‘పీడీ’ల కేడీ..
నేరేడ్మెట్, న్యూస్టుడే: గత 24 ఏళ్లుగా హత్యాయత్నాలు, బెదిరింపులు, అక్రమ వసూళ్లు.. ఇలా అనేక రకాలుగా ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన నిందితుడిపై ఒకటి కాదు.. రెండు కాదు.. నాలుగు సార్లు పీడీ చట్టం ప్రయోగించారు. అయినా అతడి బుద్ధి మారలేదు. రాచకొండ సీపీ మహేష్భగవత్ శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీకి చెందిన మహమ్మద్ ముకరం అలియాస్ పప్పు అలియాస్ అక్రం(39)పై మల్కాజిగిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ ఠాణాల పరిధిలో మొత్తం 51 కేసులు నమోదయ్యాయి. దీంతో అతనిపై 2015, 2017, 2018, 2020లో నాలుగు సార్లు పీడీ చట్టం ప్రయోగించారు. అయినా, అతనిలో మార్పు రాలేదు. ఈ ఏడాది జైలు నుంచి తిరిగి వచ్చాక మళ్లీ బెదిరింపులకు దిగడంతో అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు పంపారు. తాజాగా అతనిపై మరోసారి పీడీ చట్టం ప్రయోగించామని సీపీ వెల్లడించారు.
టాంజానియా దేశస్థుడిపైనా..
వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టాంజానియా దేశస్థుడిపైనా పీడీ చట్టం ప్రయోగించారు. టాంజానియాకు చెందిన కబన్గిలావారెన్ అలియాస్ విహుంబిజా ఆండ్రూఆసన్(24).. 2020లో విద్యార్థి వీసాపై హైదరాబాద్కు వచ్చి నేరేడ్మెట్ పరిధిలో అద్దెకుంటున్నాడు. తన దేశానికి చెందిన పేద యువతులను రప్పించి వ్యభిచార కార్యకలాపాలు ప్రారంభించాడు. పోలీసులు ఈ ఏడాది జులైలో అతని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అతడు తిరిగి వస్తే ప్రమాదమని పీడీ చట్టం ప్రయోగించినట్లు సీపీ చెప్పారు.