logo

బండి అమ్మినా.. బాధ్యత మీదే..

 వికారాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ నేరంలో ఉపయోగించిన ద్విచక్రవాహనం సీసీ కెమెరాలో నమోదైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా వాహన యజమాని దగ్గరకు పోలీసులు వెళ్లారు. ఆ వాహనాన్ని తాను ఎప్పుడో విక్రయించానని చెప్పారు. ఇలా పలువురి

Published : 24 Jan 2022 01:04 IST

వెంటనే అన్నీ మార్పించడం అవసరం

లేదంటే సమస్యలు కొనితెచ్చుకున్నట్లే..

న్యూస్‌టుడే, వికారాబాద్‌

వికారాబాద్‌లో ఇటీవల జరిగిన ఓ నేరంలో ఉపయోగించిన ద్విచక్రవాహనం సీసీ కెమెరాలో నమోదైంది. సీసీ ఫుటేజీ ఆధారంగా వాహన యజమాని దగ్గరకు పోలీసులు వెళ్లారు. ఆ వాహనాన్ని తాను ఎప్పుడో విక్రయించానని చెప్పారు. ఇలా పలువురి చేతులు మారింది. వాస్తవ విషయం ఏమిటంటే.. తొలి విక్రయం నుంచి రిజిస్ట్రేషన్‌ మార్పిడి చేయలేదు. దీంతో కేసు ఛేదనలో జాప్యం జరగడంతో పాటు మొదట వాహన విక్రేతకు పోలీస్‌ఠాణా చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
‘పాత వాహనం అమ్మిన వాహనదారులు కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట వెంటనే మార్పు చేయించాలి. ఆ బాధ్యత కూడా విక్రయించిన వాహనదారునిదే. లేదంటే తదనంతరం జరిగే పరిణామాలకు వాహన యజమానులే బాధ్యులవుతారు’.

- దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశం.

పాత బండి అమ్మేసి చేతులు దులిపేసుకుందామంటే ఇక నుంచి కుదరని పని. ఎందుకంటే వాహనం విక్రయించిన వెంటనే దాన్ని కొన్న వ్యక్తి పేరుపై మార్పు చేయించే బాధ్యత వాహనదారునిదేనని తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం రవాణా చట్టంలో మార్పులు తీసుకువచ్చింది. దీనిలో భాగంగా పాత వాహనం అమ్మిన వాహనదారులు తప్పనిసరిగా ఎవరికైతే అమ్ముతారో ఆ వ్యక్తి పేరుపై మార్చే బాధ్యత కూడా వాహనదారునిదే అవుతుందని లేకుంటే పర్యవసానాలకు యజమానులే బాధ్యులవుతారని తేల్చి చెప్పింది. దీని ప్రకారం.. వాహనం అమ్మిన వెంటనే దాన్ని కొన్న వ్యక్తి పేరుపై మార్చడం విక్రయించిన వాహనదారుడు తప్పనిసరిగా చేయాల్సిన పని.

ముందుగా తెలుసుకుంటే మేలు
వాహనం కొనే ముందు సదరు వాహనం అమ్మే వ్యక్తిదేనా అని ఒకటికి నాలుగు సార్లు నిర్ధరించుకోవడం ఎంతో ముఖ్యం. ముందుగానే వాహనానికి సంబంధించిన పత్రాలైన రిజిస్ట్రేషన్‌, పర్మిట్‌ వంటి పత్రాలు అమ్ముతున్న వ్యక్తి పేరుపైనే ఉన్నాయో లేదో పరిశీలించుకోవాలి. ఏదైనా అనుమానం ఉంటే దగ్గరలోని ఆర్టీఓ కార్యాలయాన్ని ఆశ్రయించినా వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే వీలుంది.
వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఆర్టీఓ కార్యాలయంతో పాటు పరిగి, తాండూర్‌, కొడంగల్‌లో యూనిట్‌ కార్యాలయాలు ఉన్నాయి. అయితే రిజిస్ట్రేషన్‌ మార్పిడి చేయించుకోవాలంటే జిల్లా ఆర్టీఓ కార్యాలయంలోనే చేయాలి.  
వికారాబాద్‌ ఆర్టీఓ కార్యాలయంలో ట్రాన్స్‌పోర్టు, నాన్‌ ట్రాన్స్‌పోర్టు వాహనాలకు సంబంధించి రోజూ పన్నెండు వరకు మార్పిడి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి.

అంతర్జాలంలో అధికమవుతున్నాయి
ప్రస్తుతం అంతర్జాలంలో క్రయ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. సమయం కలిసి వస్తుందనే ఆలోచనతో పాత వాహనం కొనుగోలుకు అంతర్జాలాన్నే ఆశ్రయిస్తున్నారు. క్రయ విక్రయాలు జరిపే వెబ్‌సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అక్రమార్కులు కొంతమంది దొంగిలించిన వాహనాలను నామ ఫలకాలు మార్చి అంతర్జాలంలో అతి తక్కువ ధరకే అమ్మకానికి ఉంచుతున్నారు. వాహనం తక్కువ ధరకే లభిస్తుందని చూడటం తప్ప విక్రయిస్తున్న వ్యక్తి నిజమైన యజమానేనా కాదా అని పరీక్షించుకోవడం లేదు. దీంతో దొంగిలించిన వాహనాలను కొనుగోలు చేసి ఇబ్బందుల పాలు అవుతున్నారు.


సమస్యలు ఎదుర్కోక తప్పదు
- భద్రునాయక్‌, జిల్లా రవాణాధికారి

వాహనం అమ్మిన తరువాత దాన్ని కొన్న వ్యక్తి పేరుపై మార్చేందుకు వాహన యజమాని ఎటువంటి చర్యలు తీసుకోకుంటే ఆ తరువాత ఉత్పన్నమైన సమస్యలను యజమాని ఎదుర్కోక తప్పదు. ఆ వాహనం ఏదైనా నేరంలో భాగమైతే ఆ నేరానికి వాహన యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వాహనం కొన్న వ్యక్తి ఏదైనా అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించినా చట్టపరమైన చర్యలు తప్పవు. అందుకే అమ్మిన వెంటనే కొన్న వ్యక్తి పేరిట వాహనాన్ని మార్పించడం అన్ని విధాలా శ్రేయస్కరం అన్నది గుర్తుంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని