ఆన్‌లైన్‌ రుణరాక్షసులు

అవి యాప్‌లు కావు... యమపాశాలు. వాటిని చేతపట్టి యథేచ్ఛగా చెలరేగిపోతున్నవాళ్లు- రుణాలిచ్చినట్లే ఇచ్చి నిస్సహాయుల ప్రాణాలు తోడేస్తున్న భయంకర నరహంతకులు! ఇచ్చిన అప్పు వసూలు చేసుకునే పేరిట ఉచ్చు బిగిస్తున్న యాప్‌ల నిర్వాహక సిబ్బంది అమానుష వేధింపులు దేశంలో కొన్నాళ్లుగా మళ్ళీ పెచ్చరిల్లుతున్నాయి.

Published : 24 May 2022 00:21 IST

వి యాప్‌లు కావు... యమపాశాలు. వాటిని చేతపట్టి యథేచ్ఛగా చెలరేగిపోతున్నవాళ్లు- రుణాలిచ్చినట్లే ఇచ్చి నిస్సహాయుల ప్రాణాలు తోడేస్తున్న భయంకర నరహంతకులు! ఇచ్చిన అప్పు వసూలు చేసుకునే పేరిట ఉచ్చు బిగిస్తున్న యాప్‌ల నిర్వాహక సిబ్బంది అమానుష వేధింపులు దేశంలో కొన్నాళ్లుగా మళ్ళీ పెచ్చరిల్లుతున్నాయి. రూ.5,700 మొత్తాన్ని ఏడురోజుల గడువులో చెల్లించలేకపోయిన ముంబయి యువతి ఫొటోని మార్ఫింగ్‌ చేసి నగ్నంగా మార్చి తండ్రికి స్నేహితులకు బంధువులకు పంపిన నీచులపై విఖ్రోలీ పోలీసులు ఇటీవలే కేసు పెట్టారు. అప్పు తీర్చినా మరింత జమ చేయాలంటూ ఖమ్మం జిల్లావాసిని బెంబేలెత్తించిన యాప్‌ నిర్వాహకులు, ఆ యువకుడి తల్లి చిత్రాన్ని అశ్లీల వెబ్‌సైట్లలో ప్రదర్శిస్తామని తాజాగా బెదిరించడం- పాశవికతకు పరాకాష్ఠ. గడువులోగా తిరిగి చెల్లించడానికి ప్రయత్నించినా ఆ యాప్‌ పనిచేయక, నిర్వాహకుల్ని సంప్రతించి లింకు ద్వారా బకాయి తీర్చేసినా- అతడికి వేధింపులు కొనసాగడం నిశ్చేష్టపరుస్తోంది! పత్రాలు, హామీలు అక్కర్లేకుండానే చిటికెలో రుణాలిస్తామని బులిపిస్తారు. వడ్డీ, ప్రాసెసింగ్‌ రుసుముగా ముందుగానే రుణంలో 35-45శాతం దాకా మినహాయించుకుంటారు. దరఖాస్తుదారులకు తెలియకుండానే వారి చరవాణిలోని ఫోన్‌ నంబర్లు సేకరిస్తారు. విపరీత వడ్డీతో బాకీ చెల్లు చేయలేని వారికి తీవ్ర దుర్భాషలు, వేధింపులు; సంబంధీకులకు మిత్రులకు అసభ్య సందేశాలు... తదుపరి ఘట్టాలు. ఈ ఘోరావమానాలు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్న అభాగ్యుల ఉదంతాలు వెలుగుచూస్తున్నా- దారుణ యాప్‌ల భరతంపట్టే పకడ్బందీ కార్యాచరణ పట్టాలకు ఎక్కకపోవడం ఏమిటి? ఆన్‌లైన్‌ దురాగతాలకు కళ్లెం వేయాలని కేంద్రాన్ని రిజర్వ్‌బ్యాంకును నిరుడు జులైలో దిల్లీ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మితిమీరిన వడ్డీలు దండుకుంటున్న ఆన్‌లైన్‌ వేదికల కట్టడికి తక్షణ చర్యలు అత్యావశ్యకమనీ అప్పట్లో పిలుపిచ్చింది. వ్యక్తుల గౌరవానికి, మానవ హక్కులకు భంగం వాటిల్లజేసే అధికారం ఎవ్వరికీ లేదు. వాస్తవంలో ఆ స్ఫూర్తి కొల్లబోతున్నా- ఆర్బీఐ, ప్రభుత్వం ఇంకా ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు?

గూగుల్‌ ప్లేస్టోర్‌లో కనిపించే ఏ యాప్‌లైనా సరే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్‌బీఎఫ్‌సీ)లతో ఒప్పందం కుదుర్చుకుంటేనే, రుణాలివ్వగల వీలుందని నిబంధనలు స్పష్టీకరిస్తున్నాయి. డైరెక్టర్లుగా భారతీయులు ఉంటేనే ఎన్‌బీఎఫ్‌సీ స్థాపనకు రిజర్వ్‌బ్యాంకు అనుమతించాలి. మూతపడిన ఎన్‌బీఎఫ్‌సీలతో చైనీయుల సంస్థలు ఒప్పందం కుదుర్చుకుని రుణ వ్యాపారంలో లాభాల్ని వెలుపలికి తరలిస్తుంటే- ఆర్బీఐ గుడ్లప్పగించి చూస్తోంది! పదిహేను తప్పుడు యాప్‌లను తొలగించాలని మహారాష్ట్ర సైబర్‌ పోలీసులు గూగుల్‌కు ఈమధ్యనే లేఖ రాశారు. కొన్ని వందల రుణయాప్‌లను సమీక్షించి, భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వాటిని తొలగించినట్లు నిరుడు జనవరిలో ప్రకటించిన గూగుల్‌- పేర్లేమిటో వెల్లడించలేదు. వేటు పడాల్సిన యాప్‌లు మళ్ళీ మళ్ళీ మోసాలకు తెగబడుతూనే ఉన్నాయి. కేంద్ర నిఘా వర్గాలకు హైదరాబాద్‌ సైబర్‌ రక్షక దళం నివేదించిన వివరాల ప్రకారం- వందల సంఖ్యలో యాప్‌లు వేలకోట్ల రూపాయలను కొల్లగొడుతున్నాయి. వాట్సాప్‌, టెలిగ్రామ్‌ లింకుల ద్వారా పెద్దయెత్తున సభ్యుల్ని చేర్పిస్తూ బాధితుల సంఖ్యను ఇంతలంతలు చేస్తున్న పన్నాగాల వెనక చైనా, హాంకాంగ్‌, తైవాన్‌, అమెరికాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ప్రస్ఫుటమవుతోంది. చైనా రుణయాప్‌ సంస్థల సూత్రధారి జౌయా హుయి అని ప్రకటించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌- కోట్ల రూపాయల దోపిడి సొత్తు విదేశాలకు తరలినట్లు ధ్రువీకరించింది. తొలగించామంటున్నా మళ్ళీ మొలుచుకొస్తున్న అడ్డగోలు రుణయాప్‌ల ఏరివేత ఒక్కరాత్రిలో సాధ్యం కాకపోవచ్చు. ప్రయత్నలోపం సమర్థనీయం కాదు. దారుణ యాప్‌ల నియంత్రణకు ప్రత్యేక చట్టం ఆవశ్యకమన్న ఆర్బీఐ కార్యదళం సిఫార్సుపై ఇంకా ఉదాసీనత- జాతి ప్రయోజనాలకే గొడ్డలిపెట్టు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఆర్బీఐ, నిఘాసంస్థలు, పోలీసు బలగాల అర్థవంతమైన సమన్వయంతో ఉమ్మడి పోరాటం ఒక్కటే- రుణపాశాలకు సరైన విరుగుడు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.