ఉత్పాతాల మహోద్ధృతి

విశృంఖల పర్యావరణ విధ్వంస దుష్ఫలితాలుగా ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లుతున్నాయి. భరించలేని వడగాడ్పులు, చలిగాలులు, భీకర తుపానులు, వరదలు, దుస్సహమైన కరవుకాటకాల వంటివి విజృంభిస్తున్నాయి.

Published : 29 May 2023 00:35 IST

విశృంఖల పర్యావరణ విధ్వంస దుష్ఫలితాలుగా ప్రకృతి విపత్తులు పెచ్చరిల్లుతున్నాయి. భరించలేని వడగాడ్పులు, చలిగాలులు, భీకర తుపానులు, వరదలు, దుస్సహమైన కరవుకాటకాల వంటివి విజృంభిస్తున్నాయి. వాటి మూలంగా గతేడాది ఇండియాలో ఇరవై అయిదు లక్షల మంది నిర్వాసితులయ్యారు. ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య రెండు వేలకు పైబడింది. దేశీయంగా గడచిన మూడేళ్లలో ప్రకృతి వైపరీత్యాల కారణంగా అత్యధిక ప్రాణనష్టం నమోదైంది నిరుడే!  తాజాగా వెలువడిన ప్రపంచ వాతావరణ సంస్థ నివేదిక మరిన్ని విషాదకర వాస్తవాలను వెల్లడించింది. గడచిన అర్ధ శతాబ్దంలో విశ్వవ్యాప్తంగా 12వేల ప్రకృతి విపత్తులు విరుచుకుపడి, దాదాపు 20 లక్షల మందిని బలిగొన్నాయి. రూ.35 లక్షల కోట్ల వరకు ఆస్తినష్టానికి అవి కారణమయ్యాయి. 1970-2021 మధ్యకాలంలో స్థానికంగా సంభవించిన 573 వైపరీత్యాల్లో 1.38 లక్షల ప్రాణదీపాలు కొండెక్కాయి. పర్యావరణ మార్పులు, వాటి పర్యవసానాలైన దారుణ ఉత్పాతాలకు అల్పాదాయ, వర్ధమాన దేశాలే అధికంగా మూల్యం చెల్లించాల్సి వస్తోంది. 1970-2019 నడుమ ఇండియాపై పంజా విసిరిన 117 తుపానులు- నలభై వేల మందిని కబళించాయి. దేశీయంగా 12లక్షల ఎకరాలకు పైగా భూములకు వరదల ముప్పు పొంచి ఉన్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తీవ్రమైన వేడిగాలుల వల్ల నిరుడు దేశంలో గోధుమ దిగుబడులు పది నుంచి 30శాతం మేర తెగ్గోసుకుపోయినట్లు పరిశీలనలు చాటుతున్నాయి. పర్యావరణ సమతుల్యతను చెడగొడుతున్న మానవుడి స్వార్థం- వాతావరణ మార్పులను ఇంతలంతలు చేస్తోంది. ఆహార భద్రతకు పెనువిఘాతం వాటిల్లజేస్తూ- భావితరం భవిష్యత్తునే అది పెనుప్రమాదంలోకి నెట్టేస్తోంది! 

ప్రపంచవ్యాప్తంగా కట్టుతప్పుతున్న కర్బన ఉద్గారాల ఉద్ధృతితో భూగోళం భగభగ మండుతోంది. ధ్రువప్రాంతాల్లో మంచు కరిగి సముద్రమట్టాలు ఎగబాకుతున్నాయి. దాంతో తీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. వాతావరణ మార్పుల మూలంగా కరోనా, డెంగీ వంటివి కోరలు తొడుక్కుంటాయనే విశ్లేషణలు వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. ఠారెత్తిస్తున్న ఉష్ణతాపంతో ఉత్పత్తి కుంచించుకుపోవడంవల్ల 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది కోట్ల ఉద్యోగాలు కనుమరుగవుతాయని అంచనా. వాటిలో ఇండియా వాటా ఏకంగా 57శాతం కావడం కలవరపరచేదే!   ప్రపంచ దేశాల సమష్టి భాగస్వామ్యంతో కర్బన ఉద్గారాల కట్టడి ప్రణాళికలు ఇకనైనా కార్యరూపం దాల్చకపోతే- జనజీవనం మరింతగా దుర్భరమె,i దినదిన గండంగా పరిణమిస్తుంది. భూతాపం పెరుగుదలను 2050 నాటికి రెండు డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయాలన్నది ప్యారిస్‌ ఒప్పంద ప్రవచిత లక్ష్యం. దానికి పొగపెడుతున్న అభివృద్ధి చెందిన దేశాలు- కర్బన ఉద్గారాలను అత్యధికంగా విడుదల చేస్తున్నాయి. ప్యారిస్‌ ఒడంబడిక ప్రకారం- పేద, వర్ధమాన దేశాలకు కేటాయించాల్సిన నిధులనూ అవి బిగపడుతున్నాయి. అంతర్జాతీయ ఇంధన సంస్థ తాజా  ప్రకటన ప్రకారం-  కాలుష్యకారక బొగ్గుపై ప్రపంచ దేశాల పెట్టుబడులు పదిశాతం వరకు పెరగనున్నాయి. ‘కాప్‌’ వంటి విశ్వసదస్సుల తీర్మానాల్లో అత్యధికం వాస్తవంలో తేలిపోతుండటం పర్యావరణ సంక్షోభాన్ని తీవ్రతరం చేస్తోంది. భూతాప నియంత్రణలో భాగంగా 2070 నాటికి కర్బన ఉద్గారాల తటస్థతను సాధించేందుకు ఇండియా కట్టుబడింది. ఇంధనం, రవాణా, పట్టణ ప్రణాళికలు, పారిశ్రామిక రంగాల్లో పర్యావరణ హితకర విధానాలకు పెద్దపీట వేయాలని భావిస్తోంది.  కేంద్రం, రాష్ట్రాలు పరస్పర సమన్వయంతో ముందడుగు వేస్తేనే- నిర్దేశిత గమ్యాన్ని చేరుకోవడం సాధ్యపడుతుంది. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని విస్తృత పరచడమూ కీలకమే. కాలుష్య రక్కసి స్వైరవిహారాన్ని అడ్డుకుంటూ, విపత్తు నష్టాలను పరిమితం చేసే ముందస్తు సన్నద్ధతకు పాలకులు ప్రాధాన్యమివ్వాలి. ఆ మేరకు వారి బహుముఖ కృషే- భారతావనికి రక్షరేకు కాగలదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.