icon icon icon
icon icon icon

Revanth Reddy: పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు విముక్తి కల్పిస్తా: రేవంత్‌ రెడ్డి

ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని సీఎం రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు.

Published : 02 May 2024 20:24 IST

సిద్దిపేట: ఆరునూరైనా మెదక్‌ గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగరాలని సీఎం రేవంత్‌రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. మెదక్‌ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్‌ గెలవబోతోందంటే దానికి కార్యకర్తలే కారణమన్నారు. ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా సిద్దిపేటలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సిద్దిపేటను 45 ఏళ్ల నుంచి పాపాల భైరవుల్లా మామ, అల్లుడు (కేసీఆర్‌, హరీశ్‌రావు) పట్టిపీడిస్తున్నారని వ్యాఖ్యానించారు. వారి నుంచి ఈ ప్రాంతానికి విముక్తి కల్పించడానికే వచ్చానని చెప్పారు. మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి అప్పట్లో ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీ ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. నెహ్రూ, ఇందిర వల్లే వేలాది పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చాయన్నారు. సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరకపోతే శాశ్వతంగా బానిసత్వం వస్తుందని హెచ్చరించారు.

వెంకట్రామిరెడ్డి వద్ద డబ్బులు ఎక్కువ ఉన్నాయనే మామ, అల్లుడు ఆయనకు టికెట్‌ ఇచ్చారని ఎద్దేవా చేశారు. కలెక్టర్‌గా పని చేసిన సమయంలో వెంకట్రామిరెడ్డి వందల ఎకరాల ప్రభుత్వ స్థలాలను కొల్లగొట్టారని, నిజాం దగ్గర ఖాసీం రిజ్వీ ఎలాగో.. కేసీఆర్‌కు వెంకట్రామిరెడ్డి అలా అని వ్యాఖ్యానించారు. మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా కరీంనగర్‌కు చెందిన వ్యక్తిని నిలబెట్టడం వెనక ఆంతర్యమేంటి? ఇక్కడ భారాసకు అభ్యర్థులు లేరా? అని ప్రశ్నించారు. సిద్దిపేటలో సభ పెడితే ఎవరూ రారేమోనని కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేశారని, ఇక్కడి జన సంద్రాన్ని చూస్తుంటే.. నీలం మధుకు లక్ష మెజార్టీ పక్కా అనిపిస్తోందని రేవంత్‌ అన్నారు. మొదటిసారిగా గడీలను బద్ధలు కొట్టే అవకాశం వచ్చిందనీ, సిద్దిపేట ప్రజల పౌరుషాన్ని చూశాక సంపూర్ణమైన నమ్మకం కలిగిందని వ్యాఖ్యానించారు.

పదేళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు ‘గాడిద గుడ్డు’ ఇచ్చారని రేవంత్‌ ఎద్దేవా చేశారు. భారాస, భాజపా ఒక్కటేనని వ్యాఖ్యానించారు. ముదిరాజ్‌ సామాజిక వర్గం వారికి మంత్రిపదవి ఇస్తానని హామీ ఇచ్చారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించారు. ‘‘సిద్దిపేట శనీశ్వరరావును పాతాళానికి తొక్కే బాధ్యత నాది. ఆగస్టు 15న సిద్దిపేటకు స్వాతంత్ర్యం రాబోతోంది. హరీశ్‌రావు ఆటలు.. పంద్రాగస్టు వరకే. రైతు రుణమాఫీ చేస్తా.. హరీశ్‌రావు రాజీనామా పత్రం సిద్ధంగా ఉంచుకో. హరీశ్‌ రాజీనామా చేశాక.. కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపిస్తా. రూ.2లక్షల రుణమాఫీ చెయ్యగానే సిద్దిపేటలో లక్ష మందితో భారీ సమావేశం పెడతా’’ అని రేవంత్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img