Terrorism: కలిసికట్టుగా... అప్రమత్తంగా!

డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్ర సంబరాల్ని అమృత మహోత్సవాలుగా నిర్వహించుకుంటున్న భారత్‌పై ఐఎస్‌(ఇస్లామిక్‌ స్టేట్‌) విధ్వంసక దళాలు గురిపెట్టాయంటూ రాష్ట్రాల్ని కేంద్రం తాజాగా హెచ్చరించింది.

Updated : 06 Aug 2022 02:11 IST

డెబ్భై అయిదేళ్ల స్వాతంత్య్ర సంబరాల్ని అమృత మహోత్సవాలుగా నిర్వహించుకుంటున్న భారత్‌పై ఐఎస్‌(ఇస్లామిక్‌ స్టేట్‌) విధ్వంసక దళాలు గురిపెట్టాయంటూ రాష్ట్రాల్ని కేంద్రం తాజాగా హెచ్చరించింది. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే-బస్‌ స్టేషన్లు, ప్రార్థనా స్థలాలు, దుకాణ సముదాయాల పరిసరాల్లో అనుక్షణం కడు జాగ్రత్తగా వ్యవహరించాలని వివిధ రాష్ట్రాల పోలీస్‌ బలగాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిరుడీ రోజుల్లో లష్కరే-తొయిబా, జైషే మహ్మద్‌ ఉగ్ర ముఠాలు దేశంలో భారీ పేలుళ్లకు పన్నిన కుట్రల్ని మన బలగాలు విజయవంతంగా ఛేదించాయి. అమృత మహోత్సవాలకున్న చారిత్రక ప్రాధాన్యం కారణంగా ఎక్కడ ఏమూల విధ్వంస సృష్టికి తెగబడే సందు దొరికినా, అదో ఘన విజయంగా ఉగ్రవాదులు విర్రవీగుతారు. అల్‌ఖైదా అగ్రనేత అల్‌ జవహరీని అమెరికా అధునాతన క్షిపణి దాడిలో అంతమొందించడం తెలిసిందే. కశ్మీర్‌ విముక్తికి జిహాద్‌ను పలవరిస్తున్న ఆ ఉగ్రసంస్థకు చెందిన సాయుధ శ్రేణులూ సందుచూసి రెచ్చిపోయే పెనుముప్పు పొంచి ఉంది. అందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చేసే క్రమంలో ప్రమాదాన్ని శంకించిన ప్రతి చోటా జల్లెడ పట్టడంలో నిఘా విభాగాలు నిమగ్నమయ్యాయంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో, చరవాణి అప్లికేషన్ల ద్వారా యువతకు వల వేస్తున్నవారిని కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగాలు ఉమ్మడిగా వేటాడుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర వంటి చోట్ల దాడులు చేపట్టిన ఎన్‌ఐఏ(జాతీయ దర్యాప్తు సంస్థ) 14మందిని అదుపులోకి తీసుకుంది. నిజామాబాద్‌ జిల్లాలో మతకల్లోలాలు సృష్టించే కుట్రకోణం నెల్లాళ్లకిందట బట్టబయలైంది. ఇటీవలే అక్కడి కొందరు యువకుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ ఉదంతాన్ని ఎన్‌ఐఏ అధికారికంగా ధ్రువీకరించింది. కలుగుల్లో దాగిన విచ్ఛిన్న శక్తుల్ని వెలికి లాగే కృషి అవిశ్రాంతంగా కొనసాగాల్సిందే. జన సమ్మర్ద ప్రాంతాల్లో విశేష ప్రాముఖ్యం కలిగిన రోజుల్లో పెను విస్ఫోటాలతో భయ బీభత్సాలు సృష్టించడంలో పాక్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐది అందెవేసిన చెయ్యి. ఉగ్ర పథక రచనలో ఐఎస్‌ఐని, అల్‌ఖైదాను తలదన్నాలని తహతహలాడుతున్న ఐఎస్‌ ఆటలు చెల్లకుండా అడ్డుకోవడంలో కేంద్రం, రాష్ట్రాలు ఏకోన్ముఖంగా పురోగమించాలి!

ఇరాక్‌లో పుట్టి సిరియాలో ఎదిగిన ఐఎస్‌- మాటు వేసిన ఉగ్రవాద వ్యాఘ్రంలాంటిది. రకరకాల ఉగ్ర కుట్రల్ని సమర్థంగా నీరు కార్చినట్లు చాటుకున్న బ్రిటన్‌- ఒంటరిగానే విధ్వంస సృష్టికి తెగబడే ఐఎస్‌ సానుభూతిపరుల ఆనవాళ్లను పసిగట్టడం కష్టసాధ్యమేనని లోగడ విశ్లేషించింది. ఫిలిప్పీన్స్‌లో చొరబాటుదారుల్ని, కాంగోలో తిరుగుబాటు బృందాల్ని దువ్వి మత మారణకాండ సాగించిన ఐఎస్‌- వేర్వేరు దేశాల్లో తీవ్రవాద భావజాలం కలిగిన మతసంస్థల్ని గుప్పిట పడుతోంది. శ్రీలంక, మలేసియాల్లో విషాద వృష్టికి అది అనుసరించిన మార్గమదే. థాయ్‌లాండ్‌, ఇండియా, బంగ్లాదేశ్‌లపైనా ఐఎస్‌ అటువంటి వ్యూహాలే పన్నుతోందన్న విశ్లేషణాత్మక కథనాలు లోగడే వెలుగు చూశాయి. సైబర్‌ నెట్‌వర్క్‌ ద్వారా యువజనాన్ని పెడదోవ పట్టిస్తూ ఎక్కడికక్కడ ఆత్మాహుతి దళాల రూపకల్పనకు పథక రచన చేస్తున్న ఐఎస్‌ కట్టడికి సాధారణ యుద్ధతంత్రం సరిపోదు. సైబర్‌ క్షేత్రంలో ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులూ ప్రభావితుల కదలికల్ని నిరంతరం పరిశీలించి అదను చూసి ఒక్కుదుటున ఉచ్చు బిగించేలా- నిఘా విభాగాలు, భద్రతా బలగాల పనిపోకడలు పదును తేలాలి. విద్రోహ ముఠాలకు శిక్షణ, సరిహద్దుల వెంబడి సొరంగాలను డ్రోన్లను ఉపయోగించుకుంటూ ఆయుధాలు చేరవేయడంలో పొరుగుదేశం పాకిస్థాన్‌ ప్రత్యక్ష ప్రమేయానిది అంతులేని కథ. పాక్‌ నుంచి అన్నిందాలా సాయం పొందుతున్న లష్కరే తొయిబా, జైషేమహమ్మద్‌ ఉగ్రసంస్థలు అఫ్గాన్‌ భూభాగంలో శిక్షణ స్థావరాల్ని ఇంకా కొనసాగిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక ఇటీవలే ధ్రువీకరించింది. ఉగ్రశక్తుల ఉరవడి సరిహద్దుల్లేని అరాచకత్వానికి ఆవాహన పలుకుతున్నంత కాలం అడుగడుగునా అప్రమత్తతే- దేశానికి రక్ష!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు