ప్రజలే గెలవాలి!

‘వేతన జీవులకు జీతభత్యాలను సకాలంలో సమకూరుస్తున్నావు కదా? నీ ఉద్యోగులు కటకటపడితే అరిష్టం దాపురిస్తుంది సుమా! అన్నెం పున్నెం ఎరుగని అమాయకులను అన్యాయంగా నేరాల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడం లేదు కదా! కచ్చిత్‌ సహస్రాత్‌ మూర్థాణాం ఏక మిచ్ఛసి పండితం... అనేకమంది అస్మదీయులను అదేపనిగా సంప్రదించడం కన్నా, విచక్షణాజ్ఞానం కలిగిన ఒక్క వివేకవంతుణ్ని సలహా...

Published : 28 Apr 2024 01:43 IST

‘వేతన జీవులకు జీతభత్యాలను సకాలంలో సమకూరుస్తున్నావు కదా? నీ ఉద్యోగులు కటకటపడితే అరిష్టం దాపురిస్తుంది సుమా! అన్నెం పున్నెం ఎరుగని అమాయకులను అన్యాయంగా నేరాల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడం లేదు కదా! కచ్చిత్‌ సహస్రాత్‌ మూర్థాణాం ఏక మిచ్ఛసి పండితం... అనేకమంది అస్మదీయులను అదేపనిగా సంప్రదించడం కన్నా, విచక్షణాజ్ఞానం కలిగిన ఒక్క వివేకవంతుణ్ని సలహా అడగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ జాగ్రత్తలను పాటిస్తూ, నీవు పరిపాలనకు వన్నె తెస్తున్నావు కదూ!’... రామాయణం కచ్చిత్‌ సర్గలో రామచంద్రుడు స్వయంగా భరతుణ్ని ఆరాతీసిన విషయాలివి. అయోధ్యకాండలో ఆయన అమరభాషలో అక్షరాలా అడిగినవివి. అంతేకాదు, ‘మంత్రి జనమందు నీతి రక్షిత ధాత్రి గణింతువే... నీ మంత్రులు, అధికారుల చేతుల్లో ఈ భూమ్మీద నీతినియమాలు సురక్షితంగా ఉన్నాయో లేదో అనుక్షణం గమనిస్తున్నావు కదూ!’ అని రాముడు ప్రశ్నించాడు. ప్రజలు చెల్లించే పన్నులే ధనాగారానికి ముఖ్యమైన వనరు. కాకపోతే, వాటిని వసూలు చేసే తీరు- నేర్పరియైనవాడు మొక్కలనుంచి పూలు కోసినంత సుకుమారంగా ఉండాలి. తన దూడకు తగినన్ని పాలు చేపిన తరవాతే ఆవునుంచి పాలు పితకడం సరైన విధానమన్నాడు కృష్ణదేవరాయలు. అలా వసూలైన పన్నులతోనే ధనాగారం పుష్టిగా ఉంటుంది. అందుకే ‘పులి కూనలతిను చందము కలిగిన అంతటన నిలుచుగాక- ధనంబుల్‌ కలుగునె?’- ‘పులికి ఆకలి మితిమీరి, తన పిల్లలనే తినేసినట్లు- ప్రజల మీదపడి ముక్కుపిండి వసూలు చేస్తే వచ్చే డబ్బువల్ల కోశాగారం వృద్ధిచెందదు’ అని భారతంలోని శాంతిపర్వంలో భీష్మపితామహుడు స్పష్టంగా ప్రకటించాడు. భారత రామాయణాలు బోధిస్తున్న రాజనీతి సూత్రాలను, సూక్తులను అర్థంచేసుకొంటే... నేటి పాలకులు తలదించుకోవలసి వస్తుంది.

పాలకులు భుజాలు తడుముకోవడం సరే, ఇవే ప్రశ్నలు గుండెల్లో కుతకుతలాడుతున్నట్లయితే- ప్రజల కర్తవ్యం ఏమిటన్నది ప్రశ్న! ఒకప్పుడు ఇంగ్లాండులో నీతి నిజాయతీలు కలిగి, మంచి నాయకుడిగా పేరొందిన థామస్‌ బాబింగ్టన్‌ మెకాలే- లీడ్స్‌ నుంచి దిగువసభకు పోటీచేశాడు. ప్రకటనలు, ప్రచారాలు పట్టించుకోకుండా తాపీగా కూర్చున్నాడు. పత్రికలవారు ప్రశ్నిస్తే- ‘నామపత్రం దాఖలు చేయడం వరకే నా ధర్మం. నన్ను గెలిపించడం ప్రజల బాధ్యత. అది వారి ధర్మం. వారి అభీష్టాన్ని నేను గౌరవించాలి తప్ప, నాకు అనుకూలంగా ఓట్లు వేయమని శాసించడం అర్థరహితం’ అన్నాడు నిశ్చింతగా. ‘ధీరుండును వివేక దీపితుండునునైన ప్రభునకు ఓటమి భయము లేదు’ అని పంచతంత్రంలో నారాయణకవి చెప్పిందదే. మెకాలే మాటల్లోని సత్యదీప్తిని పత్రికలు గ్రహించాయి. విశేష ప్రచారాన్ని కల్పించాయి. ప్రజలు భారీ ఆధిక్యంతో గెలిపించారు. ‘ఓటన్నది రాజ్యాంగం మనకిచ్చిన హక్కు, ప్రజాస్వామ్య మనుగడకా హక్కు పెద్దదిక్కు!’ అని గుర్తించడం ప్రజల బాధ్యత. పసితనం ముగిసిన బిడ్డకు అలవాటు తప్పించాలని పాలిండ్లకు అమ్మ కుంకుడురసం పూసుకొంటుంది- దూరం చేయడం కోసం కాదది, వ్యక్తిని చేయడం కోసం! అనుచిత ఉచితాలు, ప్రలోభాల విషయంలో ప్రభుత్వాలు పాటించవలసిన తీరు అది! పాలు(ఖజానా) ఇంకిపోకముందే అలవాటు మానిపించాలి. అలవికాని రాయితీలే ప్రజలకు ఆనవాయితీలుగా మిగిలిపోతున్న విషయాన్ని గ్రహించాలి. ‘మార్చేస్తామంటారు నుదుటిమీద రాతలు- పండగెళ్ళిపోయాకా తేలతాయి వాతలు’ అన్న కవుల హెచ్చరికను జనం అర్థం చేసుకోవాలి. ‘వజ్రాలు అందిస్తారా వంకాయల ధరకు?’ అనే ప్రశ్నకు ప్రజలు సరైన జవాబు ఇవ్వగలిగిననాడు ప్రజాస్వామ్యం నిలబడుతుంది, బలపడుతుంది. ప్రజాప్రతినిధుల యోగ్యతలను తొలుత పత్రికలు గుర్తించాలి. వాటిని విజ్ఞులు విశ్లేషించాలి. చివరకు ప్రజలు ఆమోదించాలి, సమర్థించాలి. ఇలా మూడు అంచెల రక్షణ ప్రాకారాలు ఏర్పడిన నాడు ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లుతుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.