Updated : 26 May 2022 08:57 IST

Azadi Ka Amrit Mahotsav: ఓ దొరా మళ్లీ రా!

మాకొద్దీ తెల్లదొరతనం అని నినదించిన ఈ నేల... ఆ దొరను మాత్రం నేటికీ పూజిస్తోంది. ఆ దొరలాంటి వారు ఇప్పటికీ కావాలనుకుంటోంది. ఈ నేలే కాదు... ఆయన నడిచిన ప్రతిచోటా నీరు పారింది. కన్నీరు మాయమైంది. రైళ్లపై కాదు... నీళ్లపై ఖర్చు చేయండని బ్రిటిష్‌ ప్రభుత్వంతోనే పోరాడిన అరుదైన ఆంగ్లేయుడు... 123 సంవత్సరాల కిందే కన్నుమూసినా... నేటికీ కోట్ల మంది జీవితాల్లో జీవనదిలా పారుతున్న అపర భగీరథుడు, డెల్టాశిల్పి... దార్శనికుడు... సర్‌ ఆర్థర్‌ కాటన్‌!
11 మంది సంతానంలో పదోవాడిగా 1803 మే 15న జన్మించిన ఆర్థర్‌ థామస్‌ కాటన్‌ ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఇంజినీర్‌గా ఎదిగి... 1821లో భారత్‌కు వచ్చారు. మద్రాసు రాష్ట్ర చీఫ్‌ ఇంజినీర్‌ వద్ద అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా చేరారు. ఆంగ్లో-బర్మా యుద్ధం తర్వాత 1828 నాటికి కెప్టెన్‌గా ఎదిగిన కాటన్‌కు నీటిపారుదల బాధ్యతలు అప్పగించారు. చోళ రాజులు చేపట్టిన పనుల స్ఫూర్తితో కావేరీ నదిపై పలు ఆనకట్టలు కట్టి... కరవు కాటకాలతో అల్లాడుతున్న తంజావూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చేశారాయన. తిండికి అలమటించే తంజావూరు కాస్తా... మద్రాసు రాష్ట్రంలో అత్యధిక పంట పండించే ప్రాంతంగానే కాదు... యావత్‌ భారత్‌లోనే ఎక్కువ ఆదాయం ఇచ్చే జిల్లాగా మారింది.

అరకొర సదుపాయాలతోనే..

ధవళేశ్వరం ప్రాజెక్టుకు ముందు ఆంధ్రాలోని గోదావరి జిల్లా పరిస్థితి దారుణంగా ఉండేది. అతివృష్టి అనావృష్టితో అల్లాడేది. ఈ పరిస్థితి మార్చేలా... గోదావరిపై బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించారు కాటన్‌. అనుమతైతే వచ్చిందిగాని... అడిగినన్నీ ఇవ్వలేదు. ఆరుగురు ఇంజినీర్లు, 8 మంది జూనియర్లు, 2వేల మంది మేస్త్రీలను అడిగితే... ఒక యువ ఇంజినీరును, ఇద్దరు సర్వేయర్లను, కొంతమంది మేస్త్రీలను అప్పగించి చేయమన్నారు. పట్టుదలతో ఆ కొద్దిమందితోనే రంగంలోకి దిగారు కాటన్‌. 1847లో పనిమొదలైంది. మరుసటి ఏడాదే... అనారోగ్య కారణాలతో ఆయన ఆస్ట్రేలియా వెళ్లాల్సి వచ్చింది. కలత చెందుతూనే తన కలల ప్రాజెక్టును విడిచి వెళ్లిన ఆయన... రెండేళ్లలో తిరిగి వచ్చారు. కర్నల్‌ స్థాయికి పదోన్నతి పొంది... రేయింబవళ్లు తన ఇంటిపనిలా పర్యవేక్షించారు. పాము కాటుతో కుమార్తె మరణించినా కుంగిపోకుండా... బ్యారేజి పని ఆగకుండా జాగ్రత్తపడ్డారు. స్థానికంగా లభ్యమయ్యే సామగ్రినే వాడుతూ 1852కల్లా బ్యారేజిని నిర్మించారు.  అనుకున్నదానికంటే తక్కువ ఖర్చులోనే పూర్తి చేసి చూపించారు. 370 మైళ్ల మేర కాలువలతో 3.6లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ... గోదావరి ప్రాంత రూపురేఖలను, జీవితాలను మార్చేశారు.  ధవళేశ్వరం తర్వాత... కృష్ణా నదిపై దృష్టిసారించారు. 1855కల్లా ప్రకాశం బ్యారేజి పూర్తి చేశారు. 1858లో భారత్‌లోని అన్ని నదుల అనుసంధానానికి ప్రతిపాదించారు. కలకత్తా నుంచి కరాచీ దాకా... ఇండస్‌ నుంచి నీలగిరుల దాకా నదులు, కాలువలను కలపాలనుకున్నారు. తాగునీరు, సాగునీటి సమస్యలతో పాటు... జల రవాణా వ్యవస్థ కూడా ఎంతో లాభదాయకమవుతుందని కాటన్‌ ఆకాంక్షించారు.

రైల్వేలతో పాటు... నీటి వసతికి, నీటి వనరులకు భారత్‌లో అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కాటన్‌ ఆంగ్లేయ సర్కారుతో పోరాడారు. ‘‘భారత్‌కు స్టీల్‌ కాదు నీళ్లనివ్వండి...’’ అంటూ వాదించారు. ఆయన తీరు నచ్చని ఆంగ్లేయ అధికారులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఇక్కడి నుంచి పంపించేయాలని విఫలయత్నాలు చేశారు. కాటన్‌ బుర్రలో నీరు తప్ప మరేమీ లేదని వేళాకోళం చేశారు. చివరకు... అభిశంసననూ కాటన్‌ ఎదుర్కోవాల్సి వచ్చింది. 1878లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ విచారణ కమిటీ ముందు హాజరై 900 ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానమిచ్చారు.

1860లో పదవీవిరమణ చేసి ఇంగ్లాండ్‌ వెళ్లిన కాటన్‌ను 1861లో బ్రిటిష్‌ రాణి నైట్‌హుడ్‌తో సత్కరించింది. 1877లో సంభవించిన కరవు గురించి విన్న కాటన్‌... ‘‘భారత ప్రాధాన్యాలను గుర్తించటంలో మన (ఆంగ్లేయ) సర్కారు ఘోరంగా విఫలమైంది. కోట్ల మంది తిండికి చస్తుంటే... కోట్లు ఖర్చు చేస్తూ రైల్వే లైన్లు వేస్తున్నాం. లక్షల మంది మరణం... నాగరికులం అనుకొనే మన దేశానికే తలవంపు’’ అని ఆక్షేపించారు.  ఆయన సిఫార్సు మేరకే...పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ)ని ఆంగ్లేయ సర్కారు ఆరంభించింది.

భారత్‌ను విడిచి వెళ్లాక... 84 ఏళ్ల వయసులో కాటన్‌ కొత్త ప్రాజెక్టు చేపట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కరవుకాటకాలు పోవాలంటే... వ్యవసాయ విధానాలు మారాలని భావించారు. తన తోటనే ప్రయోగశాలగా చేసుకొని వ్యవసాయం, ఉద్యాన పంటలపైనా పరిశోధనలు చేశారు. ఉత్తరాల ద్వారా భారతీయ రైతులకు సూచనలిచ్చేవారు. తన పరిశోధన సాగుతుండగానే... 96వ ఏట 1899లో కన్ను మూశారు కాటన్‌. ఒకవైపు ఆంగ్లేయులు భారత్‌ను అన్ని విధాలుగా లూటీ చేస్తుంటే... భారతీయుల జీవితాల్లో వెలుగులు నింపాలని తపించిన మహనీయుడు... భారతావని ఆత్మీయుడు కాటన్‌!


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని