icon icon icon
icon icon icon

‘ఇండియా’ కూటమికి ప్రధాని అభ్యర్థి ఎవరు?

భాజపా నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారని.. ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా నాయకురాలు తమిళిసై ప్రశ్నించారు.

Published : 05 May 2024 05:49 IST

కేసీఆర్‌ గవర్నర్‌ పదవికైనా మర్యాద ఇవ్వలేదు
భాజపా నాయకురాలు తమిళిసై

సంగారెడ్డి అర్బన్‌, మెదక్‌ - న్యూస్‌టుడే: భాజపా నుంచి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారని.. ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరని భాజపా నాయకురాలు తమిళిసై ప్రశ్నించారు. సంగారెడ్డిలోని ఓ హోటల్‌లో జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా శనివారం నిర్వహించిన విశిష్ట సంపర్క్‌ అభియాన్‌ (మేధావుల సదస్సు)కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశరక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావడం ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌, భారాసలకు ఓటువేసినా ప్రయోజనం శూన్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల విషయంలో ఫేక్‌ వీడియో ద్వారా కాంగ్రెస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు. మహిళలకు ఆరోగ్య సంరక్షణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇంటింటా శౌచాలయాలు, ‘బేటీ బచావో.. బేటీ పఢావో’ వంటి పథకాలు అమలు చేసిందన్నారు. తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో భాజపా విజయం సాధిస్తే, కేంద్రంలో మంత్రి పదవులు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్‌ అభ్యర్థి బీబీ పాటిల్‌ను గెలిపించాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, వీసీఏ తెలంగాణ ప్రముఖ్‌ ఆలె భాస్కర్‌రాజ్‌, జిల్లా ప్రముఖ్‌ శంకర్‌, జిల్లా అధికార ప్రతినిధి రాజుగౌడ్‌, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు వాసు పాల్గొన్నారు. అంతకు ముందు సంగారెడ్డి వైకుంఠపురంలోని దేవాలయంలో తమిళిసై ప్రత్యేక పూజలు చేశారు.

‘భారాసగా మారగానే ఆ పార్టీ పని అయిపోయింది..’

తెరాస, భారాసగా మారగానే ఆ పార్టీ పని అయిపోయిందని తమిళిసై అన్నారు. శనివారం రాత్రి మెదక్‌లో మేధావుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. మహిళగా తనకు ప్రాధాన్యం ఇవ్వలేదని, కనీసం గవర్నర్‌ పదవికి అయినా మర్యాద ఇవ్వలేదన్నారు. ‘‘కేసీఆర్‌ కుమార్తె కవిత దేశం కోసం జైలుకు వెళ్లిందా? ఆమె చేసిన నిర్వాకం వల్ల తెలంగాణ మహిళలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. భారాస పార్టీ నలుగురు వ్యక్తుల కుటుంబమైతే.. ప్రధాని మోదీది 140 కోట్ల కుటుంబం’’ అని తమిళిసై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img