icon icon icon
icon icon icon

మళ్లీ మంత్రిస్తారా?

వరుసగా మూడోసారి హిట్‌ కొట్టాలని చూస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రికి అభిమానులెలాంటి తీర్పిస్తారు?... పాలమ్మి పైకొచ్చిన మంత్రిని ఈసారీ ప్రజలు ఆశీర్వదిస్తారా?... చదువుల మంత్రికి పరీక్ష గొట్టుగా ఉంటుందా? గట్టెక్కిస్తుందా?

Updated : 16 Nov 2023 06:54 IST

వరుసగా మూడోసారి హిట్‌ కొట్టాలని చూస్తున్న సినిమాటోగ్రఫీ మంత్రికి అభిమానులెలాంటి తీర్పిస్తారు?... పాలమ్మి పైకొచ్చిన మంత్రిని ఈసారీ ప్రజలు ఆశీర్వదిస్తారా?... చదువుల మంత్రికి పరీక్ష గొట్టుగా ఉంటుందా? గట్టెక్కిస్తుందా?... రాష్ట్ర రాజధానిలోని హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి నియోజకవర్గాలపై విశ్లేషణ...


సనత్‌నగర్‌.. ఎవరి సొంతం?

హ్యాట్రిక్‌ విజయంపై  తలసాని గురి

బేగంపేట, అమీర్‌పేట తదితర కీలక వాణిజ్య ప్రాంతాలతో కూడిన సనత్‌నగర్‌ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హ్యాట్రిక్‌ విజయంపై దృష్టిపెట్టారు. ఇక్కడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి శశిధర్‌రెడ్డి భాజపా అభ్యర్థిగా, కాంగ్రెస్‌ తరఫున..  కోట నీలిమ పోరాడుతున్నారు. నియోజకవర్గంలోని సనత్‌నగర్‌, బల్కంపేట డివిజన్లలో ఎక్కువగా కార్మికులు నివసిస్తుండగా.. రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేటలలో ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు. మోండా డివిజన్‌లోని కొంతభాగం ఈ నియోజకవర్గంలో కలుస్తుంది.


చేసింది చెబుతూ..

2014లో సనత్‌నగర్‌ తెదేపా అభ్యర్థిగా గెలిచిన తలసాని.. భారాసలో చేరి మంత్రి అయ్యారు. 2018లో భారాస అభ్యర్థిగా గెలిచి మళ్లీ మంత్రి పదవి చేపట్టారు. సనత్‌నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ నిర్మాణం, బహుళ ఉపయోగ ఫంక్షన్‌ హాళ్లు, క్రీడా ప్రాంగణాలు, వైట్‌ ట్యాపింగ్‌ రహదారుల నిర్మాణం, శ్మశాన వాటికల అభివృద్ధి, జీరా ప్రాంతంలో వివాదంలో ఉన్న ఇళ్ల సమస్యకు పరిష్కారం, సుభాష్‌నగర్‌లో హైటెన్షన్‌ తీగల తొలగింపు, అయిదు ప్రాంతాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను ప్రచారంలో తలసాని ప్రస్తావిస్తున్నారు. నియోజకవర్గంలో భారాస బలంగా ఉండడం మంత్రికి కలిసొచ్చే అంశం. వివిధ పథకాల్లో పార్టీ కార్యకర్తలే ఎక్కువగా లబ్ధి పొందారనే ఆరోపణలు, కొన్ని డివిజన్లలో భారాస ప్రతినిధులు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మూడు డివిజన్లు భాజపా ఖాతాలోకి వెళ్లడం వంటివి తలసానికి ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి.


కమలదళమే దన్నుగా...

కాంగ్రెస్‌ నుంచి వచ్చి కమల తీర్థం పుచ్చుకున్న మర్రి శశిధర్‌రెడ్డి.. మోదీ నాయకత్వాన్ని బలపర్చాలని  ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలపై గళమెత్తుతూ ఉన్నతస్థాయి అధికారులకు ఫిర్యాదు చేయడం, భాజపా సంప్రదాయ ఓటింగ్‌ వంటివి ఆయనకు కలిసొచ్చే అంశాలు. సీనియర్‌ నాయకులు పలువురు పార్టీ ప్రచారానికి దూరంగా ఉండటం.. కాంగ్రెస్‌ నుంచి స్థానిక ముఖ్య నేతలెవరూ ఆయనతోపాటు భాజపాలోకి రాకపోవడం కొంత ప్రతికూల ప్రభావం చూపవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


కాంగ్రెస్‌ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ..

డా.కోట నీలిమ రచయిత్రి, పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్తగా సేవలందించారు. ఆమె భర్త పవన్‌ఖేడా ఏఐసీసీ మీడియా వింగ్‌ ఇన్‌ఛార్జి కావడంతో.. ఆమెకు పార్టీ పెద్దల మద్దతు ఉంది. కాంగ్రెస్‌ గ్యారంటీ హామీలను ప్రచారం చేస్తున్నారు. స్థానికేతరురాలు కావడం, కొందరు కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకులు భారాసలో చేరగా.. మరికొందరు పార్టీలో ఉన్నా అప్పుడప్పుడు తలసాని శిబిరంలో కనిపిస్తుండడం గమనార్హం. వీటితో పాటు టికెట్‌ ఆశించి భంగపడిన రవీందర్‌గౌడ్‌, మర్రి ఆదిత్యరెడ్డి (శశిధర్‌రెడ్డి కుమారుడు) ప్రచారానికి దూరంగా ఉండడం ప్రతికూలతలుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

న్యూస్‌టుడే, సనత్‌నగర్‌


చామకూర x తోటకూర

మేడ్చల్‌లో ఎవరిదో హల్‌చల్‌

మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్‌ నియోజకవర్గంలో పోరు రసవత్తరంగా మారింది. 2018 ఎన్నికల్లో కె.లక్ష్మారెడ్డి(కాంగ్రెస్‌)పై 87,990 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన మల్లారెడ్డి... మరోసారి గెలిచేందుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ బీసీ మంత్రాన్ని పఠిస్తోంది. 2018లో అభ్యర్థి కె.లక్ష్మారెడ్డికి మహేశ్వరం టికెట్‌ కేటాయించిన పార్టీ... 2014 ఎన్నికల్లో తెదేపా నుంచి పోటీ చేసిన తోటకూర వజ్రేశ్‌యాదవ్‌కు మేడ్చల్‌ టికెట్‌ ఇచ్చింది. ఘట్‌కేసర్‌ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల కలయికతో ఉన్న ఈ నియోజకవర్గంలో మూడు పార్టీల అభ్యర్థులు వ్యూహప్రతివ్యూహాలతో దూసుకెళుతున్నారు.


అభివృద్ధి నినాదంపై అమిత విశ్వాసం

రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలే తనని గెలుపుబాట పట్టిస్తాయని మంత్రి సీహెచ్‌.మల్లారెడ్డి విశ్వాసంతో ఉన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో వేసిన రోడ్లు, గ్రామ పంచాయతీలకు, పాఠశాలలకు నిర్మించిన నూతన భవనాలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ఇంటింటికీ అందుతున్న తాగునీరు, పింఛన్లను ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. సొంత నిధులతో దేవాలయాలను అభివృద్ధి చేయడం, సీసీ రోడ్ల నిర్మాణం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. అయితే తమను కలుపుకొని వెళ్లరని... స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మంత్రిపై అసంతృప్తిగా ఉన్నారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడినట్లు మల్లారెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. భారాస మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం పార్టీపై కొంత ప్రతికూల ప్రభావం చూపొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


మంత్రిపై ఆరోపణలే అస్త్రాలు

ఘట్‌కేసర్‌ మండలం బోడుప్పల్‌కు చెందిన తోటకూర వజ్రేశ్‌ యాదవ్‌ 2014 ఎన్నికల్లో తెదేపా తరపున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచారు. మహాకూటమితో పొత్తు కారణంగా 2018లో తెదేపా తరఫున పోటీ చేయలేకపోయారు. బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూనే, కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మంత్రి మల్లారెడ్డిపై ఉన్న భూకబ్జా ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. భారాస మాజీ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి, గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి నక్కా ప్రభాకర్‌గౌడ్‌ కాంగ్రెస్‌లో చేరడం కలిసొచ్చే అంశం. అయితే... స్థిరాస్తి వ్యాపారంలో అక్రమాలకు పాల్పడినట్లుగా వజ్రేశ్‌ యాదవ్‌పై గతంలో ఆరోపణలు రావడం కొంత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.


మోదీ కరిష్మాపై నమ్మకం

ఘట్‌కేసర్‌ ఎంపీపీ, అవుషాపూర్‌కు చెందిన ఏనుగు సుదర్శన్‌రెడ్డి ఏడాది క్రితమే భారాస నుంచి భాజపాలో చేరారు. నియోజకవర్గ అభ్యర్థిగా తొలుత పట్టోళ్ల విక్రంరెడ్డి పేరును ఖరారు చేశారు. తర్వాత సుదర్శన్‌రెడ్డికి కేటాయించారు. మోదీ కరిష్మా తన గెలుపునకు ఉపకరిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. భారాస, కాంగ్రెస్‌ అభ్యర్థులపై అవినీతి ఆరోపణలు ఘాటుగా చేస్తున్నారు. అయితే... ఓట్లను రాబట్టుకోవడంలో భాజపా క్షేత్రస్థాయి నేతల నుంచి ఎంత మేరకు సహకారం ఉంటుందన్నదే కీలకం.

 న్యూస్‌టుడే, కీసర


ముక్కంటి దీవెనలెవరికో

మహేశ్వరంలో ముక్కోణపు పోటీ

ప్రఖ్యాత ఉమామహేశ్వరాలయం ఉన్న మహేశ్వరం నియోజకవర్గం నుంచి భారాస అభ్యర్థిగా మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి బరిలో నిలిచారు. ఆమె 2009, 2018లలో కాంగ్రెస్‌ నుంచి గెలిచి, భారాసలో చేరారు. 2018లో పోటీచేసిన తీగల కృష్ణారెడ్డి(భారాస)కి ఈసారి టికెట్‌ దక్కలేదు. పారిశ్రామికవేత్త, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్‌) కాంగ్రెస్‌ అభ్యర్థిగా అనూహ్యంగా తెరపైకి వచ్చారు. 2000 ఉపఎన్నికలో చేవెళ్లలో సబిత (కాంగ్రెస్‌), కేఎల్‌ఆర్‌ (తెదేపా) పోటీ చేయగా సబిత గెలిచారు. ఇక భాజపా అభ్యర్థిగా అందెల శ్రీరాములు యాదవ్‌ రెండోసారి పోటీకి దిగారు. సబిత, కేఎల్‌ఆర్‌లు పార్టీలు మారినా...23 ఏళ్ల తర్వాత ప్రత్యర్థులుగా నిలవడం, మధ్యలో శ్రీరాములు సైతం గట్టిగా ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఇక్కడ బీఎస్పీ తరఫున కొత్త మనోహర్‌రెడ్డి  పోటీలో ఉన్నారు.


ప్రగతి పనులే గెలిపిస్తాయని... 

నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తున్నానని, తన పనితీరే మళ్లీ గెలిపిస్తుందని మంత్రి సబిత నమ్మకంగా ఉన్నారు. మెడికల్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ కాలేజీల ఏర్పాటు, మహేశ్వరంలో 30 పడకల ఆసుపత్రి ఆధునికీకరణ, చైతన్యపురిలో 400 పడకల ఆసుపత్రి నిర్మాణం, వివిధ పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన, మీర్‌పేటలో చెరువుల సుందరీకరణ, కులసంఘాలకు భవనాలు, దేవాలయాల పునర్నిర్మాణం, రోడ్ల అభివృద్ధి తదితర ప్రగతి పనులను ప్రచారంలో అన్నిచోట్లా ప్రస్తావిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, మైనారిటీలు భారాస వెంటే ఉంటారని విశ్వసిస్తున్నారు. కొన్నాళ్లపాటు తీవ్ర అసంతృప్తితో ఉన్న తీగల కృష్ణారెడ్డిని అధిష్ఠానం బుజ్జగించడంతో ఆయన సబితకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటుండటం కలిసొచ్చే అంశం. ప్రభుత్వంపై వ్యతిరేకత, కొందరు ద్వితీయశ్రేణి నాయకులపై భూఆక్రమణల ఆరోపణలు, మహేశ్వరం ఎంపీపీ రఘుమారెడ్డి, బడంగ్‌పేట మేయర్‌ పారిజాత నర్సింహారెడ్డి, తుక్కుగూడ మున్సిపల్‌ ఛైర్మన్‌ మధు కాంగ్రెస్‌లో చేరడం సబిత గెలుపును ప్రభావితంచేసే అంశాలు.


ఓటు బ్యాంకుపై గురి..

పారిజాత నర్సింహారెడ్డికి తొలుత టికెట్‌ ఖారారు చేసిన కాంగ్రెస్‌ తర్వాత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్‌ఆర్‌)కి కేటాయించింది. దాంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆమెను అధిష్ఠానం సముదాయించడంతో ప్రచారంలో పాల్గొంటున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు బలంగా ఉందని కేఎల్‌ఆర్‌ నమ్ముతున్నారు. పార్టీ ఆరు హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. తన ట్రస్ట్‌ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు సైతం గెలిపిస్తాయనే విశ్వాసంతో ఉన్నారు. అయితే, స్థానికుడు కాదని ప్రత్యర్థులు ఆయనపై ప్రచారం చేస్తున్నారు. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులను కలుపుకొని పోవడం కేఎల్‌ఆర్‌కు సవాల్‌గా మారింది.


సానుభూతి.. యువ ఓటర్లపై ఆశలు

2018లో ఇక్కడ ఓడిపోయిన భాజపా అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్‌పై ప్రజల్లో కొంత సానుభూతి ఉంది. నియోజకవర్గంలో రెండు లక్షలపైగా యువ ఓట్లు ఉండడంతో వారిని ఆకర్షించడానికి ప్రాధాన్యమిస్తున్నారు. కుల సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, బీసీనైన తనను గెలిపించాలని కోరుతున్నారు. తాను స్ధానికుడినని, భారాస, కాంగ్రెస్‌ల అభ్యర్థులు స్థానికేతరులని ప్రచారంలో పదేపదే ప్రస్తావిస్తున్నారు. మోదీ కరిష్మా కలిసి వస్తుందని అనుకుంటున్నారు. శ్రీరాములు స్థిరాస్తి వ్యాపారంలో భూ ఆక్రమణలు చేశారనే ఆరోపణలు ఉండడం ప్రతికూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.

 న్యూస్‌టుడే, మహేశ్వరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img