దుష్టుడికి అవకాశమిస్తే...

‘ఒక్క అవకాశం...’ అనేది వినడానికి చిన్న మాటలా తోస్తుంది. చిత్రపరిశ్రమలో కాలు పెట్టాలనో, అధికారాన్ని చేపట్టాలనో తహతహలాడేవారి నోట విరివిగా వినపడే మాట- ఒక్క అవకాశం! ‘అంతగా అడుగుతున్నప్పుడు ఓసారి ఇస్తే పోలే...’ అనిపిస్తుంది. కాని, అది అసలుకే ఎసరుతెచ్చిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ‘మనమా! వద్దిక నాదు మాట వినుమా’ అనిపించేశాయి.

Published : 05 May 2024 00:27 IST

‘ఒక్క అవకాశం...’ అనేది వినడానికి చిన్న మాటలా తోస్తుంది. చిత్రపరిశ్రమలో కాలు పెట్టాలనో, అధికారాన్ని చేపట్టాలనో తహతహలాడేవారి నోట విరివిగా వినపడే మాట- ఒక్క అవకాశం! ‘అంతగా అడుగుతున్నప్పుడు ఓసారి ఇస్తే పోలే...’ అనిపిస్తుంది. కాని, అది అసలుకే ఎసరుతెచ్చిన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ‘మనమా! వద్దిక నాదు మాట వినుమా’ అనిపించేశాయి. చలనచిత్రాల్లో అవకాశం ఇవ్వడం వల్ల జాతికి నష్టం జరిగే ప్రమాదం ఉండదు. అదే స్వార్థపరుడైన పాలకుడి చేతికి పగ్గాలు అందిస్తే మాత్రం- కొన్ని తరాలు తీవ్రంగా నష్టపోతాయి. రాష్ట్రాలు దేశాలు కనీసం పదేళ్లు వెనక్కిపోతాయి. విదేశీ వర్తకులు దేబిరించారని మనదేశం పొరపాటున ఒక అవకాశాన్ని అందించింది. కేరళలోని కాలికట్‌ను పాలించిన అప్పటి రాజు జమోరిన్‌ అందులో ఒక ప్రధాన పాత్రధారి. అతి భయంకరమైన దాని దుష్పరిణామం ఈ దేశం మొత్తాన్ని కుదిపేసింది. రెండు శతాబ్దాలకు పైగా భారతదేశం బానిసత్వంలో కూరుకుపోయింది. పోన్లే తలదాచుకొంటుందని ఒంటెకు ఒక అవకాశం ఇస్తే అది మొత్తం గుడారాన్నే ఆక్రమించిన తీరుగా- ఆ విదేశీ శక్తులు మన నెత్తినెక్కి అధికారాన్ని చలాయించాయి. దేశాన్ని నిలువునా దోచాయి. మనకు తీరని ద్రోహం చేశాయి. ‘కవోష్ణ రుధిర జ్వాలలతోటి స్వతంత్ర సమరం’ సాగించే దుస్థితిని కల్పించాయి. ఇది చరిత్ర! కాబట్టి ఒక్క అవకాశమనేది చిన్నమాట కానే కాదు. విశ్వామిత్రుడి యాగంలో విధ్వంసం సృష్టించేందుకై మారీచ సుబాహులు దండెత్తి వచ్చారు. రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. ‘సుబాహుడు గప్పున మండి ఒక బొగ్గుగా ధరణి బడెన్‌’ అన్నారు విశ్వనాథ. పనిలో పనిగా అప్పుడే మారీచుణ్నీ మట్టుపెట్టేస్తే తీరిపోయేది. కాని, రాముడో అవకాశం ఇచ్చాడు. తీరా వాడు సీతాపహరణంలో రావణుడికి సహకారం అందించాడు. రాముడి కొంప ముంచాడు.

దుష్టులకు అవకాశాలు ఇస్తే ఎంతటి దుర్మార్గానికి ఒడిగడతారో మనకు మహాభారతం సైతం వివరించింది. అరణ్యవాసం చేస్తున్న పాండవులను వేధించడానికై ఘోషయాత్ర పేరుతో దుర్యోధనుడి పరివారమంతా కట్టకట్టుకొని వచ్చారు. చిత్రసేనుడనే గంధర్వరాజు వారి పని పట్టాడు. అందరినీ బంధించి ఆకాశమార్గాన తరలించబోయాడు. కాగల కార్యం గంధర్వులే తీర్చారని ఊరుకొంటే పోయేదానికి, ధర్మరాజు పనిగట్టుకొని వారిని విడిపించాడు. ‘ఎన్నడును ఇట్టి సాహసములు ఇంక ఒనర్పకుమయ్య’ అని సుద్దులు చెప్పి సుయోధనుణ్ని వదిలేశాడు. అది పగపట్టే పాముకు పాలు పోసినట్లు అయింది. కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారితీసింది. పాండవులు లేని సమయంలో సైంధవుడు ద్రౌపదిపై అత్యాచారానికి యత్నించాడు. భీమార్జునులు వాణ్ని బందీని చేశారు. తల తరిగేస్తామన్నారు. అక్కడా ధర్మరాజే అడ్డంపడ్డాడు. ‘మన సోదరి దుస్సల దలంచి వానిని ఒక తప్పునకు సైప వలదె!’ అంటూ వాణ్ని విడిచిపెట్టేశాడు. ధర్మజుడు దయతలచి ఇచ్చిన ఆ అవకాశమే- చివరకు అభిమన్యుడి చావుకు మూలకారణమైంది. అలాగే సజ్జనుడికి దక్కిన అవకాశం సద్వినియోగమైన వైనాన్నీ భారతమే చెప్పింది. చనిపోయిన కచుణ్ని శుక్రాచార్యుడు బతికించాడు. తిరిగి అదే కచుడు గురువుకు ప్రాణం పోశాడు. రాక్షసజాతికి మేలు చేశాడు. ఆల్చిప్పలో పడ్డ స్వాతిచినుకు ముత్యం అవుతుందన్న సత్యాన్ని కచుడు నిరూపిస్తే- ‘అల్పబుద్ధి వానికి అవకాశమిచ్చిన...’ అనే సూక్తిని సైంధవుడు నిజం చేశాడు. ఓటనేది అమోఘమైన, పవిత్రమైన స్వాతిచినుకులాంటి ఆయుధం. ముత్యపు చిప్పలో పడటమే దానికి సార్థక్యం. దాన్ని ఎలాంటివారి చేతికి అందించి అధికారానికి అవకాశం కల్పిస్తున్నామో జాగ్రత్తగా ఆలోచించవలసిన సందర్భమిది. ఒక్కరోజు భోగం- ఆర్నెల్ల రోగం అన్నట్లుగా, అయిదారు రోజుల ప్రలోభం- అయిదేళ్ల ప్రారబ్ధంగా మారకుండా చూసుకోవాలి. ఒకసారి మోసపోతే చేసినవాడిది తప్పు... మళ్ళీ మళ్ళీ మోసపోవడం కోరి కొరివితో తల గోక్కున్నంత ముప్పు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.