logo

మార్చేస్తున్నా.. మారరంతే..!

విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు.

Updated : 26 Apr 2024 05:38 IST

తెదేపా నేతల కదలికలపై నిఘా
వైకాపా విధేయ పోలీస్‌ అరాచకం

ఈనాడు, అమరావతి:

  •  ‘సార్‌.. మీ ప్రోగ్రామ్‌ ఏంటి..? ఈరోజు ఎక్కడికి వెళుతున్నారు..? వివరాలు ఇవ్వండి..!’

తెలుగుదేశం అభ్యర్థికి ఓ పోలీసు అధికారి నుంచి వచ్చిన తాఖీదు!

  • ‘మీరు ఇక్కడ ర్యాలీ నిర్వహించడానికి అనుమతి లేదు. జెండాలు పెట్టవద్దు. కోడ్‌ ఉల్లంఘనకు వస్తుంది. కేసులు నమోదు చేస్తాం..!’

విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమాకు పోలీసుల నుంచి హెచ్చరిక!

‘విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. చిన్నిని కొందరు ఎస్బీ అధికారులు వెంటాడుతున్నారు. ఆయన ఎక్కడకు వెళితే.. అక్కడకు నీడలా వెళ్తున్నారు.
పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో పోలీసు అధికారులు ఇంకా వైకాపా నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. నామినేషన్ల సందర్భంగా ఈవ్యవహారం వెలుగు చూసింది. మరోవైపు తెదేపా అభ్యర్థులను వేధిస్తున్నారు. ర్యాలీల్లో బాణసంచా కాల్చేందుకు ఈసీ అనుమతించలేదు. కానీ వైకాపా నేతలు పెద్దఎత్తున బాణసంచా కాల్చినా కేసులు పెట్టలేదు. బందరులో వైకాపా అభ్యర్థి కిట్టు నామినేషన్‌ వేళ భారీ డీజేలు పెట్టారు. చెవులు రంధ్రాలు పడే శబ్దాలకు పోలీసులు ఎలా అనుమతి ఇచ్చారనేది ప్రశ్న. ఇదే ర్యాలీలో బాణసంచా కాల్చారు. మరోవైపు తెదేపా ర్యాలీలకే అనుమతి లేదని అడ్డుకున్నారు.

బొండా ఉమాపై గురి..

తెదేపా నేత, విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి బొండా ఉమా లక్ష్యంగా పోలీసులు వేధిస్తున్నారు. ఆయన తనకు ఎదురైన అనుభవాలను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఆయన ర్యాలీపై ఒక కేసు నమోదు చేశారు. మరోవైపు సీఎం జగన్‌పై గులక రాయి పడిన కేసులో ఎలాగైనా తెదేపా నేతలను ఇరికించాలనే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. ఏసీపీ డీఎన్‌వీ ప్రసాద్‌, నున్న సీఐ దుర్గారావుల తీరుపై బొండా ఉమా ఆరోపణలు చేశారు. తరచూ తన షెడ్యూలు ఇవ్వాలని ప్రతి నిమిషం సమాచారం ఇవ్వాలని వెంటపడుతూ.. ప్రచారం చేయకుండా అడ్డుతగులుతున్నారని ఆరోపించారు. బొండా ఉమాను కొందరు నీడలా వెంటాడుతున్నారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ కార్యాలయం వద్ద వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్‌తో పాటు మరో 16 మంది ఉన్నారిలా..

అంతటా అంతేగా...

నందిగామలో వైకాపా అభ్యర్థి నామినేషన్‌ వేళ తీవ్ర ఉల్లంఘనలు జరిగినా పోలీసులు మౌనంగా ఉన్నారు. ఇక్కడ భారీగా డీజేలు పెట్టారు. బాణసంచా కాల్చారు. వి జగ్గయ్యపేటలో ర్యాలీలను కార్యాలయం దగ్గరికి అనుమతించారు. వి విజయవాడ తూర్పున పెద్దఎత్తున ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. ఆర్వో కార్యాలయానికి ఏకంగా 17 మందిని అనుమతించడమే కాకుండా అక్కడ ఫొటోలు తీసుకుని సవాల్‌ విసిరారు. అదేమంటే ఉల్లంఘన కాదనీ, స్వతంత్ర అభ్యర్థి.. ఆయనతోపాటు ప్రతిపాదించే వారు పది మంది వచ్చారని అధికారులు సమాధానం ఇస్తున్నారు.


నీడలా వెంటాడుతున్నారు..

ఎన్నికల షెడ్యూల్‌కు ముందే విజయవాడ కమిషనరేట్‌, కృష్ణా జిల్లా పరిధిలో కొందరు ఎస్బీ పోలీసులను బదిలీ చేశారు. వైకాపా అనుకూల అధికారులను నియమించారు. ప్రతిచోట తెదేపా అభ్యర్థి కదలికలను పసిగట్టేందుకు వారిని నీడలా వెంటాడుతున్నారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు చేర వేస్తున్నారు. సాధారణంగా నిఘా విభాగం అధికారులు సమాచారం సేకరిస్తుంటారు. కానీ ఇక్కడ ప్రత్యేకంగా వైకాపా అనుకూల సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే కేశినేని చిన్నిని వెంటాడుతున్న ఓ ఎస్బీ అధికారిని పట్టుకున్నారు. కృష్ణా ఎస్పీగా జాషువా, విజయవాడ పోలీసు కమిషనర్‌గా కాంతి రాణా ఉన్నప్పుడే ఈ బదిలీలు జరిగినట్లు తెలిసింది. విజయవాడ సెంట్రల్‌ అభ్యర్థి ఉమా, ఆయన తనయుడు, భార్య కదలికలను పసిగట్టి చేరవేస్తున్నారు. విజయవాడ పశ్చిమలో భాజపా పోటీ చేస్తుండగా అభ్యర్థి సుజనా కదలికలపై నిఘా పెట్టి చేరవేస్తున్నట్లు తెలిసింది. ఎంపీ అభ్యర్థి చిన్ని, ఆయన అనుచరులపై గట్టి నిఘా ఉంచారని సమాచారం. కృష్ణా జిల్లాలోనూ జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి కదలికలపై నిఘా వేశారు. కొల్లు రవీంద్రపై సరేసరి. గన్నవరంలోనూ యార్లగడ్డ వెంకట్రావుపై, గుడివాడలో తెదేపా అభ్యర్థి వెనిగండ్ల రాము కదలికలు, ఆయన ఆర్థిక లావాదేవీలపై నిఘా వేశారు. కొందరు పోలీసు అధికారులు, ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు సైతం సహకరిస్తున్నట్లు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

కైలే నామినేషన్‌ సందర్భంగా పామర్రుకు 3 కి.మీ దూరంలో గంటపాటు ఎండలో ఆర్టీసీ బస్సులను ఆపేసి ప్రయాణికులకు చుక్కలు చూపించారిలా..

కొడాలి లెక్కే వేరప్పా...

గుడివాడలోనూ వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌ వేళ డీజేలతో మోత మోగించారు. పోలీసులకు ముందస్తుగా ఇచ్చిన మార్గంలో కాకుండా తెదేపా కార్యాలయం మీదుగా సాగి వారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు తెదేపా నేతలు ముందస్తు ర్యాలీలకు అనుమతి కోరితే ట్రాఫిక్‌ సమస్య అని తిరస్కరిస్తున్నారు. కనీసం కార్యాలయం వద్ద పార్టీ జెండాలు ప్రదర్శించేందుకూ అనుమతి ఇవ్వలేదు. వి విజయవాడ తూర్పులో ఇదో అరాచకం. స్వయంగా వైకాపా ఎమ్మెల్సీ రుహుల్లా నగదు పంచుతున్న చిత్రాలు వెలుగు చూసినా సాధారణ కేసు నమోదు చేశారు. విచారణ మాత్రం లోతుగా జరగలేదు. పత్రికల్లో వార్త వచ్చాక కేసు పెట్టడం విశేషం. వైకాపా అభ్యర్థి వెలంపల్లి తీవ్ర ఆరోపణలు, దుర్భాషలు ఆడుతున్న వీడియో క్లిప్పులు వస్తున్నా చర్యలు లేవని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. సెంట్రల్‌లో ఉల్లంఘనలు పెద్దఎత్తున జరుగుతున్నా చర్యలు లేవని తెదేపా వారు ఫిర్యాదు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని