icon icon icon
icon icon icon

మోదీకి ఓటమి భయం

ప్రధాని మోదీని ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే మతాల మధ్య చిచ్చుపెట్టేలా.. అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Updated : 23 Apr 2024 07:36 IST

అందుకే మతచిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు
ఓ వర్గానికి ఆస్తులు పంచడం అంత తేలికా?!
ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలవకపోతే పథకాలు ఆగిపోయే ప్రమాదం
భాజపా కోసం కేసీఆర్‌ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు
నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, అంతాయిపల్లి సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి

ఓట్ల కోసం రాముడిని రోడ్లపైకి తీసుకురావడం మోదీకే చెల్లింది. రాముడు మాకు కూడా దేవుడే. మా ఇంట్లోనూ ఆయనతో పాటు ఇతర దేవుళ్లను పూజిస్తాం. దేవుడు గుడిలో.. భక్తి గుండెల్లో ఉండాలి. నేను హిందువుగా గర్విస్తా. ముఖ్యమంత్రిగా ఇతర మతాలను గౌరవిస్తా. మతం పేరిట విభజన రాజకీయాల నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పోరాడుతోంది.      

-సీఎం రేవంత్‌రెడ్డి

ఈనాడు-నిజామాబాద్‌, హైదరాబాద్‌, ఈటీవీ-ఆదిలాబాద్‌, శామీర్‌పేట, జవహర్‌నగర్‌-న్యూస్‌టుడే: ప్రధాని మోదీని ఓటమి భయం వెంటాడుతోందని, అందుకే మతాల మధ్య చిచ్చుపెట్టేలా.. అశాంతిని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం దేశానికి మంచిది కాదన్నారు. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ స్పందించారు. కాంగ్రెస్‌ గెలిస్తే ప్రజల సంపదనంతా ముస్లింలకు పంచుతుందంటూ ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడటం సరికాదన్నారు. అన్నదమ్ములు ఆస్తులు పంచుకోవాలన్నా రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. అక్రమంగా ఎవరైనా ఆస్తులు రాయించుకుంటే శిక్షించేందుకు చట్టాలున్నాయని పేర్కొన్నారు. ఓ వర్గం ఆస్తిని ఇతర వర్గాల వారికి ఎలా పంచుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ సెక్యులర్‌ పార్టీ అన్న విషయాన్ని మరవొద్దన్నారు. ఆయన సోమవారం నిజామాబాద్‌, ఆదిలాబాద్‌లతో పాటు మల్కాజిగిరి నియోజకవర్గంలోని శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో కాంగ్రెస్‌ నిర్వహించిన జనజాతర సభల్లో ప్రసంగించారు. ‘‘కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ల పాలనలో పేదలు, మహిళలు, యువత ఆశలు నెరవేరలేదు. ఆదివాసీలు, గిరిజనులు, నిరుద్యోగుల గోడును వారు పట్టించుకోలేదు. పదేళ్లలో దేశాన్ని నరేంద్ర మోదీ నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. ప్రపంచంలో ఆకలి, ఆకలిచావులు ఎక్కువగా ఉన్న దేశాలపై నిర్వహించిన సర్వే ర్యాంకింగ్‌లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల కంటే భారత్‌ దిగువన ఉండేదా?రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లోని హామీల్లో అయిదింటిని అమలు చేశాం. 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించాం. పేదల ఇళ్లలో వెలుగులు చూసిన కేసీఆర్‌, మోదీలు.. తమ కళ్లల్లో నిప్పులు పోసుకున్నారు. ఉచిత కరెంటు ఆపాలని, కాంగ్రెస్‌ను ఓడించాలని, ప్రభుత్వాన్ని పడగొట్టాలని పథకాలు పన్నుతున్నారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలవకపోతే గ్యారంటీ పథకాలు ఆగిపోయే ప్రమాదం ఉంది. దిల్లీ మద్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న తన కుమార్తె కవిత బెయిల్‌ కోసం భాజపాతో మాజీ సీఎం కేసీఆర్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో భాజపా అభ్యర్థులను గెలిపించేందుకు డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.

బాసర సరస్వతీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నా..

రుణమాఫీపై ప్రతిపక్షాలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. బాసర సరస్వతీ అమ్మవారి సాక్షిగా చెబుతున్నా.. శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత నాదే. నల్లచట్టాలపై పోరాటం చేసి ప్రధానితో క్షమాపణ చెప్పించిన ఘనత హరియాణా, పంజాబ్‌ రైతులది. అదే తరహా పోరాట స్ఫూర్తి, ఆత్మగౌరవం నిజామాబాద్‌ ప్రాంత రైతుల్లో ఉంది. గతంలో పసుపు బోర్డు, నిజాం చక్కెర కర్మాగారంపై హామీలిచ్చి విస్మరించిన కేసీఆర్‌ కుమార్తె కవితను ఓడించారు. ఇదే తరహాలో బాండ్‌ పేపర్‌ రాసిచ్చి పసుపు, ఎర్రజొన్న రైతులను మోసగించిన భాజపా ఎంపీని కూడా ఓడించాలి. రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి, స్వయంగా రైతు అయిన నిజామాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డిని గెలిపించాలి. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక.. అధిష్ఠానాన్ని ఒప్పించి జీవన్‌రెడ్డిని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రిని చేయించే బాధ్యత తీసుకుంటాను. సెప్టెంబరు 17 నాటికి నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం.  

ఒక్కోసారి ఓటమి కూడా మంచే చేస్తుంది

ఒక్కోసారి ఓటమి కూడా మంచే చేస్తుంది. 2018 ఎన్నికల్లో నన్ను కక్షపూరితంగా వ్యవహరించి ఓడించారు. కానీ, ఆ తర్వాత నాలుగు నెలల్లోనే జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దేశంలోనే అత్యధిక ఓట్లున్న మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేయాలని నన్ను రాహుల్‌ గాంధీ ఆదేశించారు. 30 లక్షల మందికి పైగా ఓటర్లున్న నియోజకవర్గంలో.. ప్రశ్నించే గొంతుక అవసరమని గ్రహించిన ప్రజలు నన్ను గెలిపించారు. ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుంటే ఎంపీగా అవకాశం వచ్చేది కాదు. అధిష్ఠానం నా ప్రతిభను చూసి పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది.

లోక్‌సభ ఎన్నికల అనంతరం తెల్ల రేషన్‌కార్డులు

లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ తెల్ల రేషన్‌కార్డులను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇవ్వనుంది. మల్కాజిగిరిలో పట్నం సునీతా మహేందర్‌రెడ్డి గెలుపు ప్రకటన మరుక్షణం ఇక్కడి నుంచే తెల్ల రేషన్‌కార్డుల జారీ ప్రకటన చేస్తాం. ఎంపీగా సునీత గెలిస్తే.. పట్నం మహేందర్‌రెడ్డిని ప్రభుత్వ విప్‌గా నియమిస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతారని చెప్పే ఈటల.. కేసీఆర్‌, కేటీఆర్‌ల అవినీతిపై, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై కేంద్రానికి ఎందుకు ఫిర్యాదు చేయడం లేదు? మతాల మధ్య చిచ్చుపెడుతున్న మోదీ చర్యలను కమ్యూనిస్టునని చెప్పుకొనే భాజపా మల్కాజిగిరి అభ్యర్థి ఈటల ఎలా సమర్థిస్తారు?

ఆదిలాబాద్‌లో వర్సిటీ ఏర్పాటు చేస్తాం

ఆదిలాబాద్‌లో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తాం. మూతపడిన సిమెంటు పరిశ్రమను ప్రైవేటు భాగస్వామ్యంతోనైనా తిరిగి తెరిపిస్తాం. కడెం ప్రాజెక్టుకు మరమ్మతులు చేస్తాం. బోథ్‌ నియోజకవర్గంలో కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి.. ఆ సర్కారును ఒప్పించి.. అక్కడి ముంపు రైతులకు పరిహారం ఇప్పిస్తాం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మిస్తాం. ఆ ప్రాజెక్టుకు మళ్లీ అంబేడ్కర్‌ పేరు పెడతాం. మేడ్చల్‌, శామీర్‌పేట్‌లలో ఐటీ, ఫార్మా సంస్థలు ఏర్పాటు చేస్తాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. సభల్లో లోక్‌సభ అభ్యర్థులు టి.జీవన్‌రెడ్డి(నిజామాబాద్‌), ఆత్రం సుగుణ(ఆదిలాబాద్‌), పట్నం సునీతా మహేందర్‌రెడ్డి (మల్కాజిగిరి), మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, ఎమ్మెల్సీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, భూపతిరెడ్డి, లక్ష్మణ్‌కుమార్‌, వెడ్మ బొజ్జు, జి.వినోద్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు మధుయాస్కీ, మండవ వెంకటేశ్వరరావు, వేణుగోపాలాచారి, మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్‌రెడ్డి, కూన శ్రీశైలంగౌడ్‌, ఎం.సుధీర్‌రెడ్డి, వజ్రేశ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


సీఎం సభా స్థలంలో డ్రోన్‌ కలకలం.. ముగ్గురిపై కేసు

ఈనాడు, హైదరాబాద్‌:  అంతాయిపల్లిలో ఎన్నికల సభకు సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లిన సమయంలో డ్రోన్‌ ఎగరడం కలకలం రేపింది. సీఎం ప్రయాణించిన హెలికాప్టర్‌ హెలిప్యాడ్‌లో ల్యాండ్‌ అయిన తర్వాత ఒక్కసారిగా డ్రోన్‌ కనిపించడంతో భద్రతా సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అప్పటికే సీఎం హెలికాప్టర్‌ నుంచి కిందకు దిగారు. డ్రోన్‌ను ఆపరేట్‌ చేస్తున్న ముగ్గుర్ని బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఎండీ ఇద్రిస్‌, గణేశ్‌రెడ్డి, అక్షయ్‌గా గుర్తించారు. డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి మీడియా బృందంలోని సభ్యులని వారు చెప్పినట్లు తెలిసింది. హెలికాప్టర్‌ ల్యాండయ్యే సమయంలో డ్రోన్‌ను ఎగరేయడం నిబంధనలకు విరుద్ధం. ముగ్గురు నిందితులనూ శామీర్‌పేట ఠాణాకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img