logo

వడగండ్లు... రైతులకు కడగండ్లు

మండలంలోని బూడిదవేడులో సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. దాదాపు 30 ఎకరాల్లో బొప్పాయి, టమాట, వరి తదితర పంటలన్నీ నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

Published : 08 May 2024 05:34 IST

బూడిదవేడులో పంటలు నేలమట్టం
వైకాపా ప్రభుత్వ హయాంలో దక్కని సాయం

వాల్మీకిపురం, న్యూస్‌టుడే : మండలంలోని బూడిదవేడులో సోమవారం రాత్రి భారీ గాలులతో కూడిన వడగండ్ల వానకు పంటలన్నీ నేలమట్టమయ్యాయి. దాదాపు 30 ఎకరాల్లో బొప్పాయి, టమాట, వరి తదితర పంటలన్నీ నేలకొరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2022లో కూడా కురిసిన వాడగండ్ల వానకు వరి నేల మట్టమైపోయిందని, అయితే జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో తమకు పైసా కూడా నష్ట పరిహారం అందివ్వకపోవడంతో నిట్టనిలువునా మునిగిపోయామని వాపోతున్నారు. ప్రస్తుతం మరో మారు ప్రకృతి కన్నెర్ర జేయడంతో పంట దిగుబడులన్నీ నేలమట్టమై పోయాయని రైతులు కన్నీరు పెడుతున్నారు. బూడిదవేడుకు చెందిన మహిళా రైతు పావని తనుకున్న నాలుగెకరాల్లో దాదాపు రూ.4 లక్షలు వెచ్చించి బొప్పాయి సాగు చేశారు. పంట చేతికందే సమయంలో కురిసిన వడగండ్లతో కూడిన భారీ వర్షానికి దిగుబడి అంతా నేలమట్టమై తీవ్రంగా నష్ట పోయామని మహిళా రైతు వాపోయారు. ఇదే గ్రామానికి చెందిన రంగారెడ్డి మరో నాలుగెకరాల్లో బొప్పాయిని రూ.4 లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేశారు.

సోమవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి పంట మొత్తం నేల మట్టమైంది.  ఇదే గ్రామానికి చెందిన మహిళా రైతు ప్రభావతి రెండెకరాల్లో రూ.3 లక్షలు వెచ్చించి టమాట సాగు చేశారు. పంట దిగుబడి చేతికి అందే సమయంలో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురవడంతో పంట నేలమట్టమై పోయిందని మహిళా రైతు కన్నీరు మున్నీరయ్యారు. మండలంలోని మేకలవారిపల్లెకు చెందిన రామయ్య దాదాపు రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టి భూమిని కౌలుకు తీసుకుని బొప్పాయి సాగుచేశారు. వరుణుడు కనుకరించకపోవడంతో చేతికి అందే దిగుబడి మొత్తం నేలపాలైంది. ప్రభుత్వం సాయం అందించాలని అర్థిస్తున్నాడు. అలాగే తూర్పుపల్లెకు చెందిన సావిత్రమ్మ ఎకరం పొలంలో సాగు చేసిన మిరప దెబ్బతినగా, ఇదే గ్రామానికి చెందిన కేశవరెడ్డి 3.5 ఎకరాల్లో బొప్పాయి సాగు చేయగా పంట నేలకొరిగింది. తమకు ప్రభుత్వ సాయం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.


చిల్లిగవ్వ అందని పరిహారం

- రంగారెడ్డి, బొప్పాయి, రైతు

ఆరుగాలం కష్టపడి రూ.4 లక్షలు అప్పుచేసి పెట్టుబడులు పెట్టి ఏడాదిగా కష్టపడి బొప్పాయిని సాగు చేశాం. అయితే వరుణుడు కన్నెర్ర చేయడంతో దిగుబడి మొత్తం నేలపాలైంది. గతంలో 2022లో సైతం సాగు చేసిన పంటలు భారీ వర్షానికి నేలమట్టమయ్యాయి. ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా తమకు చిల్లిగవ్వ కూడా పరిహారం అందివ్వలేదు. ఈ వైకాపా ప్రభుత్వ హయంలో అతివృష్టి, అనావృష్టితో సర్వం కోల్పోయాం.


నాలుగెకరాల్లో పంట నష్టం

- ప్రభావతి, మహిళా రైతు, బూడిదవేడు

వడగండ్ల వర్షానికి రెండెకరాల్లో రూ.3 లక్షలతో సాగు చేసిన టమాట పంట మొత్తం నేల మట్టమైంది. 2022లో సైతం వరి పంట మొత్తం నేలమట్టమైపోయింది. పరిహారం అందిస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పైసా కూడా విదల్చకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం. ఈ ప్రభుత్వ హయంలో నష్టాలు, కష్టాలు తప్పితే ప్రయోజనం శూన్యం. అధికారులు స్పందించి న్యాయం చేయాలి.


మూడుసార్లు పంటలకు దెబ్బ

- పావని మహిళా రైతు

పేరుకే ఆర్బీకేలు, సచివాలయాలు, ఆచరణలో రైతులకు అందే ప్రయోజనం ఏమీలేదు. వీటి వల్ల 20 శాతం మంది రైతులకు ప్రయోజనాలు కలిగిని దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వ హయంలో మూడు సార్లు పంట నష్టపోయాం, తాజాగా మళ్లీ నాలుగు ఎకరాల బొప్పాయి దిగుబడి వర్షానికి నేలమట్టమైంది. ఈ ప్రభుత్వ హయంలో రైతులకు సాయం అందక చాలా ఇబ్బందులు పడ్డాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు