icon icon icon
icon icon icon

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్ర

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు.

Published : 29 Apr 2024 03:26 IST

దీన్ని అడ్డుకునే శక్తి భారాసకే ఉంది
12 ఎంపీ సీట్లు కేసీఆర్‌కు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు : కేటీఆర్‌

వేములవాడ, తిమ్మాపూర్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ఆరోపించారు. అలానే మన రాష్ట్ర అవసరాలు తీరకముందే నదుల అనుసంధానం పేరిట గోదావరి జలాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు. వీటిని అడ్డుకునే శక్తి ఒక్క భారాసకే ఉందని, అత్యధిక సంఖ్యలో ఎంపీలను గెలిపించాలని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కరీంనగర్‌ జిల్లా అల్గునూర్‌లో ఆదివారం నిర్వహించిన వేములవాడ, మానకొండూర్‌ నియోజకవర్గాల భారాస బూత్‌ సభ్యుల సమావేశాల్లో, చొప్పదండి రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారాసను ప్రజలు ఓడించలేదని, ఒకరికి పెత్తనం ఇస్తే మరొకరు ఓర్వలేక మనకు మనమే ఓడించుకున్నామని వ్యాఖ్యానించారు. ‘‘70 ఏళ్ల వయసున్న కేసీఆర్‌ తుంటి విరిగినా, కుమార్తె జైల్లో ఉన్నా, నమ్మిన వాళ్లు మోసం చేసి ఇతర పార్టీలోకి వెళ్లినా బస్సు యాత్ర పేరిట జనంలో తిరుగుతున్నారు. తల్లిలాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు పంచాయితీలు పక్కన పెట్టి విజయానికి కృషిచేయాలి’’ అని పార్టీ శ్రేణులకు సూచించారు.


రాముడికి భాజపాకు ఏం సంబంధం?

‘‘జన్‌ధన్‌ ఖాతా తెరిస్తే ఒక్కొక్కరికి రూ.15 లక్షలు వేస్తామని 2014లో బడే భాయ్‌ మోదీ.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని 2023లో ఛోటా భాయ్‌ రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేశారు. తెలంగాణ పుట్టుకనే అవమానించిన వ్యక్తి మోదీ. డీజిల్‌, పెట్రోల్‌, నిత్యావసర సరకుల ధరలు పెంచారు. జాతీయ రహదారుల నిర్మాణానికి పన్నులు వసూలు చేసి.. మళ్లీ టోల్‌ రుసుము పేరుతో రూ.30 లక్షల కోట్లు దోచారు. అందులో రూ.14.50 లక్షల కోట్లతో అదానీ, అంబానీ వంటివారి రుణాలు మాఫీచేశారు. రాముడు అందరి దేవుడు. భాజపాకు, రాముడికి ఏమి సంబంధం ఉంది. భాజపా ఓడినా, ఆ పార్టీ లేకున్నా రాముడు అట్లాగే ఉంటాడు. ఈ పదేళ్లలో ప్రధాని మోదీ అందరి మెదళ్లలో హిందూ, ముస్లిం అనే విషం నింపారు. సీఎం రేవంత్‌రెడ్డివి చిల్లర మాటలు.. ఉద్దెర పనులు. ఆయన మాటలు వినడం మన దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం వరి పంటకు ఇస్తామన్న రూ.500 బోనస్‌ బోగస్‌ అయింది. ఆరు హామీలు అమలు కావడం లేదు. ఎన్నికల తరవాత ఉచిత బస్సు ప్రయాణం, విద్యుత్‌ పథకాలు మాయం అవుతాయి. రేవంత్‌రెడ్డి, భాజపా ఎంపీ బండి సంజయ్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగంగా కాంగ్రెస్‌ తరఫున కరీంనగర్‌లో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ భాజపా, భారాస మధ్యే పోటీ. కాంగ్రెస్‌తో అసలు పోటీయే లేదు. ఈ ఎన్నికల్లో కేసీఆర్‌కు 12 ఎంపీ సీట్లు ఇస్తే రాష్ట్ర రాజకీయాలను శాసించే రోజు ఏడాదిలో వస్తుంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌, స్థానిక నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img