జనస్వామ్యంలో రాజద్రోహమా?

వందేళ్లక్రితం ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో వ్యాసాలు రాసిన గాంధీజీపై నాటి ఆంగ్లపాలకులు రాజద్రోహ నేరం బనాయించారు. సెక్షన్‌ 124(ఏ)ను పౌరుల స్వేచ్ఛను కబళించే రక్కసిగా అప్పట్లో ఈసడించిన బాపూ, అనంతర కాలంలో ఆ కర్కశ నిబంధన రద్దును డిమాండు చేస్తూ ప్రజాందోళనకు పిలుపిచ్చారు.

Published : 10 Jun 2023 01:03 IST

వందేళ్లక్రితం ‘యంగ్‌ ఇండియా’ పత్రికలో వ్యాసాలు రాసిన గాంధీజీపై నాటి ఆంగ్లపాలకులు రాజద్రోహ నేరం బనాయించారు. సెక్షన్‌ 124(ఏ)ను పౌరుల స్వేచ్ఛను కబళించే రక్కసిగా అప్పట్లో ఈసడించిన బాపూ, అనంతర కాలంలో ఆ కర్కశ నిబంధన రద్దును డిమాండు చేస్తూ ప్రజాందోళనకు పిలుపిచ్చారు. బాల గంగాధర తిలక్‌, భగత్‌ సింగ్‌, నెహ్రూ తదితరులపైనా ఆంగ్లేయులు ప్రయోగించిన క్రూర శాసనానికి స్వతంత్ర భారతావనిలో ఉనికీ మనికీ ఉండరాదని అలనాటి మహోద్యమ సేనానులు తలపోశారు. దురదృష్టవశాత్తు, శ్వేత జాతి వలస పాలనావశేషంగా నేటికీ అది మిగిలే ఉంది! తప్పుడు కేసులతో 1860 నాటి వివాదాస్పద సెక్షన్‌ 124(ఏ)ను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణల విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం నిరుడు చరిత్రాత్మక నిర్ణయం వెలువరించింది. ‘రాజద్రోహం’పై కేంద్రం పునస్సమీక్ష జరిపి తదుపరి చర్య తీసుకునేంతవరకు ఆ సెక్షన్‌ అమలును నిలిపివేస్తూ కీలక ఆదేశాలిచ్చింది. అప్పటికే దాఖలైన ప్రాథమిక దర్యాప్తు నివేదిక (ఎఫ్‌ఐఆర్‌)లపై చర్యల్నీ నిషేధించింది. ఏడాది తరవాత లా కమిషన్‌ ఇప్పుడు కొద్దిపాటి సవరణలతో నల్లచట్టం పునరుద్ధరణకు ఓటేయడం దేశం నలుమూలలా తీవ్ర కలకలం రేకెత్తిస్తోంది. ప్రశ్నించడాన్ని సహించలేని ప్రభుత్వాల చేతిలో- ఉద్యమకారులు, విమర్శకులు, పాత్రికేయుల్ని అణచివేసే అస్త్రంగా పరువుమాసిన ‘రాజద్రోహం’ నిబంధనను గుడ్డి వ్యతిరేకతతో రద్దు చేయకూడదట! కొన్నిసార్లు దుర్వినియోగపరచారనో, వేరే దేశాల్లో కఠిన నిర్ణయం తీసుకున్నారనో... ఇక్కడ వేటు వేయరాదట! తీవ్రవాద, వేర్పాటువాద ఉద్యమాల కట్టడి కోసం శిక్షాకాలాన్ని ఏడేళ్లకు పెంచి రాజద్రోహ చట్టాన్ని కొనసాగించాలనడం విడ్డూరంగా ఉంది. ఆయా ముప్పుల్ని కాచుకోవడానికే యూఏపీఏ వంటి చట్టాలున్నప్పుడు, అస్పష్టమైన నేర నిర్వచనాలతో కూడిన రాజద్రోహ శాసనాన్ని నెత్తికెత్తుకోవడం అనవసరం. అసమ్మతిని వ్యక్తపరచడం వేరు, హింసోన్మాద ప్రజ్వలనాన్ని ప్రేరేపిస్తూ శాంతిభద్రతలకు చితి పేర్చడం వేరు. ఆ అర్థభేదాన్ని చెరిపేస్తూ మరింత దుర్వినియోగానికి కోరలు తొడిగేలా అఘోరించాయి లా కమిషన్‌ సిఫార్సులు!

రాజద్రోహ చట్టంపై తెల్లదొరల నల్లముద్ర సుస్పష్టం. భారతీయుల స్వాతంత్య్ర కాంక్షల్ని ఉక్కుపాదంతో అణచిపారెయ్యడమే లక్ష్యంగా మెకాలే చేతుల మీదుగా పురుడు పోసుకుందా రాక్షస శాసనం. కాలం చెల్లిన చట్టాల్ని తొలగించడంలో భాగంగా రాజద్రోహ నిబంధనను ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదని నిరుడు సీజేఐగా జస్టిస్‌ ఎన్‌వీ రమణ అటార్నీ జనరల్‌ను సూటిగా ప్రశ్నించారు. అలా నిగ్గదీయడానికి సహేతుక కారణాలెన్నో పోగుపడ్డాయి. కొన్నాళ్లుగా ఎవరెవరిపై రాజద్రోహం కేసులు నమోదవుతున్నాయి? రైతుల ట్రాక్టర్‌ ర్యాలీపై స్పందించిన జర్నలిస్టులు, వివాదాస్పద చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు పాఠశాలల్లో నాటికలు వేయించినవారు, వీధుల్లో శాంతియుత ప్రదర్శనలు చేపట్టినవారి మీద... రాజద్రోహం కేసులా? ప్రభుత్వ విధానాలను, చర్యలను ఎంత కటువుగా విమర్శించినా అది భావప్రకటన స్వేచ్ఛ పరిధిలోకే వస్తుందని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టీకరించింది. రాజద్రోహ కేసులుగా గుర్తించగలవేమిటో లక్ష్మణరేఖల్నీ నిర్దేశించింది. వాటిని తుంగలో తొక్కుతున్న ధోరణులకు నిదర్శనం- ఏపీలో జగన్మోహన్‌రెడ్డి సర్కారుపై విమర్శలు ప్రసారం చేసిన రెండు ఛానళ్లమీద రాజద్రోహ నేరం మోపడం. అస్సాం, హరియాణా, ఝార్ఖండ్‌, యూపీ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోనూ 124(ఏ) కేసుల నమోదు జోరెత్తుతోంది. 2014-20 మధ్య 399 రాజద్రోహం కేసులు నమోదైతే, అందులో శిక్షలు పడినవి ఎనిమిదింటిలోనేనని కేంద్రమే లోక్‌సభాముఖంగా అంగీకరించింది. నేడు విమర్శనాత్మక పాత్రికేయం- ఎన్నో ప్రభుత్వాలకు కంటిలో నలుసు. రాజ్యాంగబద్ధమైన భావప్రకటన స్వేచ్ఛ నెత్తిన ఇప్పుడు కత్తి వేలాడుతోంది. జనతంత్ర విలువలు, సమున్నత రాజ్యాంగ ప్రమాణాలకు నిలువు పాతర వేసే భ్రష్టసాధనాలుగా వినియోగపడుతున్న చీకటి చట్టాలకు ప్రజాస్వామ్య వ్యవస్థలో చోటన్నదే ఉండకూడదు. రాజద్రోహ చట్టాన్ని రద్దుచేసి చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టేయడమే- ఆ దిశగా పడాల్సిన తొలి ముందడుగు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.