Azadi Ka Amrit Mahotsav: దేవుణ్నీ నిలువుదోపిడీ చేశారు!

ఆంగ్లేయులకు సంస్థానమైనా.... దేవస్థానమైనా ఒక్కటే. తమ ఖజానాను నింపే కాసుల గంపలే. సంస్థానాలను కైవసం చేసుకునేందుకు తలలు గిరాటేశారు. దేవస్థానాలపై పట్టుసాధించేందుకు తలలు వంచారు.

Updated : 20 Apr 2022 06:42 IST

ఆంగ్లేయులకు సంస్థానమైనా.... దేవస్థానమైనా ఒక్కటే. తమ ఖజానాను నింపే కాసుల గంపలే. సంస్థానాలను కైవసం చేసుకునేందుకు తలలు గిరాటేశారు. దేవస్థానాలపై పట్టుసాధించేందుకు తలలు వంచారు. ఒకచోట భయపెట్టి చరాస్తులను సంపాదించారు. మరోచోట భయపడినట్లు నటించి అపార ధనలాభాన్ని పొందారు.

ఈస్టిండియా కంపెనీ వారు మన దేవాలయాలను సైతం ఆదాయ వనరులుగా మార్చుకున్నారు. కపట నాటకంతో భక్తుల కానుకలను కాజేశారు. తిరుపతి, కంచి, శ్రీరంగం, తిరువనంతపురం, పూరీ తదితర పట్టణాల్లోని ప్రసిద్ధ ఆలయాలకు భక్తులు వేలల్లో వెళుతుండటాన్ని గమనించారు. ఆయాచోట్ల మొక్కుల చెల్లింపులతో నిత్యం పోగుబడుతున్న బంగారం, వెండి, నగదును కొట్టేసేందుకు కొత్త అవతారమెత్తారు. దేవాలయాలకు చెందిన వేల ఎకరాల భూములను రైతులకు ఏటా రెవెన్యూ ఉద్యోగులే కౌలుకు ఇచ్చేవారు. శిస్తులను పకడ్బందీగా వసూలు చేసేవారు. అదేసమయంలో ఆలయాల్లో దేవుళ్ల పెళ్లిళ్ల నుంచి ఊరేగింపుల వరకు అన్నింటినీ దగ్గరుండి శాస్త్రప్రకారం చేయించేవారు. తమ ముందుకు వచ్చే సంస్థానాల రాజులు కిరీటాలను, సామాన్యులు తలపాగాలను తీసేయాలని ఆదేశించే కలెక్టర్లు, ఇతర ఉన్నతోద్యోగుల వైఖరి ఆలయాల ఉత్సవాల సమయంలో పూర్తిగా మారిపోయేది. వారు తమ బూట్లను విప్పి, టోపీలను సైతం తీసేసి విగ్రహాలకు నమస్కరించేవారు. ఉత్సవ మూర్తులకు కంపెనీ ప్రభుత్వం తరఫున ఏకంగా పట్టు వస్త్రాలను సమర్పించేవారు. ఉత్సవాలన్నీ అట్టహాసంగా నిర్వహించేవారు. రథాల ముందు కలెక్టర్ల ఆధ్వర్యంలో పోలీసులు, సైనికులు కవాతు చేసేవారు. అప్పట్లోనూ ఆయా ఆలయాల ఆదాయం భారీగానే ఉండేది. అక్కడ ఖర్చులుపోను మిగిలినదంతా లాభాలకింద పద్దు రాసుకుని, ఈస్టిండియా కంపెనీ ఖజానాకు తరలించేవారు. మొదట ఆంగ్లేయులు మద్రాసు ప్రెసిడెన్సీని ఫ్రెంచి వారి నుంచి 1759 ఫిబ్రవరిలో హస్తగతం చేసుకున్నారు. దక్షిణాదిన తమ అధికారం కుదురుకున్నాక ఆర్కాటు నవాబుల నుంచి 1801లో తిరుమల తిరుపతిని తమ హస్తగతం చేసుకున్నారు. అప్పటి నుంచి 42 సంవత్సరాల పాటు ఏడాదికి దాదాపు రూ.లక్ష వరకు తీసుకెళ్లారు.

మిషనరీల అభ్యంతరం
భారత్‌లో మత ప్రచారానికి క్రైస్తవ మిషనరీలకు 1813లో బ్రిటిష్‌ పార్లమెంటు అనుమతి ఇచ్చింది. అదే అదనుగా మరుసటి ఏడాది నుంచే దేశంలోకి తండోపతండాలుగా మతబోధకులు అడుగుపెట్టారు. ఆలయాల విషయంలో ఈస్టిండియా కంపెనీ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆదాయం కోసం తమది కాని మతాన్ని ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ఎట్టకేలకు 1843 నుంచి ఈస్టిండియా కంపెనీ... ఆలయాలపై తమ పెత్తనాన్ని వదులుకుంది. ఉత్సవాల నిర్వహణ బాధ్యతను స్థానిక అధికారులకు అప్పగించింది. అయితే ఏటా వచ్చే ఆదాయాన్ని మాత్రం తీసుకునేది. రాబడి తగ్గకుండా చూడాల్సిన బాధ్యతను రెవెన్యూ విభాగానికి అప్పగించి, మరీ పర్యవేక్షణ కొనసాగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని