icon icon icon
icon icon icon

మెదక్‌ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?

‘మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధే జరగలేదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, భారాస సీనియర్‌ నేత తన్నీరు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు.

Published : 21 Apr 2024 04:18 IST

రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్‌
సీఎం కుర్చీని గౌరవిస్తున్నాం.. తిట్టేందుకు మాకు నోరు లేక కాదు
మైనారిటీలు లేని క్యాబినెట్‌తో రికార్డు సృష్టించారని వ్యాఖ్య

గజ్వేల్‌, న్యూస్‌టుడే: ‘మెదక్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధే జరగలేదంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డీ.. ఎవరి హయాంలో ఏం జరిగిందో చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, భారాస సీనియర్‌ నేత తన్నీరు హరీశ్‌రావు సవాల్‌ విసిరారు. గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిధులన్నీ మెదక్‌, సిద్దిపేట జిల్లాలకే భారాస ప్రభుత్వం కేటాయిస్తోందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడి.. ఇప్పుడు అభివృద్ధి ఏమీ లేదని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఓ వైపు సింగూరు జలాలను మెదక్‌కు ఇవ్వక.. ప్రత్యేక జిల్లా చేయాలని స్థానికులు 40 ఏళ్లు పోరాటాలు చేసినా పట్టించుకోక.. గోస పెట్టింది కాంగ్రెస్‌ కాదా? అని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌ల నిర్మాణాలు, కొత్త జిల్లాలు, రెండు విశ్వవిద్యాలయాలు, జిల్లాకో వైద్య కళాశాల ఏర్పాటు, ఇంటింటికీ తాగునీరు, ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చింది కేసీఆర్‌ హయాంలోనే అనే విషయాన్ని రేవంత్‌రెడ్డి తెలుసుకొని మాట్లాడితే మంచిదన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరని పేర్కొన్నారు. ‘కేసీఆర్‌ను, నన్ను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు.. తిట్టేందుకు మాకు నోరు లేక కాదు.. సంస్కారం అడ్డు వస్తోంది.. సీఎం కుర్చీకి గౌరవం ఇవ్వాలని మేము ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నాం’ అని తెలిపారు.

భాజపాకు బీటీం ఎవరో ప్రజలు గమనిస్తున్నారు

వందల ఎకరాల భూసేకరణ చేసింది లక్షలాది మంది రైతులకు సాగునీరు అందించడానికేనన్నారు. దేశంలో ఎక్కడా లేని ప్యాకేజీలు ఇచ్చి, ప్రపంచంలోనే లేనివిధంగా నిర్వాసితులకు కాలనీలు కట్టించిన ఘనత భారాసది అని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీని భాయ్‌ అంటూ ప్రధాని మోదీని బడేభాయ్‌ అంటున్నావంటే భాజపాకు బీటీం ఎవరో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. మైనారిటీలు లేని క్యాబినెట్‌ను రేవంత్‌రెడ్డి నడుపుతూ రికార్డు సృష్టించారని విమర్శించారు. పదవి కోసం నాడు తెదేపాను.. ఇప్పుడు కాంగ్రెస్‌ను రేవంత్‌రెడ్డి తొక్కుతున్న మాట నిజమేనని వారి పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మెదక్‌ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, నియోజకవర్గ భారాసఇన్‌ఛార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, బల్దియా ఛైర్మన్‌ రాజమౌళి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, భారాస రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img