icon icon icon
icon icon icon

ఖమ్మంలో కాంగ్రెస్‌ విజయానికి సమష్టి కృషి

దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. భారత్‌ను సమైక్యంగా ఉంచేందుకు ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు.

Updated : 30 Apr 2024 22:48 IST

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
విద్యుత్‌ సరఫరాపై మాజీ మంత్రులవి దిగజారుడు విమర్శలని ధ్వజం

ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రయత్నిస్తున్నారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. భారత్‌ను సమైక్యంగా ఉంచేందుకు ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు పాదయాత్ర చేశారని గుర్తుచేశారు. దేశ సంపద, వనరులను ప్రజలకు పంచాలన్నదే ఆయన అభిమతమని పేర్కొన్నారు. ఖమ్మంలోని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క క్యాంపు కార్యాలయం ప్రజాభవన్‌లో ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శాసనసభ్యులు మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, రాందాస్‌నాయక్‌; సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సోమవారం ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. అధిష్ఠానం నిర్ణయించిన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని నిర్ణయించారు. మిత్రపక్షాలైన సీపీఐ, సీపీఎం నాయకులతో కలిసి లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకు సాగాలని నిర్ణయించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన మిత్రులు అదానీ, అంబానీలకు సంపదను దోచిపెట్టారని, రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లూటీ చేశారని ఆరోపించారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ ఇళ్లలో కూర్చొని విద్యుత్‌ సరఫరాపై దిగజారుడు విమర్శలు చేశారని మండిపడ్డారు. కరెంటు పోకపోయినా పోయినట్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. పదేళ్లుగా రాష్ట్రాన్ని దోచుకొని కేసీఆర్‌ బస్సు యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యుత్‌, తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు ఉండవని స్పష్టం చేశారు.

విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. చీఫ్‌ వార్డెన్‌ తప్పుడు ప్రకటనలు చేశారని, ఆయనకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామన్నారు. విద్యార్థులు నిశ్చింతగా విశ్వవిద్యాలయంలో ఉంటూ చదువుకొని ఉన్నతస్థాయికి చేరుకోవాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 13 రోజుల పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు విరామం లేకుండా పనిచేయాలన్నారు. మే నెల 4న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్తగూడెం బహిరంగ సభకు హాజరవుతారని ప్రకటించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భాజపా, భారాసలను గత ఎన్నికల్లో మాదిరిగానే ఓడించేందుకు కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు సీట్లు రావని.. భాజపా రెండుకు మించి గెలవలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img