logo

డీకేటీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు

జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రభుత్వ భూములను కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకుని అక్రమ మార్గంలో సక్రమం చేసుకునే ప్రక్రియకు తెరలేపారు.

Updated : 03 Feb 2023 06:06 IST

రెవెన్యూ, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఆగని అక్రమాలు
రాయచోటిలోని 1.50 ఎకరాలకు సుండుపల్లిలో రిజిస్ట్రేషన్‌
ఫిర్యాదులతో తాఖీదులిచ్చి సరిపెట్టిన అధికార యంత్రాంగం

గున్నికుంట్ల రోడ్డులోని గయాళి భూముల్లో కొనసాగుతున్న నిర్మాణాలు

జిల్లా కేంద్రమైన రాయచోటిలో ప్రభుత్వ భూములను కొంతమంది అక్రమార్కులు ఆక్రమించుకుని అక్రమ మార్గంలో సక్రమం చేసుకునే ప్రక్రియకు తెరలేపారు. కలెక్టరేట్‌కు కేటాయించిన సుమారు రూ.150 కోట్ల విలువైన భూమిని ఇటీవల అక్రమార్కులు అక్రమార్గంలో రిజిస్ట్రేషన్‌ పొందిన వ్యవహారం వెలుగు చూసింది. తాజాగా పట్టణ సమీపంలోని మరో ప్రాంతంలో అలాంటి అక్రమానికే అధికార పక్షంలోని కొందరు తెరలేపారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారని అందిన ఫిర్యాదులతో అక్రమాలు వెలుగు చూశాయి. లోగుట్టుగా రెవెన్యూ అధికారులు సంబంధిత వ్యక్తులకు తాఖీదులిచ్చి వదిలేశారే తప్ప పరుల ఆధీనంలో ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన భూములకు హద్దులు నిర్ణయించి పరిరక్షించే చర్యలు చేపట్టలేదు. దీంతో అక్రమార్కులు ఆ భూములను క్రయవిక్రయాలకు పాల్పడుతూ యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు.

న్యూస్‌టుడే, రాయచోటి

ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలోనే స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి పట్టణ పరిధి, పట్టణానికి 10 కిలోమీటర్ల మేర ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు వెలికి తీయించారు. ఆ సమయంలో సుమారు 2 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములను గుర్తించి జాబితా తయారు చేశారు. జాబితాల్లోని భూముల వివరాలు తెలుసుకున్న కొందరు వాటిని కాజేసే ప్రయత్నాలు సాగించారు. రాయచోటి జిల్లా కేంద్రం కావడంతో గయాళీ, కుంట, వంక పోరంబోకు, రెవెన్యూ భూములను ఆక్రమించే ప్రక్రియ వేగం పుంజుకుంది. ప్రభుత్వ భూములు ఇతరుల అనుభవంలో ఉన్నట్లు, అనువంశకం కింద ఆన్‌లైన్‌ చేయించారు. అక్రమార్కులకు ప్రభుత్వ భూములు సక్రమం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గున్నికుంట్ల రోడ్డులోని 3.5 ఎకరాల భూమి రెవెన్యూ రికార్డుల్లో గయాళిగా నమోదైంది. ఇదే భూమిపై కొందరు సుండుపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు పొంది.సక్రమం చేసుకున్నారు. వీటిపై ఆ గ్రామ సర్పంచితోపాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు సంబంధిత వ్యక్తులకు తాఖీదులు జారీ చేసినా ఎలాంటి పత్రాలు చూపకుండానే పనులు కొనసాగిస్తున్నారని ఆ ప్రాంత వాసులు మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

కాసులకు కక్కుర్తి

సుండుపల్లి రోడ్డులోని నాయీ బ్రాహ్మణులకు చెందిన డీకేటీ భూమిని మాజీ సైనిక ఉద్యోగులకు పట్టాలిచ్చారనే విషయం వెలుగులోకి వచ్చింది. భూమిపై ఏళ్ల తరబడి సాగుదారులుగా ఉన్నప్పటికీ దస్త్రాల్లో మాత్రం మాజీ సైనికులకు చెందినదిగా మారిపోయింది. బాధితులు బీసీ నేత వండాడి వెంకటేశ్వర్లును ఆశ్రయించి వారికి జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకోగా విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రింగ్‌ రోడ్డులోని సర్వే నెంబరు 588లో ఆరెకరాల భూమిని ఆన్‌లైన్‌ చేయించేందుకు సుమారు రూ.30 లక్షల వరకు కొంతమంది రెవెన్యూ అధికారులు తీసుకుని అనంతరం తమ పనులు చేయించలేదని వారం కిందట బాధితులు కలెక్టరుకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం బయటకు పొక్కకుండా ఓ నేతను ఆశ్రయించి అక్రమాలకు పాల్పడిన అధికారులు సర్దుబాటు చేసుకున్న విషయం వెలుగు చూడడం రెవెన్యూ లీలలకు అద్దం పడుతోంది. పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న సంబేపల్లె మండలం మోటకట్ల పరిధిలో సర్వే నంబరు 934/3లో ఉమ్మాన్‌అలీకి చెందిన 3.74 ఎకరాల భూమి ఇతరుల పేరిట ఆన్‌లైన్‌ చేశారని బాధిత రైతు ఏడాదిగా ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోవడం గమనార్హం.

కలెక్టర్‌కు నివేదిస్తాం

ప్రభుత్వ భూముల ఆక్రమణలు ఎక్కడా జరగడం లేదు. గున్నికుంట్ల రోడ్డులో ప్రభుత్వ భూమిని సుండుపల్లిలో రిజిస్ట్రేషన్‌ చేసిన వ్యవహారం మా దృష్టికి వచ్చింది. సంబంధిత వ్యక్తులకు తాఖీదులిచ్చాం. దస్త్రాలను పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక పంపిస్తాం. అక్రమ రిజిస్ట్రేషన్‌ రద్దుకు చర్యలు తీసుకుంటాం. 

రవిశంకర్‌రెడ్డి, తహసీˆల్దారు, రాయచోటి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు