logo

అమాత్యులకు ఆమాత్రం తీరిక లేదా?

అన్నమయ్య జిల్లాతో పోల్చితే వైయస్‌ఆర్‌ జిల్లాలో జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం పుణ్యమా అని అప్పుడప్పుడు డీఆర్సీ సమావేశాలు జరుగుతున్నాయి.

Updated : 22 Jun 2023 06:14 IST

రెండు నెలలకొకసారి డీఆర్సీ అంటూ గొప్పలు
అన్నమయ్య జిల్లాలో రెండు సార్లకే పరిమితం
వైయస్‌ఆర్‌లో అంతా హడావుడే

మామిడి కాయలను గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు (పాత చిత్రం)

ఈనాడు, కడప: అన్నమయ్య జిల్లాతో పోల్చితే వైయస్‌ఆర్‌ జిల్లాలో జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశం పుణ్యమా అని అప్పుడప్పుడు డీఆర్సీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం జడ్పీ సమావేశం, సాయంత్రం డీఆర్సీ సమావేశం, అజెండా పుస్తకంలో పేజీలు తిప్పడం, చదవడం, ముగించడం వరకే పరిమితమవుతున్నాయి. ఈ విషయాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో ప్రస్తావించి ప్రశ్నించారు. ఇలా తూతూమంత్రంగా సమావేశం ముగిస్తే ఎలాగని, తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం లేకుండా పోతోందంటూ మండిపడ్డారు. గత నెల 19న డీఆర్సీ సమావేశం ముహూర్తం ఖరారు చేసినప్పటికీ, ఇందులో అజెండాగా ఉన్న జిల్లా అసైన్‌మెంట్‌ కమిటీ సమావేశంతో తలెత్తే తలనొప్పులతో వాయిదా వేశారు. త్వరలోనే సమావేశం పెడతామంటూ జిల్లా బాధ్య మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించినప్పటికీ ఆ ఊసే లేకుండా పోయింది.

* అటు అన్నమయ్య, ఇటు వైయస్‌ఆర్‌ జిల్లాల్లో ప్రజానీకం ఎన్నో సమస్యలతో సతమతమవుతోంది. అన్నదాతలైతే తీవ్ర నష్టకష్టాలతో విలవిలలాడిపోతున్నారు. వీరి కష్టాలపై సమీక్షించి సమస్యలు పరిష్కరించే దిశగా డీఆర్సీ సమావేశాలు నిర్వహించడం లేదు. వైయస్‌ఆర్‌ జిల్లాతో పోల్చుకుంటే అన్నమయ్య జిల్లాలో సీజనల్‌ సమస్యలతో జనం అల్లాడిపోతున్నారు. ఇది వరకు టమోట పంటకు ధర లేక రైతులు పారబోయాల్సిన, పొలాల్లోనే కోయకుండా వదిలిపెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు మామిడి రైతులు ఏడాదిగా పంటను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోతున్నారు. అన్నమయ్యతో పాటు వైయస్‌ఆర్‌ జిల్లాల్లో విస్తారంగా మామిడి తోటలున్నాయి. స్థానికంగా గుజ్జు పరిశ్రమలు లేకున్నా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఎగుమతి చేసి అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన నేతల గుజ్జు పరిశ్రమలు సిండికేట్‌ అయి ధరను పతనం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మామిడి ధర పతనమై రైతులు తీవ్రంగా నష్టపోయారు. గతంలో ప్రకృతి ప్రకోపంతో కొంత నష్టం జరగ్గా, ప్రస్తుతం మార్కెటింగ్‌ చేసుకోలేక పెట్టుబడులు సైతం పొందలేక రైతులు విలవిలలాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పరిస్థితిని సమీక్షించి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి రైతులకు సాయపడే చర్యలు తీసుకోకుండా మంత్రులు సమస్యలను గాలికొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతుండగా రైతులకు అవసరమైన విత్తనాలు, రుణసాయం తదితర అంశాలపై చర్చించే పరిస్థితి లేకుండా పోయింది. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు సమస్యలు గుర్తించి పరిష్కరించే దిశగా ప్రయత్నాలు జరగలేదు. రెండు జిల్లాలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. బిల్లుల చెల్లింపులు సైతం నిలిచిపోయాయి. బిల్లుల భయంతో గుత్తేదారులు పనలు ఆపేసి చేతులెత్తేశారు. ప్రాజెక్టుల్లో నీరున్నా కాలుల్లేక.. ఉన్నా నిర్వహణ లేక నీటి పారుదల జరగడంలేదు. భవిష్యత్తులో రైతులు పంటలేసుకునే పరిస్థితి కనిపించడంలేదు. అభివృద్ధంతా దాదాపు ఆగిపోయింది. పేదల గృహ నిర్మాణం మందకొడిగా సాగుతోంది. రహదారుల నిర్మాణం, నిర్వహణ ఊసేలేకుండా పోయింది. పేదలు ప్రజాప్రతినిధుల వైపు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మంత్రులతో పాటు ఇరు జిల్లాల్లోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల కష్టాలపై సమీక్షించే పరిస్థితి లేకుండా పోయింది. సమీక్షలతో అధికారుల్లో బాధ్యతను పెంపొందించే పరిస్థితి ఉంటుంది.  


‘కొత్తగా పురుడు పోసుకున్న జిల్లా. కొన్నాళ్ల పాటు అన్నమయ్య జిల్లాను పలు సమస్యలు వెంటాడొచ్చు. వీటి పరిష్కారం దిశగా ప్రతి రెండు నెలలకొకసారి జిల్లా సమీక్ష కమిటీ(డీఆర్సీ) సమావేశం నిర్వహించి జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టిస్తాం. ఈ విషయంలో తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటా. ఎవరికీ ఎలాంటి సందేహం వద్దు....’ ఇదీ అన్నమయ్య జిల్లా ఆవిర్భావం అనంతరం గతేడాది మే 31న ఓ కల్యాణ మండపంలో జరిగిన డీఆర్సీ సమావేశంలో జిల్లా బాధ్య మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి అన్న మాటలు.


అన్నమయ్య జిల్లా ఏర్పాటై 14 నెలలు పూర్తయ్యాయి. మంత్రి హామీ ఇచ్చినట్లుగా ఇప్పటివరకు ఏడు డీఆర్సీ సమావేశాలు జరగాల్సి ఉండగా గతేడాది మే 31, అనంతరం నవంబరు 5న మరొకసారి కేవలం రెండుసార్లు మాత్రమే జరిగాయి. గత 8 నెలలుగా ఒక్క సమావేశం కూడా జరగలేదు. అధికారులు మాత్రం జిల్లా బాధ్య మంత్రికి గుర్తు చేస్తున్నా కనికరించడంలేదు. సమయం కేటాయించడం లేదు. డీఆర్సీ కాకున్నా జిల్లా వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని