icon icon icon
icon icon icon

దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్‌ షా

విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు.

Published : 17 May 2024 03:53 IST

మధుబనీ (బిహార్‌): విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. బిహార్‌లోని మధుబనీ, సీతామఢీ లోక్‌సభ స్థానాల పరిధిలో గురువారం ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. ‘ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండియా కూటమి అధికారంలోకి రాదు. ఒకవేళ వస్తే మమతా బెనర్జీ, స్టాలిన్‌, లాలూ ప్రసాద్‌లలో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అవుతారు? కొవిడ్‌లాంటిది వస్తే వాళ్లు దేశాన్ని రక్షించగలరా? ఉగ్రవాదం నుంచి దేశాన్ని కాపాడడం వారికి సాధ్యమవుతుందా?’ అని ప్రశ్నించారు. ‘పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) ఎప్పటికీ భారత్‌దే. దానిని ఎలాగైనా స్వాధీనం చేసుకుని తీరతాం. 140 కోట్ల మంది భారతీయులు ఎవరికీ భయపడరు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసినప్పుడు భారీ రక్తపాతం తప్పదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పేవారు. ఇప్పటికి ఐదేళ్లు గడిచాయి కానీ ఒక్క రాయి గాల్లోకి ఎగరలేదు. అయోధ్యలో రామాలయాన్ని నిర్మించి చూపించాం. సీతమ్మ జన్మస్థలమైన సీతామఢీలో భారీస్థాయిలో ఆమె గుడి కూడా కడతాం’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img