icon icon icon
icon icon icon

గోదావరి జలాలను తరలిస్తే చూస్తూ ఊరుకోం

గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని, గోదావరి నీళ్లను తరలించి తెలంగాణ రైతాంగానికి నష్టం చేస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 24 Apr 2024 03:30 IST

భారాస కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌

రాంపూర్‌(కరీంనగర్‌), న్యూస్‌టుడే: గంగా నది నుంచి కావేరి వరకు నదుల అనుసంధానం పేరుతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని, గోదావరి నీళ్లను తరలించి తెలంగాణ రైతాంగానికి నష్టం చేస్తే చూస్తూ ఊరుకోమని కరీంనగర్‌ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో నీటి కొరత ఏర్పడుతుందని అన్నారు. తెలంగాణకు ఇవ్వాల్సిన గోదావరి నదీ జలాల వాటా తేల్చాలని, గోదావరి బేసిన్‌లో తెలంగాణ వాటా కింద 968 టీఎంసీలు రావాల్సి ఉందని పేర్కొన్నారు.. ఇచ్చంపల్లి వద్ద వంద మీటర్ల ఎత్తులో డ్యాం నిర్మించి ఇతర రాష్ట్రాలకు నీటిని తరలిస్తే ఊరుకోమన్నారు.. గతంలోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిపై కేంద్రానికి పలుమార్లు లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. 1985లో అప్పటి ముఖ్యమంత్రి  యన్‌.టి.రామారావు హయాంలో ఇచ్చంపల్లి ప్రాజెక్టు సర్వే చేయగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ వ్యతిరేకించాయన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం వారం రోజుల క్రితం ఎంవోయూ పత్రాలను పంపి, సంతకాలు చేయాలని లేఖలు రాస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు? రాష్ట్రంలోని నలుగురు భాజపా ఎంపీలు.. ముఖ్యంగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ దీనిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులతోపాటు మరికొన్నింటికి కేంద్రం జాతీయ హోదా ఇవ్వడం లేదని, సమ్మక్క, సీతారామ, వర్ధా ప్రాజెక్టుల అనుమతులు కేంద్రం వద్ద పెండింగ్‌లోనే ఉన్నాయని చెప్పారు. బ్యారేజీ పిల్లర్లు కుంగిన అంశంపై కేంద్ర అధికారులు పరిశీలించి అయిదు నెలలవుతున్నా ఇప్పటికీ నివేదిక ఇవ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ వద్ద కాఫర్‌డ్యాం నిర్మించకపోవడంతో 50 టీఎంసీల నీరు వృథాగా పోయిందన్నారు. ఇప్పుడు కళ్లు తెరిచిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కాఫర్‌డ్యాం కోసం టెండర్లు పిలుస్తోందని  వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ టి.భానుప్రసాద్‌రావు, టెస్కాబ్‌ ఛైర్మన్‌ కె.రవీందర్‌రావు, మేయర్‌ వై.సునీల్‌రావు, భారాస జిల్లా, నగర అధ్యక్షులు జి.వి.రామకృష్ణారావు, హరిశంకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img