logo

జగన్‌ పర్యటన... జనానికి యాతన!

కలికిరిలో మంగళవారం జరిగిన సీఎం జగన్‌ బహిరంగ సభ పేలవంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు అని షెడ్యూలిచ్చి సాయంత్రం 4 గంటలకు సీఎం సభా స్థలానికి చేరుకున్నారు.

Published : 01 May 2024 06:03 IST

మండుటెండ భరించలేక మధ్యలోనే ఇంటిముఖం

మాట్లాడుతున్న సీఎం జగన్‌

కలికిరి, కలికిరి గ్రామీణ, పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: కలికిరిలో మంగళవారం జరిగిన సీఎం జగన్‌ బహిరంగ సభ పేలవంగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటలకు అని షెడ్యూలిచ్చి సాయంత్రం 4 గంటలకు సీఎం సభా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ఎండల తాకిడికి అలసిపోయిన జనం సీఎం ప్రసంగం మొదలు పెట్టగానే వెనుదిరిగారు. సీఎం ప్రసంగం ముగించే సమయానికి క్రాస్‌ రోడ్డులోని సభాస్థలం ఖాళీగా దర్శన మిచ్చింది.

సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం జరుగుతుండగా వెనుతిరుగుతున్న జనం

గత ఐదేళ్లుగా బటన్లు నొక్కే కార్యక్రమాల్లో ఏం చెప్పారో. ఇప్పుడూ అదే ప్రసంగాన్ని ఊదరగొట్టారు. అందులోనూ విషయం లేకపోవడంతో సభకు హాజరైన వైకాపా కార్యకర్తలు సైతం అసంతృప్తికి గురయ్యారు. ప్రసంగం పేలవంగా మొదలుపెట్టడంతో సభకు వచ్చిన జనం మొదట్లోనే జారుకున్నారు. పది నిమిషాల్లోనే సగానికిపైగా వెళ్లిపోయారు. తనను తాను పొగుడుకోవడం.. చంద్రబాబును విమర్శించ డానికే పరిమితమయ్యారు. ఎక్కడా కలికిరి పేరు, స్థానిక కూటమి అభ్యర్థుల పేర్లు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. .సీఎం జగన్‌ పర్యటనతో కలికిరి వాసులకు కష్టాలు తప్పలేదు.

వైకాపా కార్యకర్తలు

కలికిరి నాలుగురోడ్ల కూడలి సమీపంలోని ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే మార్గంలో బస్సు పైనుంచి ఆయన ప్రసంగించేలా ఏర్పాటు చేయడంతో మధ్యాహ్నం నుంచి కలికిరిక్రాస్‌ నుంచి ఆర్టీసీ బస్టాండకు వెళ్లే వాహనాలను రాకపోకలు నిలిపి వేశారు. దీంతో వాహనచోదకులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నిర్ణీత సమయానికి గంట ఆలస్యంగా రావడంతో వచ్చిన జనం మండుటెండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమావేశానికి వచ్చిన ఓ మహిళతో పాటు ఓ చిన్నారి స్వల్ప వడదెబ్బకు గురికావడంతో స్థానికులు నీరు అందించడంతో కాసేపటికి కోలుకున్నారు. జగన్‌ సభ సందర్భంగా కలికిరి క్రాస్‌రోడ్డుతో పాటు సన్యాసివారిపల్లె ఫీˆడర్‌ పరిధిలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఎండకు తాళలేక అస్వస్థతకు గురైన బాలిక

అస్వస్థతకు గురైన మహిళ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని