logo

Andhra News: యూట్యూబ్‌ చూసి బ్యాంకుల్లో చోరీలు..

ఐటీఐ చదివి వ్యసనాలకు బానిసైన యువకుడు యూట్యూబ్‌లో చూసి బ్యాంకు చోరీలకు పాల్పడుతూ కటకటాల పాలయ్యాడు. డీఎస్పీ బంగ్లాలో శనివారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ విజయభాస్కరరావు కేసు వివరాలు వెల్లడించారు.

Updated : 03 Apr 2022 08:57 IST


నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ విజయభాస్కరరావు

నరసరావుపేట పట్టణం, న్యూస్‌టుడే: ఐటీఐ చదివి వ్యసనాలకు బానిసైన యువకుడు యూట్యూబ్‌లో చూసి బ్యాంకు చోరీలకు పాల్పడుతూ కటకటాల పాలయ్యాడు. డీఎస్పీ బంగ్లాలో శనివారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ విజయభాస్కరరావు కేసు వివరాలు వెల్లడించారు. గుంటూరు నల్లచెరువు ప్రాంతంలో ఉంటున్న పల్లా రాజేష్‌ ఐటీఐ చదివాడు. వ్యసనాలకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలు చేయడం ఎలానో యూట్యూబ్‌లో చూస్తుంటాడు. ఈ క్రమంలో బ్యాంకుల్లో దొంగతనాలకు పాల్పడ్డాడు. 2021 ఆగస్టులో గుంటూరులోని గాంధీపార్కు ఎదురుగా ఉన్న హెచ్‌డీఎప్‌సీ బ్యాంకులో రూ.23 లక్షలు అపహరించాడు. లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి రాజేష్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈఏడాది మార్చిలో బెయిల్‌పై విడుదల అయిన అతను కోటప్పకొండ తిరునాళ్లకు వచ్చాడు. తిరిగి గుంటూరు వెళ్లే సమయంలో ఫిరంగిపురం ఎస్‌బీఐ వద్ద సెక్యూరిటీ గార్డు లేకుండా ఉండటాన్ని గమనించాడు. ఆ బ్యాంకులో చోరీకి పథకం రచించాడు. మార్చి 30న ఇనుపరాడ్లు, కత్తెరలతో బ్యాంకులోకి ప్రవేశించి అలారం తీగలు కత్తిరించాడు. కట్టర్‌ సాయంతో స్ట్రాంగ్‌ రూం డోర్‌ తొలగించేందుకు ప్రయత్నించగా మేనేజర్‌ ఫోన్‌లో అలారం మోగింది. దీంతో మేనేజర్‌ బ్యాంకు సమీపంలో ఉన్న సిబ్బందిని అలర్ట్‌ చేశారు. బ్యాంకు సిబ్బంది రాకను గమనించిన దొంగ అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన ఫిరంగిపురం పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. సీఐ భక్తవత్సలరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందంలోని ఏఎస్సైలు సుబ్బారావు, రోసిబాబు, కె.శ్రీనివాసరావు, ఎం.శ్రీనివాసరావు, కానిస్టేబుల్‌ మధు నిందితుడిని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ విజయభాస్కరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని