జంటగా పుట్టారు.. గుట్టు విప్పారు!

కవలలు.. ఒకేసారి తల్లి గర్భాన్ని పంచుకుంటూ జంటగా పుట్టుకొచ్చే ప్రకృతి ప్రసాదితాలు! అమ్మానాన్నలకు రెట్టింపు ముద్దుమురిపాలను పంచే వరాలు!! మానవ ఆరోగ్యం, వ్యవహారశైలి గురించి

Updated : 02 Jan 2022 05:16 IST

కవలలపై పరిశోధనలతో వెలుగులోకి కీలక విషయాలు

కవలలు.. ఒకేసారి తల్లి గర్భాన్ని పంచుకుంటూ జంటగా పుట్టుకొచ్చే ప్రకృతి ప్రసాదితాలు! అమ్మానాన్నలకు రెట్టింపు ముద్దుమురిపాలను పంచే వరాలు!! మానవ ఆరోగ్యం, వ్యవహారశైలి గురించి మెరుగ్గా అర్థం చేసుకోవడానికి అనేక సందర్భాల్లో పరిశోధకులు కవలలపై ఆధారపడుతుంటారు. వారిలోని వైరుధ్యాలను పరిశీలించడం ద్వారా కొత్త విషయాలను వెలుగులోకి తెస్తుంటారు. వ్యాధులకు కారణమవుతున్న జన్యువులు, పర్యావరణ అంశాలను గుర్తించే ప్రక్రియను ఇలాంటి పరిశోధనలు విస్తృతం చేశాయి. తద్వారా కొత్త చికిత్సలు, నివారణ చర్యలపై అవగాహన ఏర్పడుతోంది. ఇప్పటివరకూ ఇలాంటి పరిశోధనల్లో వెల్లడైన కీలకాంశాలపై ఆస్ట్రేలియా శాస్త్రవేత్తల విశ్లేషణ ఇదీ..


ఎముకలను గుల్లబార్చే ధూమపానం

వ్యాధులకు పర్యావరణ అంశాలకు మధ్య ఉన్న బంధాన్ని గుర్తించడం చాలా సంక్లిష్ట ప్రక్రియ. జన్యుపరంగా వ్యక్తుల మధ్య ఉండే వైరుధ్యాల వల్ల నిర్దిష్ట అంచనాకు రావడం కష్టం. అయితే పరస్పరం భిన్న వాతావరణాల్లో పెరుగుతున్న, విభిన్న అలవాట్లు కలిగిన కవల సోదరులపై పరిశోధనల ద్వారా వీటిని అధిగమించొచ్చు. వీరిలో సాధారణంగా ఒకే రకం జన్యువులు ఉండటమే ఇందుకు కారణం. అందువల్ల అలవాట్ల పరంగా వారిలో ఉన్న వైరుధ్యాలను ఆసరాగా చేసుకొని  వ్యాధి కారణాలను నిర్దిష్టంగా గుర్తించొచ్చు. 1994లో ఆస్ట్రేలియాలో ఇలాంటి అధ్యయనం జరిగింది. అందులో 20 కవల జంటలను ఎంచుకున్నారు. ఒక్కో జంటలో ఒకరు చొప్పున దీర్ఘకాలంగా, తీవ్రస్థాయి ధూమపానం చేస్తున్నారు. రెండో వారికి ఈ అలవాటు లేదు. రోజుకు ఒక పెట్టె సిగరెట్ల చొప్పున 20 ఏళ్ల పాటు కాల్చడం వల్ల ఎముక సాంద్రత బాగా తగ్గిపోతుందని ఈ  పరిశోధన నిర్దిష్టంగా తేల్చింది. ఆస్టియోపొరోసిస్‌ను కలిగించే స్థాయిలో ఈ క్షీణత ఉందని వెల్లడైంది. దీనికితోడు ఎముక విరిగే ముప్పు కూడా రెట్టింపైనట్లు తేలింది.


మూర్ఛకు కాన్పు సమస్యలు ప్రధాన కారణం కాదు..

కాన్పు సమయంలో తలెత్తిన సమస్యల వల్లే మూర్ఛ రోగం వస్తున్నట్లు 1990ల ఆరంభం వరకూ భావిస్తుండేవారు. దీనికి ప్రసూతి నిపుణులు, నర్సులను నిందిస్తుండేవారు. అయితే 1993లో కవలలపై జరిగిన ఒక అధ్యయనం ఈ వాదనను విభేదించింది. కాన్పు సమయంలో వచ్చే చిన్నచిన్న సమస్యలు భవిష్యత్‌లో మూర్ఛ వ్యాధికి దారితీయబోవని తేల్చింది. ఈ రుగ్మతకు నిర్దిష్ట కారణాలను వెతికి పట్టుకునేందుకు ఈ సమాచారం దోహదపడింది. జన్యువులతోపాటు పర్యావరణ అంశాలూ దీనికి కారణమవుతున్నట్లు వెల్లడైంది.


జననానికి ముందే లుకేమియా

రక్త కణాలకు సంబంధించిన జన్యుక్రమంలో మార్పుల వల్ల లుకేమియా రావొచ్చు. ఇలాంటి మార్పులు ఒక్కో వ్యక్తిలో ఒక్కోలా ఉండొచ్చు. అయితే అవి ఎప్పుడు చోటుచేసుకోవచ్చన్నది అంతుచిక్కకుండా ఉండేది. ఏకరూప కవలలపై పరిశోధనతో ఈ గుట్టు వీడింది. ఈ తరహా చిన్నారుల్లో లుకేమియాకు మూలం ఒకే రకం కణమని అందులో తేలింది. గర్భంలో ఉండగా.. కవలల్లోని ఒక శిశువులో ఈ వ్యాధి మొదలవుతోందని, రక్తనాళాల ద్వారా రెండో చిన్నారికి అది రవాణా అవుతోందని వెల్లడైంది. తదనంతర కాలంలో ఆ శిశువులకు వేర్వేరు వయసుల్లో ఆ వ్యాధి బయటపడటానికి ఇదే కారణం. దీనికితోడు కొన్నిరకాల లుకేమియాలు ఏళ్ల తరబడి నిద్రాణంగా ఉండొచ్చని కూడా మొట్టమొదటిసారిగా ఈ పరిశోధన ద్వారా నిర్ధారణ అయింది. ఈ రుగ్మతపై నిర్దిష్టంగా శోధించడానికి ఇది బాటలు వేసింది.


ఏకరూప కవలలూ భిన్నమే

జన్యుపరంగా ఏకరూపత కలిగిన కవలలు చాలావరకూ ఒకేలా కనిపిస్తారు. అయితే  తల్లి గర్భంలో ఉన్నప్పుడు యాదృచ్ఛికంగా జరిగే కొన్ని ఘటనలు, శిశువులకు వేర్వేరుగా ఎదురయ్యే అనుభవాల వల్ల వీరి మధ్య కొన్ని వైరుధ్యాలుంటాయి. ఫలితంగా ప్రతి ఆరుగురు కవలల్లో ఒక జంటకు జనన సమయంలో బరువుపరంగా 20 శాతం కన్నా ఎక్కువ తేడా ఉంటుంది. దీనివల్ల.. బలహీనంగా ఉండే శిశువుకు జనన సమయంలో అనారోగ్య ముప్పు పెరగొచ్చు. బ్రెజిల్‌లో ఓ  కవల జంటలో ఒక చిన్నారి మాత్రమే జికా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌తో జన్మించడానికి ఇదే కారణం.


తాము ఎలాంటి కవలలమో చాలా మందికి తెలియదు

* ఫలదీకరణం చెందిన ఒకే అండం.. కొద్దిరోజుల తర్వాత విడిపోవడం వల్ల ఏకరూప కవలలు ఏర్పడుతుంటారు. వీరిద్దరి డీఎన్‌ఏ దాదాపుగా ఒకేలా ఉంటుంది. చాలావరకూ ఈ జంటలో ఇద్దరూ ఆడ లేదా మగ శిశువులై ఉంటారు.

* రెండు అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల సాధారణ కవలలు ఏర్పడుతుంటారు. వీరు జన్యుపరంగా భిన్నంగా ఉంటారు. ఇలాంటి ఒక కవల జంటలో ఒక్కోసారి ఆడ, మగ ఇద్దరూ ఉండొచ్చు.

* తాము సాధారణ కవలలమా.. ఏకరూప కవలలమా అన్న విషయం చాలామందికి తెలియదని 2012లో ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. కొందరు కవలలకు వైద్యులే ఈ విషయంపై అస్పష్ట సమాచారం ఇచ్చినట్లు వెల్లడి కావడం గమనార్హం.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని