icon icon icon
icon icon icon

భాజపాకు ఓటేస్తే గొంతు కోసుకున్నట్లే..

రిజర్వేషన్లను తొలగించేందుకే భాజపా 400 సీట్లు కోరుతోందని, ఆ పార్టీకి ఓటేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్లవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

Published : 09 May 2024 06:13 IST

ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

నిర్మల్‌, లోకేశ్వరం, న్యూస్‌టుడే: రిజర్వేషన్లను తొలగించేందుకే భాజపా 400 సీట్లు కోరుతోందని, ఆ పార్టీకి ఓటేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్లవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నాయకులతో బుధవారం ఆయన నిర్మల్‌లో ఆంతరంగిక సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భాజపా, భారాసలు కాంగ్రెస్‌పై దుష్ప్రచారం చేయడానికి రైతుభరోసాను అందకుండా చేసి, అన్నదాతలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. రాజ్యాంగ రక్షణ కోసం కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని, కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో పేర్కొన్న కులగణనను అడ్డుకునేందుకు భాజపా యత్నిస్తోందని విమర్శించారు. హక్కులు, వాటా పొందాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని, అమాయకుల తరఫున పోరాటం చేస్తున్న ఆదివాసీ ఆడబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని అభ్యర్థించారు. నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అనేక ప్రాజెక్టులు చేపట్టి బీడు భూములను సస్యశ్యామలం చేసిందన్నారు. గత భారాస ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదని, తాము వాటికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు. పోడు భూముల సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి దీపా దాస్‌మున్షీ, మంత్రి సీతక్క, ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, మాజీ మంత్రులు ఎస్‌.వేణుగోపాలాచారి, ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమమే కాంగ్రెస్‌ ధ్యేయం: సీతక్క

ఎన్ని అడ్డంకులున్నా రైతులకు మేలు చేయాలనేదే సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యమని, రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ పార్టీ ధ్యేయమని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం ఆమె నిర్మల్‌ జిల్లా లోకేశ్వరం, నిర్మల్‌ మండలం రత్నాపూర్‌ కాండ్లీ, మండల కేంద్రం లక్ష్మణ చాందలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పని క్షేత్రాల వద్దకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. రాహుల్‌ ప్రధాని కాగానే మహిళల ఖాతాల్లోకి రూ.లక్ష జమ చేయనున్నామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img