దివాలాకోరు రాజకీయం

నాలుక ఉన్నవారు నాలుగు దిక్కులు తిరగగలరు. ఆ ప్రతిభను అసమానంగా ప్రదర్శిస్తూ, రెండు మూడేళ్లకోసారి అధికార కూటమి డేరాలను మారుస్తూ-  జేడీ(యూ) నేతాశ్రీ నీతీశ్‌ కుమార్‌ రాజకీయంగా

Published : 11 Aug 2022 00:54 IST

నాలుక ఉన్నవారు నాలుగు దిక్కులు తిరగగలరు. ఆ ప్రతిభను అసమానంగా ప్రదర్శిస్తూ, రెండు మూడేళ్లకోసారి అధికార కూటమి డేరాలను మారుస్తూ-  జేడీ(యూ) నేతాశ్రీ నీతీశ్‌ కుమార్‌ రాజకీయంగా బతకనేర్చారు. ‘చావనైనా చస్తానుగానీ ఆర్జేడీతో మళ్ళీ పొత్తు పెట్టుకోను’ అని లోగడ భీష్మప్రతిజ్ఞ చేసిన ఆ పెద్దమనిషి- తాజాగా ఆ పార్టీతోనే చెట్టపట్టాలేసుకుని ఎనిమిదోసారి బిహార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారంతో పాటు గడచిన మూడు వారాల్లో నాలుగు హస్తినాపుర కార్యక్రమాలకు నీతీశ్‌ డుమ్మా కొట్టినప్పుడే- భాజపాతో ఆయన తెగదెంపులు చేసుకోబోతున్నారన్న విషయం రూఢి అయ్యింది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా సంబరపడిన ఆర్జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలు వెంటనే నీతీశ్‌తో చేతులు కలపడంతో పట్నాలో మరోసారి మహాకూటమి సర్కారు కొలువుతీరింది. పదిహేనేళ్ల లాలు కుటుంబ అరాచక ఏలుబడికి చెల్లుచీటీ రాసిన జేడీ(యూ)-భాజపా కూటమి 2005లో తొలిసారి అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి అజెండాతో అయిదేళ్ల తరవాతా దాన్ని నిలబెట్టుకుంది. గుజరాత్‌ నుంచి దిల్లీకి మోదీ ఎదుగుదలపై కినిసిన నీతీశ్‌- కమలదళంతో చిరకాల మైత్రికి 2013లో నీళ్లొదిలారు. ఆపై ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పంచన చేరి పదవీ భాగ్యాన్ని అనుభవించిన ఆయన- తిరిగి 2017లో ఎన్డీయే గూట్లోకి వచ్చి వాలారు. ఆర్జేడీ నేతాగణాల భ్రష్టాచారాలను అప్పట్లో చీదరించుకున్న ఆ ‘సుశాసన్‌ బాబు’- అవినీతిపై రాజీపడనంటూనే నేడు వారి కౌగిట తిరిగి చేరారు! బిహార్‌లో సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు భాజపా పట్టుదలగా ప్రయత్నిస్తుండటంతో- భవిష్యత్తులో ఇంకోసారి ఎన్డీయేలోకి అడుగుపెట్టడం జేడీ(యూ)కు సాధ్యం కాకపోవచ్చు. నేస్తాలతో సున్నం పెట్టుకుని, శత్రువులతో స్నేహం చేయడానికి ఆ పార్టీ ఎన్ని సాకులైనా చెప్పవచ్చు... కానీ, పదవులకోసమే పచ్చిగా పాకులాడే రాజకీయ దివాలాకోరుతనమే దాని కప్పగంతుల్లో ప్రస్ఫుటమవుతోంది!

బిహార్‌ రాజకీయాల్లో తలపండిన నీతీశ్‌కుమార్‌... 2014-15 మధ్యలో తొమ్మిది నెలల కాలం మినహా పదిహేడేళ్ల నుంచి ఏకధాటిగా రాజ్యం చేస్తున్నారు. పోనుపోను పరపతి కోసుకుపోతున్నా, 2020 ఎన్నికల్లో సొంత పార్టీకి కేవలం 43 సీట్లే దఖలుపడినా- మహాకూటమి, ఎన్డీయేల నడుమ పిల్లిమొగ్గలేస్తూ నీతీశ్‌ తన కుర్చీని కాపాడుకుంటున్నారు. అలా ఆయన అధికార దాహం తీరుతోందే తప్ప ప్రజలకు ఒనగూడుతోందేమిటి? నీతీశ్‌ హయాములో మౌలిక వసతులు కొద్దిగా మెరుగుపడ్డాయి కానీ, ‘బీమారు రాజ్యం’గా బిహార్‌ అప్రతిష్ఠ తొలగిపోలేదు. 115 సూచికల ఆధారంగా నీతి ఆయోగ్‌ నిరుడు రూపొందించిన సుస్థిరాభివృద్ధి నివేదికలో అత్యంత వెనకబడిన రాష్ట్రంగా అదే నిలిచింది. రాష్ట్రాల వారీగా తాండవిస్తున్న బహుముఖ పేదరికాన్ని నీతి ఆయోగ్‌ కొద్ది నెలల క్రితం లెక్కేస్తే- బిహార్‌ జనాభాలో సుమారు 52శాతం దాని గుప్పిట్లో విలవిల్లాడుతున్నారని తేలింది. ఉపాధి అవకాశాలకు నోచుకోని స్థానిక యువత గుండె మంటలు- అగ్నిపథ్‌ నిరసనల సందర్భంగా ఇటీవల భారీయెత్తున ఎగసిపడ్డాయి. దీర్ఘకాలంగా అధికారం చలాయిస్తున్నా ఇంటిని చక్కదిద్దడంలో విఫలమైన నీతీశ్‌- ప్రధాని పదవిపై ఆశలు పెట్టుకోవడమే విస్మయకరం! మరోవైపు- రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలు అన్నింటికీ నూకలు చెల్లిపోతాయని, జాతీయ స్థాయిలో భాజపా ఒక్కటే ఉంటుందని కమల దళాధిపతి జేపీ నడ్డా ఇటీవల వ్యాఖ్యానించారు. అధికారమే ఏకైక లక్ష్యంగా విలువలూ సిద్ధాంతాలను పూచికపుల్లలుగా తీసిపారేస్తూ, అవకాశం కుదిరితే అవినీతిలో మునిగి తేలుతున్న పలు పార్టీల ధోరణులే ముందుగా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యామ్నాయం లేని ఏకపక్ష ప్రజాస్వామ్యంలోకి దేశాన్ని అవే ఈడ్చుకుపోతున్నాయి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు