logo

Andhara News: ‘అమ్మ’కెలా చెప్పేది..?

ఒక్కగానొక్క కొడుకు...ప్రాణాలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుని జీవిస్తున్నారా తల్లిదండ్రులు.  పరాయిదేశం వెళ్తానంటే తల్లడిల్లారు.  ఎట్టకేలకు అమ్మానాన్నల్ని ఒప్పించాడా యువకుడు. ఇంకోవైపు కొత్తగా పెళ్లై నిండు గర్భిణిగా ఉన్న భార్యకు నచ్చజెప్పాడు. అందరి

Updated : 14 Feb 2022 07:08 IST

అమెరికాలో మృతిచెందిన యువకుడి ఇంట విషాదం 

కలిదిండి, న్యూస్‌టుడే

క్కగానొక్క కొడుకు...ప్రాణాలన్నీ ఆ బిడ్డపైనే పెట్టుకుని జీవిస్తున్నారా తల్లిదండ్రులు.  పరాయిదేశం వెళ్తానంటే తల్లడిల్లారు.  ఎట్టకేలకు అమ్మానాన్నల్ని ఒప్పించాడా యువకుడు. ఇంకోవైపు కొత్తగా పెళ్లై నిండు గర్భిణిగా ఉన్న భార్యకు నచ్చజెప్పాడు. అందరి ఆమోదాన్ని తీసుకుని అమెరికాలో అడుగుపెట్టాడు. మూడునెలలు తిరగకుండానే ఆ యువకుడి మరణవార్త ఆ తండ్రి గుండెల్ని బద్దలు చేసింది. 

కలిదిండికి చెందిన చిట్టూరి సచ్చిదానంద వీఆర్‌ఓగా పనిచేసి పదవీ విరమణ పొందారు.ఆయన కుమారుడు సత్యకృష్ణ భీమవరంలో బీటెక్‌ పూర్తిచేశారు. ఎంఎస్‌ చేయాలన్న తన ఆకాంక్షను తల్లిదండ్రులకు చెప్పగా మొదట్లో వద్దని వారించారు. గర్భిణిగా ఉన్న భార్య కూడా ‘ఇక్కడే ఎక్కడైనా మంచి కంపెనీలో ఉద్యోగం చేసుకుంటే బాగుంటుందని’ సూచించారు. తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్న పట్టుదలతో తల్లిదండ్రులు, భార్యను ఒప్పించి సత్యకృష్ణ అన్ని ఏర్పాట్లు చేసుకుని 2021 డిసెంబరులో అమెరికా చేరుకున్నాడు. పగటిపూట చదువుకుంటూ రాత్రిళ్లు కొంతసమయం ఉద్యోగం చేసుకోవాలన్న అభిలాషతో సూపర్‌బజార్‌లో చేరారు. ఈ క్రమంలో గురువారం ఉదయం 7.30గంటల సమయంలో సత్యకృష్ణ ఫోన్‌ ద్వారా తండ్రితో మాట్లాడారు. అంతా బాగానే ఉందని, తాను సంతోషంగానే ఉన్నానని చెప్పడంతో సచ్చిదానంద కాసేపు కొడుకుతో మాట్లాడి ఆ విషయాలను భార్యతో పంచుకున్నారు. ఒక గంట తరవాత మళ్లీ ఫోన్‌ మోగింది. ఈసారి అవతల మాట్లాడింది తన బిడ్డ కాదు. ఎందుకో అతని మనసు కీడు శంకించింది. ‘గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో సత్యకృష్ణ మరణించాడన్న వార్త ఆయన చెవినపడగానే ఒక్కసారిగా ఊపిరాగిపోయినంత పనైంది. ‘ఏమైంది? ఫోన్‌లో మాట్లాడింది ఎవరు?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్న భార్య మాటలు వినబడనట్లుగా దుఃఖాన్ని గొంతులోనే నొక్కిపట్టి గబగబా నడుచుకుంటూ బయటకొచ్చేశారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యకు బిడ్డ చనిపోయాడన్న వాస్తవం తెలిస్తే ఆమె ఏమైపోతుందోనన్న భయం కమ్మేసింది. నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక తనలోతానే కుమిలిపోతున్నారు. ఆదివారం నాటికి ఈ సంఘటన జరిగి నాలుగు రోజులైనా ఆ విషయాన్ని సత్యకృష్ణ తల్లికి తెలియనివ్వలేదు. మరోవైపు భీమవరంలో ఉన్న సత్యకృష్ణ భార్య ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. ఈ దుర్ఘటన ఆమె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం  చూపుతుందోనని ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వీరిని ఎలా ఓదార్చాలో తెలియక బంధుమిత్రులు ఆవేదన చెందుతున్నారు. సత్యకృష్ణ పార్థివదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు ప్రవాసాంధ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని