logo

వైకాపా నేతలు... కబ్జాల మేతలు

ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లె పట్టణంలో వైకాపా పాలన అలజడి రేపింది... సీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న పట్టణం కావడంతో ఆంధ్రా ఊటీగా పేరొందింది.. చల్లటి వాతావరణం ఇక్కడి ప్రత్యేకత.

Published : 10 May 2024 03:33 IST

కనుమరుగైన కొండలు, గుట్టలు
సొమ్ము చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు

ప్రశాంతతకు మారుపేరైన మదనపల్లె పట్టణంలో వైకాపా పాలన అలజడి రేపింది... సీమలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న పట్టణం కావడంతో ఆంధ్రా ఊటీగా పేరొందింది.. చల్లటి వాతావరణం ఇక్కడి ప్రత్యేకత. అయిదేళ్ల జగన్‌ పాలనలో ఆ ప్రశాంతత అంతా దూరమైంది... గుట్టలు మాయం కావడంతో పచ్చదనం హరించుకుపోయి వేడి గాలులతో ఆంధ్రా ఊటీ కాస్త లూటీ అయింది. గుట్టలు ఖాళీ చేసి మట్టిని అమ్ముకోవడంతో పాటు ఆ ఖాళీ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి అమ్మేశారు. వైకాపా నేతల మేతకు మదనపల్లె పట్టణం నాశనం అయిందన్నది నిష్టూర సత్యం.   

న్యూస్‌టుడే, మదనపల్లె గ్రామీణ

  • మదనపల్లె పట్టణంలోని పలు వార్డుల్లో ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి. గట్టలు, వంకల్లోని మట్టిని విక్రయించడం.. చదును చేసిన స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు నిర్లక్ష్యంతో వైకాపా నాయకుల చేతివాటంగా యథేచ్ఛగా కొనసాగింది.

అపపగుట్టలో తవ్వేసిన కొండ

  • మదనపల్లె పురపాలక సంఘం పరిధిలోని 1, 2 వార్డుల్లో కొండలు, 33, 34, 35 వార్డుల్లో గుట్టలున్నాయి. ఇక్కడ ఇవన్నీ ప్రభుత్వ స్థలాలు కాగా. వీటిపై వైకాపా నాయకుల కన్ను పడింది. కొండలు గుట్టలను జేసీబీలతో తోడేస్తున్నారు. మట్టిని ట్రాక్టర్లలో నింపి లేఅవుట్లకు, ఇంటి పునాదులు నింపేందుకు విక్రయిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌ మట్టిని రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా గుట్టలు, వంకలు చదును చేసిన తరువాత వాటిని ప్లాట్లుగా మార్చి ఇతరులకు విక్రయించడం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదంతా వార్డులోని కొందరు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల హస్తంతోనే జరిగిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. కుంట స్థలం (రెండున్నర సెంట్లు) రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షలతో విక్రయాలు చేస్తున్నారు. అంతా బయట వ్యక్తులకే కట్టపెడుతున్నారు.
  • పట్టణంలోని కదిరి రోడ్డు, కోళ్లబైలు పంచాయతీ నడుమ అమ్మచెరువు మిట్టలో ప్రభుత్వ స్థలాలు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. అలాగే అనపగుట్ట, వైయస్‌ఆర్‌ కాలనీ, శ్రీవారినగర్‌, బీకే పల్లెల్లోని గుట్టల్లో సెంటు భూమి కనిపిస్తే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అధికార పార్టీ నాయకులే దందా సాగిస్తుండడంతో రెవెన్యూ అధికారులు వీటిపై చర్యలు తీసుకోవడం లేదు. నిరుపేదలు ఎవరైనా సెంటు భూమిలో నిర్మాణం చేపడితే జులుం చెలాయించడం, సామగ్రి తీసుకెళ్లడం వంటి చర్యలకు పాల్పడే అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కుమ్మకై అక్రమ నిర్మాణాలు చేయిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

మంజునాథ కాలనీలో అక్రమంగా మట్టిని తరలించి చదును చేసిన గుట్ట

  • నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ నిరుపేదల పేరుతో స్థలాలు ఆక్రమించి ఇళ్లను నిర్మించుకోవడం గమనార్హం. మరోసారి వైకాపాకు అధికారం కట్టపడితే నియోకవర్గంలోని నిరుపేదల ప్రైవేటు భూములు కూడా ఆక్రమించుకుంటారని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.

కొండలు...  గుట్టలు ఆక్రమణ

వైకాపా నాయకులు పట్టణ సరిహద్దు ప్రాంతాల్లోని అమ్మచెరువుమిట్ట, బీకేపల్లె గుట్టలను చదును చేస్తున్నారు. ఇక్కడి స్థలాలను ఆక్రమించి విక్రయిస్తున్నారు. ఎర్రగానిమిట్ట వద్ద ప్రభుత్వ గుట్టల్లో మట్టిని తవ్వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులకు కొమ్ము కాస్తున్నారు. చదును చేసిన స్థలాలను విక్రయిస్తున్నారు. భూస్వాములైన నాయకులే నిరుపేదల స్థలాలపై కన్ను వేస్తున్నారు. డీకేటీ స్థలాలు, ప్రభుత్వ గుట్టలు, వంకలను సైతం ఆక్రమించేస్తున్నారు. అడ్డుపడితే తిరగబడుతున్నారు. అక్రమ కేసులు పెడుతున్నారు.

 శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి, సీపీఎం, మదనపల్లె

అధికార పార్టీ  కబ్జాలకు హద్దేదీ?

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత మదనపల్లె పట్టణంలో భూకబ్జాలు పేట్రేగిపోయాయి. వైయస్‌ఆర్‌ కాలనీ, అనపగుట్ట, శ్రీవారినగర్‌, కురవంక, వన్నూర్‌సాబ్‌ గుట్టల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలపై కన్ను వేశారు. వాటిని చదును చేయడం మధ్య తరగతి కుటుంబాలకు విక్రయించి సొమ్ము చేసుకోవడం తదితర కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. వార్డుల్లో కీలకపాత్ర వహిస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులే ఈ కబ్జాలకు పాల్పడుతున్నారు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే మదనపల్లె పట్టణంలోనే కాకుండా సరిహద్దు గ్రామాల్లో ఒక్క సెంటు ప్రభుత్వ భూమి కనిపించదు.

మురళి, నియోజకవర్గ కార్యదర్శి, మదనపల్లె

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని