logo

రాక్షస రాజ్యం!

దుష్టులకు అవకాశమిస్తే ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారో ప్రత్యక్ష సాక్ష్యం ఈ నియోజకవర్గం. ఇక్కడ గత ఐదేళ్లుగా అరాచకం రాజ్యమేలుతోంది. తమ వ్యతిరేకులను రాచిరంపాన పెట్టే పెడపాలనతో వైకాపా నేతలు చెలరేగిపోతున్నారు. వైకాపా దత్తపుత్రులైన ఖాకీల పెద్ద మనుషులు నేతల అరాచకకాండకు నిర్లజ్జగా సహకరిస్తున్నారు.

Updated : 07 May 2024 06:39 IST

తాలిబన్‌ పాలనను తలపిస్తున్న తంబళ్లపల్లె
వైకాపా కీలక నేత... అనుచరుల అరాచకాలు
ఆస్తులకే కాదు ప్రజల  ప్రాణాలకూ రక్షణ కరవు
అధికారపార్టీ  నాయకులకు పోలీసుల వత్తాసు
- ఈనాడు, కడప

ఇక్కడ నోరు తెరిస్తే దాడులకు తెగబడతారు...
ప్రశ్నించినా...నిలదీసినా అపహరించి కొడతారు...
ఎదురు మాట్లాడితే ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు...
వైకాపా తప్ప మరేతర జెండా కట్టినా రాళ్ల దాడికి దిగుతారు....
ఇతర పార్టీల నేతలొస్తే అల్లరి మూకలతో దౌర్జన్యాలకు పాల్పడతారు...
భూములను అడిగిన వెంటనే ఇచ్చేయాలి...లేకుంటే లాక్కుంటారు...
సహజ వనరుల దోపిడీ జరుగుతున్నా మౌనంగా ఉండాల్సిందే....
కాంట్రాక్టు పనులన్నీ వాళ్లే చేసుకోవాలి. నాణ్యత గురించి అడక్కూడదు...
ప్రాజెక్టుల నిర్మాణానికి ఇచ్చిన భూములకు పరిహారం ఆశించకూడదు...
చివరికి దేవుడికి కూడా భయపడరు.. మాన్యం భూములే కాదు విగ్రహాలను మింగేస్తారు...
ఇవన్నీ వింటుంటే...  ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్ల పాలన అనుకుంటే పొరపాటే.
దాన్ని తలదన్నేలా గత ఐదేళ్లుగా ప్రజల మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ లేని తంబళ్లపల్లె నియోజకవర్గం.
తమ స్వలాభం కోసం జనం నెత్తురు కళ్లజూసే పాలకులు...పచ్చి కిరాతకులు ఏలుతున్న రాక్షస ప్రాంతమిది.


 

వైకాపా నేతల అరాచకాలపై హెచ్చరించిన చంద్రబాబు

‘ మళ్లీ అంగళ్లుకు వస్తాను. ఇక్కడ రౌడీయిజాన్ని అణచివేస్తాను. ఆంబోతులా వ్యవహరిస్తున్న వైకాపా నేతలను తొక్కేస్తాను. కుటుంబ ఆధిపత్యాన్ని భూస్థాపితం చేస్తాను’ ఇదీ తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఆదివారం నిర్వహించిన బహిరంగసభలో తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు హెచ్చరిక.


దుష్టులకు అవకాశమిస్తే ఎంతటి దుర్మార్గానికైనా ఒడిగడతారో ప్రత్యక్ష సాక్ష్యం ఈ నియోజకవర్గం. ఇక్కడ గత ఐదేళ్లుగా అరాచకం రాజ్యమేలుతోంది. తమ వ్యతిరేకులను రాచిరంపాన పెట్టే పెడపాలనతో వైకాపా నేతలు చెలరేగిపోతున్నారు. వైకాపా దత్తపుత్రులైన ఖాకీల పెద్ద మనుషులు నేతల అరాచకకాండకు నిర్లజ్జగా సహకరిస్తున్నారు. గతంలో తెదేపా అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు అంగళ్లు మీదుగా పూతలపట్టు వెళుతుండగా వైకాపా అల్లరిమూకలు దాడులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో చంద్రబాబుతో పాటు మరో 600 మంది తెదేపా నేతలు, కార్యకర్తలపైనే ఎదురు కేసులు పెట్టి ఖాకీ దుస్తుల పరువును వారే గాల్లో కలిపేసుకున్నాయి.


నియోజకవర్గంలో గత అయిదేళ్లుగా చోటుచేసుకున్న పరిస్థితులు, పరిణామాలను దగ్గరుండి చూస్తున్న ప్రజలు పగబట్టే పాముకు పాలు పోసినట్లుగా ఉందంటూ పశ్చాత్తాపం చెందుతున్నారు. ‘ఒక్క  అవకాశం’ అంటూ వేడుకుంటే నమ్మకంతో ఓసారి ఇస్తే పోలే అనుకుంటే అసలుకే ఎసరు పెట్టారని బాధపడుతున్నారు. తమ ఆస్తులకే కాదు ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని భయాందోళనకు గురవుతున్నారు. రానున్న ఎన్నికల్లోనూ దౌర్జన్యంతోనే మరోసారి అందలం ఎక్కాలనుకుంటున్న అరాచక నేత ఎత్తుగడలపై కొరడా ఝళిపించేందుకు ప్రజానీకం ఓటు అనే వజ్రాయుధంతో సిద్ధంగా ఉన్నారు.


నిండు గర్భిణి అని చూడకుండా  కాళ్లతో తన్ని...

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్యాణి

ఊర్లో వీధి దీపాలు వెలగడంలేదని అధికార వైకాపా నేతల వద్ద భర్త ప్రస్తావించడమే ఆమెకు శాపమైంది. కూటగోళ్లపల్లెలో ఆదివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు వైకాపా అభ్యర్థి ద్వారకనాథరెడ్డి భార్య పెద్దిరెడ్డి కవిత నేతలతో కలిసి ప్రచారానికి వెళ్లారు. ఇంటి ముంగిటకు వచ్చిన నేతలను వీధి దీపాలు పనిచేయకపోవడంతో అసౌకర్యంగా ఉందంటూ స్థానికుడు మల్లికార్జున ప్రస్తావించారు. నీకు ఎంత ధైర్యం.. మమ్మల్నే అడిగేంతగా ఎదిగావా.. జాగ్రత్త అంటూ దౌర్జన్యానికి దిగారు. వైకాపా మూకల తీరును మల్లికార్జున భార్య కల్యాణి గట్టిగా నిలదీశారు. దీంతో ప్రచారానికి వచ్చినవారంతా కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. కల్యాణి ఎనిమిది నెలల గర్భిణి అని చూడకుండా కాలితో తన్నడం, పిడిగుద్దులు గుద్దడంతో అకస్మారక స్థితికి చేరుకుంది. గాయ పడిన మల్లికార్జున దంపతులను ఆసుపత్రికి తరలించారు. తోటి మహిళపై దాడులు చేస్తున్నా అభ్యర్థి భార్య చూస్తూ ఊరుకున్నారు తప్ప తన అనుచరులను వారించకపోవడం గమనార్హం.


పరామర్శకు వెళితే  దారికాసి కొట్టారు

అంగళ్లులో 2020లో నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి వాహన శ్రేణిపై వైకాపా రాళ్ల దాడి (పాత చిత్రం)

బి.కొత్తకోటలో మరణించిన తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి 2020, డిసెంబరులో తెదేపా కీలక నేతలు నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌తో పాటు పలువురు నేతలు వెళుతుండగా ఆంగళ్లులో వైకాపా కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలు కాగా, వాహనాలు ధ్వంసమయ్యాయి. అప్పట్లో జరిగిన అరాచకం రాష్ట్రంలోనే పెద్ద సంచలనమైంది.


ర్యాలీలు చేశారని రాళ్లతో దాడులు

ములకలచెరువులో తెదేపా శ్రేణులపై దాడులకు పాల్పడ్డ వైకాపా నేతలు

పోలీసుల అనుమతులతో పెద్దమండ్యంలో సోమవారం తెదేపా నేతలు ర్యాలీలు, సభలు నిర్వహించగా వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాయి. తామూ ర్యాలీలు చేయాలంటూ ముందుకురాగా.. పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. గతేడాది తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట¨్టన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా సంఘీభావం ప్రకట¨స్తూ తెదేపా నాయకులు ములకలచెరువులో ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో వైకాపా శ్రేణులు తెదేపా నాయకులపై రాళ్లతో దాడికి పాల్పడి పలువురు కార్యకర్తలను గాయపరిచారు. దాడిలో అప్పట¨ తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ను సైతం ఇబ్బంది పెట్టారు. ఘటనలో సుమారు 10మందికి పైగా తెదేపా కార్యకర్తలు గాయపడ్డారు. మరికొంత మందిని పోలీసుస్టేషన్‌కు తరలించగా, హోటళ్లలో భోజనం చేస్తున్న పలువురు కార్యకర్తలపై కూడా దాడులకు పాల్పడ్డారు.


తెదేపా సభకు వెళ్లారని అపహరణ

పెద్దమండ్యం సభలో బాధితుడు మల్లికార్జున (వృత్తంలో ఉన్న వ్యక్తి)కు భరోసా ఇస్తున్న తెదేపా నేతలు

అంగళ్లులో ఆదివారం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బహిరంగసభ విజయవంతం కావడాన్ని వైకాపా నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సభకు వెళ్లిన పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త మల్లికార్జునపై ఆదివారం రాత్రి వైకాపా నేతలు దాడి చేయడమే కాకుండా ఆపై అపహరించుకుపోయారు. విషయం తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన మదనపల్లె డీఎస్పీకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. పెద్దమండ్యం పోలీసులు వెలిగల్లుకు చేరుకుని వైకాపా నేతలకు కాళ్లావేళ్లాపడి విడుదల చేయించారు. నిందితులపై  ఎలాంటి చర్యా తీసుకునే శక్తి పోలీసులకు లేకుండా పోయింది.


భూములను లాక్కుని  కేసులు పెట్టి...

బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు క్రాస్‌వద్ద భూముల కోసం యజమానులపై వైకాపా దాడులు

బి.కొత్తకోట మండలం కాండ్లమడుగుకు చెందిన నారాయణ సోదరులకు చెందిన రూ.3 కోట్ల విలువైన భూమిని కీలక నేత అనుచరులు కబ్జా చేశారు. ఆదే భూమికి కంచె వేస్తుండగా భూ యాజమానులు ఈ భూమి మాది అని ప్రశ్నించగా వైకాపా నాయకులు వారిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో నారాయణ, ఆయన సోదరులు, కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. దాడిని సీరియస్‌గా తీసుకున్న అప్పట¨ ఎస్పీ హర్షవర్థన్‌రాజు అయిదుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


జిల్లా నుంచే పంపించేశారు

తంబళ్లపల్లెకు చెందిన తెదేపా రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డి ఆ పార్టీలో చేరినప్పట¨ నుంచి 35 కేసులు నమోదు చేశారు. చివరకు ఆయనను జిల్లా బహిష్కరణ కూడా చేశారు. ఆయనతో ఉన్న పలువురు అనుచరులపై కూడా కేసులు నమోదు చేయించారు. పెద్దమండ్యం మండలంలో ఐదేళ్ల వైకాపా పాలనంలో కలిచెర్ల పంచాయతీ, చెరువుకిందపల్లిలో తెదేపా నాయకులు చౌడప్ప, రాంమోహన్‌, సి.గొళ్లపల్లి పంచాయతీకి చెందిన ఓబులేసు, పెద్దమండ్యంకు చెందిన గంగాధర్‌, మహేష్‌లపై దాడులకు పాల్పడి గాయపరిచారు. అక్రమ కేసులు నమోదు చేశారు.


జడ్జిపైనా అరాచకకాండ

ఇటీవల జడ్జి రామకృష్ణ ఇంటిపై జరిగిన దాడిని పరిశీలిస్తున్న పోలీసులు

బి.కొత్తకోటలో నివాసముంటున్న జడ్జి రామకృష్ణపై ఇప్పటికే పలుమార్లు దాడులు జరిగాయి. జడ్జి.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని పలుమార్లు విమర్శించారు. అన్యాయాలను ఎత్తిచూపారనే అక్కసుతో వరుస దాడులు జరిగాయి. ఇటీవల మరోసారి ఆయన ఇంటిపై దాడి చేసి కారు, ఫర్నిచర్‌, కిటికీలు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని జడ్జి ఆరోపించారు.


తెదేపా శ్రేణులపై విచక్షణారహితంగా దాడులు

శంకర్‌యాదవ్‌ను అడ్డుకుంట్ను పోలీసులు (పాత చిత్రం)

గతేడాది తంబళ్లపల్లె మండలం కోటకొండలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌ ‘బాదుడే బాదుడే’ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా, అక్కడే ఉన్న వైకాపా నాయకులు అడ్డుకున్నారు. తెదేపా నాయకులను వెంబడించి చితకబాదారు. కార్యక్రమానికి వస్తున్న శంకర్‌యాదవ్‌ను ముదివేడు పోలీసులు కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా అడ్డుకుని వెనక్కి పంపేశారు. గత నెల 22న తెదేపా అభ్యర్థి జయచంద్రారెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి వెళ్లిన ముగ్గురు తెదేపా నాయకులపై నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు  నమోదు చేశారు.  


400 ఎకరాలు  కాజేశారు

నియోజకవర్గ కీలక నేత కురబలకోట మండలం అంగళ్లలో రూ.2 వేల కోట్ల విలువైన 400 ఎకరాల భూములను ఆక్రమించారు. గతంలో ముదివేడు ఎస్‌.ఐ.గా పని చేసిన అధికారి ద్వారా రైతులను భయపెట్టి భూముల్ని లాక్కున్నారు. ఎకరా రూ.20 లక్షల విలువైన వాటిని రూ.2 నుంచి రూ.3 లక్షలకు లాగేసుకున్నారు.  ములకలచెరువులో 10 ఎకరాలు, మల్లయ్యకొండ వద్ద రైతుల భూములు 85 ఎకరాలు కాజేశారు. కీలక నేత బామ్మర్ది కంటేవారిపల్లెలో 25 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసేశారు. మల్లయ్యకొండ అభివృద్ధి చేస్తానంటూ ఆలయ భూములతోపాటు ఆలయలంలోని విగ్రహాలను మింగేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


తెదేపా జెండా పీకేసి దౌర్జన్యం
- చిన్నారెడ్డి, ములకలచెరువు

మా ఇంటిపై తెదేపా జెండా ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని వైకాపా నేతలు పీకేశారు. మా ఇంటిపై దాడికి వచ్చారు. జెండా ఎందుకు పీకేశారని వారిని ప్రశ్నిస్తే మాపైనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేయించి వేధింపులకు పాల్పడ్డారు.


అక్రమ కేసులు  బనాయిస్తున్నారు
- గంగాధర్‌, పెద్దమండ్యం

పెద్దమండ్యం మండలంలోని తెదేపా కీలక నేతలను లక్ష్యంగా చేసుకుని వైకాపా నేతలు దాడులకు పాల్పడుతున్నారు. మాట వినకపోతే ఏదోవిధంగా వారిపై దాడులు చేయించి కేసులు నమోదు చేయిస్తున్నారు.  మా ఇంట్లో నిషేధిత వస్తువులు ఉన్నట్లు చీత్రికరించి వైకాపా నాయకుల మాటలు విని పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని