాళీ చేసి ఇప్పుడు ఇతరత్రా భారాలు మోపడం ప్రభుత్వానికి సరికాదు.

- ఎం.నాగరాజు, సర్పంచి, కె.దొడ్డిపల్లె, కలకడ మండలం  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని