icon icon icon
icon icon icon

భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికే ముప్పు

భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 21 Apr 2024 04:15 IST

మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శ

మేళ్లచెరువు, న్యూస్‌టుడే: భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగానికి ముప్పు వాటిల్లుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మోదీ ప్రభుత్వం పదేళ్ల పాటు ప్రజాస్వామ్యాన్ని అణచివేసిందని ఆరోపించారు. మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజలకు స్వేచ్ఛ లేకుండా చేసిందని ధ్వజమెత్తారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాల ధరలను విచ్చలవిడిగా పెంచేసి ప్రజల జీవన స్థితిగతులను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భాజపాను మళ్లీ గెలిపిస్తే ప్రజాస్వేచ్ఛ ప్రశ్నార్థకమవుతుందన్నారు. రకరకాల కేసుల పేరుతో ఝార్ఖండ్‌, దిల్లీ సీఎంలు, పశ్చిమ బెంగాల్‌ మంత్రులనూ కక్షపూరిత ధోరణితో జైలుకు పంపించి, ప్రజాస్వామ్య విలువలను దిగజార్చారన్నారు. ఓటమి భయంలో ప్రతిపక్షాల ప్రచారాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాల బ్యాంకు ఖాతాలు స్తంభింపజేస్తోందని ఆరోపించారు. 2015 నుంచి 2020 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ కనీసం ఎంఎస్పీకే చట్టబద్ధత కల్పించలేదని ఎద్దేవాచేశారు. భాజపా ప్రభుత్వం రాష్ట్రానికీ ఏమీ చేయలేదన్నారు. కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్‌ పరిశ్రమలు ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఐదేళ్లయినా ఎయిమ్స్‌కూ పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్నారు. సాగునీటి ప్రాజెక్టులను విస్మరించిన భాజపా నాయకులకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. భారాస గురించి మాట్లాడటం సమయం వృథాయేనన్నారు. ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీ మూడో స్థానానికి పడిపోవడం ఖాయమన్నారు. ఇండియా కూటమిలో ప్రధానిగా రాహుల్‌ గాంధీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని జోస్యం చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img