icon icon icon
icon icon icon

4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు.

Updated : 17 May 2024 06:04 IST

‘యువరాజు’లు విదేశాలకే 
యూపీ సభల్లో మోదీ

ప్రతాప్‌గఢ్‌, భదోహీ, ఆజంగఢ్‌ : లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. జూన్‌ 4 తర్వాత అనేక పరిణామాలు చోటుచేసుకుంటాయని.. లఖ్‌నవూ, దిల్లీ శహజాదే (యువరాజు)లు వేసవి విడిది పేరిట విదేశాలకు వెళ్లిపోతారని అఖిలేశ్‌ యాదవ్‌, రాహుల్‌ గాంధీలను ఉద్దేశించి అన్నారు. గురువారం యూపీలోని ప్రతాపగఢ్‌, ఆజంగఢ్‌, జౌన్‌పుర్‌, భదోహీలలో ఎన్నికల ప్రచారసభల్లో ఆయన ప్రసంగించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే మహిళల ఖాతాలోకి డబ్బును ‘ఖటా ఖట్‌, ఖటా ఖట్‌’ (వెన్వెంటనే) జమ చేస్తుందని రాహుల్‌ ఇటీవల చెప్పడాన్ని మోదీ ఎద్దేవా చేశారు. మళ్లీ అధికారం చేపట్టబోయేది తామేనని, ఇండియా కూటమే ఖటా ఖట్‌, ఖటా ఖట్‌ విచ్ఛిన్నమవుతుందని చెప్పారు. తాను బతికి ఉండగా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కొనిపోలేరని చెప్పారు.

వారికి దేశాన్ని నడపడం ఆషామాషీ కాదు

‘ఆగర్భ శ్రీమంతులుగా పుట్టినవారికి దేశాన్ని నడపడం ఆషామాషీ కాదు. అమేఠీ నుంచి వారు వెళ్లిపోయారు. ఇక రాయ్‌బరేలీ నుంచి వెళ్లిపోతారు. మా సర్కారు మూడోవిడత ఏర్పడి మరింత శక్తిమంతంగా ఉంటుందని యావద్దేశం చెబుతోంది. నా ప్రతీ క్షణం, నా శరీరంలో ప్రతీ కణం ప్రజల కోసమే. విపక్ష కూటమి ఎజెండా ఏమిటి? కశ్మీర్‌లో మళ్లీ 370 అధికరణాన్ని తెస్తామని చెబుతున్నారు. మేం చేసిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేస్తామంటున్నారు. నాకు వ్యతిరేకంగా ఓటు జిహాద్‌ కోసం వారు పిలుపునిస్తున్నారు. శ్రీరాముడిని మళ్లీ తాత్కాలిక గుడారంలోకి పంపిస్తామంటున్నారు. అది అసాధ్యమని వారు మరిచిపోతున్నారు’ అని చెప్పారు. ‘పదేళ్లుగా అధికారం లేకపోవడంతో వాళ్ల నల్లధన ఖజానాలు మొత్తం ఖాళీ అయిపోయాయి. దేశ ఖజానాపై ఇప్పుడు వారి కళ్లు పడ్డాయి. ప్రతిఒక్కరి ఆదాయంపై దర్యాప్తు చేస్తామని కాంగ్రెస్‌ యువరాజు చెబుతున్నారు. వారు మీ డబ్బును జప్తు చేసుకుని తమ ఓటుబ్యాంకులో ఉన్నవారికి పంచేస్తారు’ అని ప్రధాని చెప్పారు.

యూపీలో బెంగాల్‌ తరహా రాజకీయాలా?

బెంగాల్‌లో టీఎంసీ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతోందని.. మహిళలు, ఎస్సీలను వేధిస్తోందని మోదీ చెప్పారు. ‘‘భదోహీలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు డిపాజిట్లు దక్కించుకోవడం కష్టమే. అందుకే టీఎంసీ అభ్యర్థిని బరిలోకి దింపి.. బెంగాల్‌ తరహా రాజకీయాలను ఇక్కడ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నాయి’’ అని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img