logo

నేతలకు చంద్రబాబు ఎన్నికల బాధ్యతల అప్పగింత

రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని..

Published : 26 Apr 2024 05:29 IST

రాజంపేటలో చంద్రబాబుతో నేతలు  జగన్మోహన్‌రాజు, పోలి సుబ్బారెడ్డి, బాలసుబ్రహ్మణ్యం

ఈనాడు, కడప: రాజంపేటకు చెందిన కీలక నేతలతో గురువారం తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. రాజంపేట నియోజవర్గంపై సమీక్షిస్తూ విజయానికి ఢోకా లేదని.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అత్యధిక మెజార్టీ తీసుకొచ్చేవిధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్‌రాజు, ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, నేత పోలి సుబ్బారెడ్డిలను ఆదేశించారు. నియోజకవర్గంలో నేతల మధ్య సమన్వయ బాధ్యతలను పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేమన సతీష్‌కు అప్పగించారు. పార్టీ అధికారంలోకి రాగానే కీలకమైన స్థానంలో కూర్చోబెట్టే బాధ్యతలను తాను తీసుకుంటానని జగన్మోహన్‌రాజు, పోలి సుబ్బారెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చారు. రైల్వేకోడూరులో జనసేన పార్టీ అభ్యర్థి గెలుపు కీలకమని.. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని, మరోసారి తాను సమీక్షిస్తానని వేమన సతీష్‌తో అన్నారు. బత్యాల చంగల్రాయుడితోనూ చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైల్వేకోడూరు సభలో బత్యాల వేదికపై కనిపించారు. డోన్‌ నుంచి వచ్చిన సుబ్బారెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడిన చంద్రబాబు.. ఎన్నికల వరకు పుంగనూరు నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. మీకున్న అనుభవాలతో అక్కడ వైకాపా అరాచకాలను ఎదుర్కోనేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో తాను నియోజకవర్గానికి వస్తానని, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డితో కలిసి వ్యూహరచనలు రచిస్తామని, వెంటనే నియోజకవర్గానికి వెళ్లాలని డోన్‌ సుబ్బారెడ్డికి సూచించారు. కడపకు చెందిన తెదేపా నేతలు శ్రీనివాసరెడ్డి, లక్ష్మీరెడ్డి, హరిప్రసాద్‌, అమీర్‌బాబు, గోవర్ధన్‌రెడ్డితో సమావేశమైన చంద్రబాబు ఏమాత్రం తేడాల్లేకుండా పనిచేయాలని, కడప గెలుపు కీలమని, వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు విశ్లేషించారు. గెలుపులో తేడాలొస్తే తన వద్ద ఎవరికీ స్థానం ఉండదని గట్టిగా హెచ్చరించారు. రాయచోటి నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డితో సమావేశమైన చంద్రబాబు అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి పలు సూచనలు చేశారు. ద్వారకనాథరెడ్డితో కలిసి ప్రభావంతమైన మండలాల్లో ఆయన సేవలు వినియోగించుకోవాలని సూచించారు. ద్వారకనాథ్‌రెడ్డి కీలమైన సమయంలో బంధుత్వాన్ని వదులుకుని పార్టీలోకి వచ్చారని, తగిన గౌరవం, స్థానం ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రొద్దుటూరుకు చెందిన ప్రవీణ్‌కుమార్‌రెడ్డికి అంకితభావంతో పనిచేయాలని సూచిస్తూ.అతన్ని కలుపుకొనిపోవాలని అభ్యర్థి వరదరాజులరెడ్డికి సూచించారు. ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని