ప్రజల ఉద్యమంగా మారితేనే...

సుమారు వందేళ్ల క్రితం పుట్టి ప్రపంచం నలుమూలలా మానవాళి జీవనంలో అంతర్భాగమై వదిలించుకోలేని శత్రువుగా తయారైన ప్లాస్టిక్‌పై కేంద్రప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తు

Published : 01 Jul 2022 00:16 IST

సుమారు వందేళ్ల క్రితం పుట్టి ప్రపంచం నలుమూలలా మానవాళి జీవనంలో అంతర్భాగమై వదిలించుకోలేని శత్రువుగా తయారైన ప్లాస్టిక్‌పై కేంద్రప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తు సముదాయంపై నేటినుంచి దేశవ్యాప్తంగా నిషేధాంక్షలు అమలులోకి వచ్చాయి. ప్లాస్టిక్‌తో తయారయ్యే చెవిపుల్లలు, జెండాలు, ఆహ్వాన పత్రికలు, వంద మైక్రాన్ల(ఒక మైక్రాన్‌ అంటే మీటరులో పది లక్షలో వంతు)లోపు చేతిసంచులు, బ్యానర్లు తదితరాలన్నీ నిషేధిత జాబితాలోకి చేరాయి. వాటి తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, విక్రయాలను శిక్షార్హ నేరాలుగా పరిగణిస్తారు. ఆంక్షల ఉల్లంఘనకు పాల్పడితే అయిదు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల దాకా జరిమానా తప్పవని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ కొరడా ఝళిపిస్తున్నారు. నిషేధం విధింపుపై నిరుడు ఆగస్టులోనే నోటిఫికేషన్‌ జారీ చేసి తగినంత గడువిచ్చినందువల్ల జులై ఒకటో తేదీనుంచి ఆంక్షల అమలులో అందరి సహకారంతో కృతకృత్యులం కాగలమన్న ధీమా అమాత్యుల మాటల్లో ప్రస్ఫుటమవుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయుల్లో నియంత్రణ వ్యవస్థలు, ప్రత్యేక నిఘా బృందాల ఏర్పాటుతోనే నిషేధం విజయవంతమవుతుందనుకునే వీల్లేదు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ ఉత్పత్తులపై మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, ఒడిశా లాంటి చోట్ల గతంలో ప్రకటించిన నిషేధాంక్షలు వినియోగాన్ని కట్టడి చేయలేకపోయాయి. స్థానికుల క్రియాశీల భాగస్వామ్యం నమోదైన సిక్కిమ్‌లో ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ సుసాధ్యమైంది. ప్లాస్టిక్‌ నిషేధం ఫలప్రదం కావాలంటే, ప్రత్యామ్నాయాలు విరివిగా అందుబాటులోకి రావాలి. అంతకు మించి, చేటు సంచుల వినియోగం ఎంతటి వినాశకారకమన్నదానిపై జన చైతన్యం పెంపొందాలి. ఆ మేరకు విస్తృత అవగాహన కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు భుజాలకెత్తుకోవాలి!

అధికారిక గణాంకాల ప్రకారం, ఏటా 35 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు ఉత్పన్నమవుతున్న దేశం మనది. అందులో 60 శాతం దాకా పునర్‌ వినియోగమవుతున్నట్లు సర్కారు చెబుతున్నా- క్షేత్రస్థాయి స్థితిగతులు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. దేశంలో ఎన్నోచోట్ల వరదలకు, పారిశుద్ధ్య వ్యవస్థలు మొరాయించడానికి ప్లాస్టిక్‌ వ్యర్థాలే పుణ్యం కట్టుకుంటున్నాయి. నదులు, సముద్రాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్‌ ఉత్పత్తుల్ని జీర్ణించుకోలేక పక్షులు, చేపలు, క్షీరదాలు అసంఖ్యాకంగా మృత్యువాత పడుతున్నాయి. దేశంలో చనిపోతున్న ప్రతి ఆవు, గేదె పొట్టలో కనీసం 30, 40 కిలోలదాకా ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడుతున్నాయి. గాలిలో, నీటిలో, భూతలంపై ఎక్కడున్నా సూక్ష్మ ప్లాస్టిక్‌ మానవ శరీర కణాల్ని, డీఎన్‌ఏను దెబ్బతీసి అనారోగ్య సమస్యలు సృష్టిస్తోంది. క్యాన్సర్‌, గుండెజబ్బులకూ అది కారణభూతమవుతోంది. పలు విధాల సంక్షోభాలకు ప్రబల హేతువుగా మారిన ప్లాస్టిక్‌ వినియోగాన్ని యుద్ధప్రాతిపదికన కట్టడి చేయడంలో ఫ్రాన్స్‌ ముందుంది. ఉత్పత్తి, వినియోగాలపై కఠిన ఆంక్షల్ని జర్మనీ, ఇంగ్లాండ్‌, థాయ్‌లాండ్‌, రువాండా ప్రభృత దేశాలు తు.చ. తప్పకుండా అమలు పరుస్తున్నాయి. వ్యర్థాలు అనర్థాలు సృష్టించకుండా జాగ్రత్తపడుతూ పటిష్ఠ పునశ్శుద్ధి వ్యవస్థతో స్వీడన్‌ అద్భుతంగా రాణిస్తోంది. నిషేధాంక్షల కూర్పు, అమలు వ్యర్థాల రీసైక్లింగ్‌ పరంగా ఆయా దేశాల నుంచి భారత్‌ నేర్వదగ్గ విలువైన గుణపాఠాలెన్నో ఉన్నాయి. నేరుగా ఎండసోకినా, గాలిలో తేమ తగిలినా వంద రోజుల్లో దానంతటదే విచ్ఛిన్నమయ్యే పదార్థంతో చేతిసంచుల తయారీలో వియత్నాం ధీమాగా పురోగమిస్తోంది. అటువంటి ప్రత్యామ్నాయాల్ని ఇక్కడ ఆవిష్కరించేలోగా- గుడ్డసంచుల వాడకాన్ని ప్రోత్సహించగల వీలుంది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సిమెంటు పరిశ్రమలో ఇంధనంగా, రహదారుల నిర్మాణంలో ఉపయోగించడాన్ని ప్రభుత్వాలు విరివిగా ప్రోత్సహించాలి. దాదాపు వెయ్యేళ్ల వరకు శిథిలం కాని ప్లాస్టిక్‌ పాలిథీన్‌ ఉత్పత్తుల దుష్ప్రభావాలపై రేపటి తరంలో లోతైన అవగాహన పెంపొందించే, స్పృహ రగిలించే కసరత్తూ చురుగ్గా పట్టాలకు ఎక్కాలి!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.