icon icon icon
icon icon icon

పాలమూరులో ఎవరిదో పాగా?!

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కీలక స్థానాల్లో ఒకటి. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది.

Updated : 30 Apr 2024 22:36 IST

పాత అభ్యర్థుల మధ్య హోరాహోరీ
భారీ మెజారిటీ సాధించాలని సీఎం రేవంత్‌ లక్ష్యం
సిటింగ్‌ స్థానం నిలబెట్టుకోవడంపై భారాస దృష్టి
గెలిచి తీరాలని భాజపా అభ్యర్థి అరుణ పట్టుదల
మహబూబ్‌నగర్‌ నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గం.. ప్రస్తుతం రాష్ట్రంలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న కీలక స్థానాల్లో ఒకటి. సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ ఈ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేనాటికి భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌ సిటింగ్‌ ఎంపీగానే ఉన్నారు. గతంలో మహబూబ్‌నగర్‌ ఎంపీలుగా ఎన్నికైన జైపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌ లాంటివారు కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. పాలమూరుకు వన్నె తెచ్చారు. ప్రస్తుతం పాలమూరు బరిలో హోరాహోరీ పోరు నడుస్తోంది. శాసనసభ ఎన్నికల మాదిరే లోక్‌సభ స్థానంలోనూ గెలిచి ఆధిపత్యం చాటాలని కాంగ్రెస్‌.. తమ సిటింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. రెండోసారి విజయం సాధించాలని భాజపా.. మూడు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.


కాంగ్రెస్‌లో ధీమా 

గత నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలు-షాద్‌నగర్‌, మక్తల్‌, కొడంగల్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జడ్చర్ల, దేవరకద్రలలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. అదే ఊపులో లోక్‌సభ స్థానంలోనూ విజయం సాధిస్తామనే ధీమాతో ఉంది. ఇక్కడ హస్తం పార్టీ చివరిసారిగా 2004లో గెలిచింది. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం, నియోజకవర్గంలో అన్ని విధాలుగా బలంగా ఉండటం వల్ల.. మహబూబ్‌నగర్‌లో ఈసారి విజయం తమదేనన్న ధీమాతో పార్టీ ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చవిచూసిన చల్లా వంశీచంద్‌రెడ్డినే మరోసారి అభ్యర్థిగా ప్రకటించింది. మిగతా పార్టీల కంటే ముందే ప్రచారం ప్రారంభించింది. కొడంగల్‌ సెగ్మెంట్‌లో 50 వేల ఓట్ల మెజారిటీ సాధించాలని, మిగిలిన ఆరు సెగ్మెంట్ల పరిధిలోనూ భారీ ఆధిక్యం పొందాలని సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే అయిదుసార్లు నియోజకవర్గంలో పర్యటించి.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గత శాసనసభ ఎన్నికల కంటే ఎక్కువ మెజారిటీ రావాల్సిందేనని, తక్కువ వస్తే ఎమ్మెల్యేలే బాధ్యులవుతారని పరోక్షంగా హెచ్చరికలూ జారీ చేస్తున్నారు. నియోజకవర్గంలో భాజపా నుంచే గట్టి పోటీ ఉందనే భావనతో ఆ పార్టీ అభ్యర్థి డీకే అరుణపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. మహిళల ఓట్లపై కాంగ్రెస్‌ భారీగా ఆశలు పెట్టుకుంది. మైనారిటీలూ తమవైపే నిలుస్తారని ఆశిస్తోంది.


భారాసలో ఆశలు

శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు సెగ్మెంట్లలోనూ భారాస పరాజయం పాలైంది. లోక్‌సభ ఎన్నికల్లో పూర్వవైభవం సాధించేందుకు ఈ సిటింగ్‌ ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకోవడంపై పార్టీ దృష్టి సారించింది. సిటింగ్‌ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డినే మళ్లీ బరిలోకి దింపింది. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో క్యాడర్‌, బలమైన ఓటుబ్యాంకు ఉండటం లాభిస్తుందని పార్టీ భావిస్తోంది. గత తొమ్మిదిన్నరేళ్ల భారాస ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను నేతలు ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వలసల జిల్లాను ప్రగతిపథాన నడిపించింది కేసీఆర్‌ ప్రభుత్వమేనని చెబుతున్నారు. పదేళ్లలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పలు అంశాల్లో విఫలమైందని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంలో రైతుబీమా అమలు కావడం లేదని, రైతుబంధు నిధులు అందరికీ అందలేదని, పాలమూరు ఎత్తిపోతల పనులు సాగడం లేదని, కరెంటు కోతలు విధిస్తున్నారని, ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని విమర్శిస్తున్నారు. అధినేత కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌షో పార్టీలో ఉత్సాహం నింపింది. అయిదు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రైతులతో పాటు తమ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాల లబ్ధిదారులు తమకే ఓటు వేస్తారని భారాస భావిస్తోంది. మైనారిటీల ఓట్లపైనా కొంత నమ్మకంతో ఉంది.


భాజపాలో నమ్మకం

మహబూబ్‌నగర్‌ ఎంపీ నియోజకవర్గంపై భాజపా గట్టి ఆశలే పెట్టుకుంది. ఇక్కడి నుంచి సీనియర్‌ నేత, మాజీ మంత్రి డీకే అరుణ రెండోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆమె చివరి నిమిషంలో టికెట్‌ దక్కించుకున్నా.. గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. ఈసారి ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. పార్టీ నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి తదితరులు కాంగ్రెస్‌లోకి వెళ్లడం కొంత ఇబ్బందికరంగా మారినా.. దాన్ని అధిగమించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న పరిచయాలు, కుటుంబ రాజకీయ నేపథ్యం, నారాయణపేట, మక్తల్‌లలో కీలక బంధుగణం మద్దతుతో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఎంపీ నియోజకవర్గం పరిధిలోని ఒక్క స్థానంలోనూ భాజపా గెలవలేదు. ఓట్లు సైతం తక్కువగానే వచ్చాయి. అయినప్పటికీ లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలు కీలకం అవుతాయని.. తమ పార్టీని ప్రజలు ఆదరిస్తారని ఆమె విశ్వసిస్తున్నారు. నారాయణపేటలో ఏర్పాటు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సభ ద్వారా నియోజకవర్గంలో సానుకూల పరిస్థితి ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఆమె గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని భాజపా శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి. పార్టీకి ఎమ్మెల్యేలు, క్యాడర్‌ లేకపోవడం, మైనారిటీలు దూరంగా ఉండడం వంటివి కొంత ఇబ్బందికరంగా మారాయి. యువత, మేధావులు, విద్యావంతుల ఓట్లు తమకే వస్తాయని భాజపా విశ్వసిస్తోంది.  


ఘన చరిత్ర

ఓ వైపు ఆంధ్రప్రదేశ్‌, మరోవైపు కర్ణాటక రాష్ట్రాలు.. కృష్ణా, తుంగభద్ర నదుల ప్రవాహాలు.. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులు, సంప్రదాయాల కలబోత.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన పాలమూరు నియోజకవర్గానికి రాజకీయంగా చాలా ప్రాధాన్యం ఉంది. ఎంతోమంది మేధావులు, విద్యావంతులు, కార్మికులు, కర్షకులకు ఇది నెలవు. ఒకప్పుడు వలసలకు పేరొందిన ఈ ప్రాంతం.. ఇప్పుడు తిరుగువలసల దశకు చేరింది. ఈ నియోజకవర్గానికి 1952 నుంచి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పదిసార్లు, భారాస మూడుసార్లు, భాజపా, తెలంగాణ ప్రజాసమితి, జనతా పార్టీ, జనతాదళ్‌ ఒక్కోసారి గెలిచాయి. గత మూడుసార్లు భారాసయే గెలిచి.. హ్యాట్రిక్‌ సాధించింది. గత ఎన్నికల్లో భాజపా రెండో స్థానంలో, కాంగ్రెస్‌ మూడో స్థానంలో నిలిచాయి.


కృష్ణా తీరం..  సమస్యలతో సహవాసం

కృష్ణా తీరాన ఉన్న ఈ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయితే ఈ కష్టాలు తీరుతాయని జడ్చర్లకు చెందిన రైతు రాజిరెడ్డి తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెంటనే చేపట్టాలని రైతులు కోరుతున్నారు. నియోజకవర్గంలో రైల్వే రవాణా సౌకర్యాలు సరిగా లేవని ప్రజల్లో అసంతృప్తి ఉంది. జిల్లా కేంద్రమైన నారాయణపేటకు ఇప్పటికీ రైల్వే లైన్‌ లేదని నగల వ్యాపారి వెంకటేశ్వర్లు చెప్పారు. జడ్చర్ల-నంద్యాల, జడ్చర్ల-మిర్యాలగూడ, అచ్చంపేట-మహబూబ్‌నగర్‌-తాండూరు, వికారాబాద్‌-కృష్ణా, గద్వాల-మాచర్ల, అచ్చంపేట వంటి కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు సర్వేలకే పరిమితమవుతున్నాయన్నారు. రైల్వే లైన్ల డబ్లింగ్‌, విద్యుదీకరణ, నవీకరణలోనూ వెనకబాటు కనిపిస్తోంది. రైతుబంధు నిధులు అందలేదని పలువురు రైతులు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళల్లో మంచి స్పందన కనిపిస్తోంది. రేవంత్‌రెడ్డి సీఎం అయినందువల్ల తమ సెగ్మెంట్‌ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు కొడంగల్‌కు చెందిన కిరాణా దుకాణం యజమాని దామోదర్‌ చెప్పారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కారణంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఫిబ్రవరి నుంచి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలు అమలు కాలేదు.


సవాళ్లు.. ప్రతి సవాళ్లు

ప్రచారంలో భాగంగా భాజపా, కాంగ్రెస్‌లు పరస్పర విమర్శలు, సవాళ్లు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇతర పథకాలు అమలు చేశామని కాంగ్రెస్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోంది. రైతులకు పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని, కొడంగల్‌-నారాయణపేట ఎత్తిపోతల వంటి పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని, ముదిరాజ్‌లను బీసీ-డీ నుంచి ‘ఏ’కు మారుస్తామని, ఎస్సీ వర్గీకరణకు కృషి చేస్తామని భరోసా ఇస్తోంది. మరోవైపు, గత ప్రభుత్వ హయాంలో పాలమూరులో చేసిన అభివృద్ధి, రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాల అంశాలను భారాస ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఇక భాజపా.. పదేళ్ల మోదీ పాలన, జాతీయ రహదారుల విస్తరణ, కేంద్ర పథకాలతో సాధించిన అభివృద్ధిని వివరిస్తోంది.


పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలే ప్రధానాంశం

ఎన్నికల్లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రధానాంశంగా ఉంది. దీనిపై పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నాయి. 12 లక్షల ఎకరాలకు నీరందించే ప్రాజెక్టును తమ పార్టీ చేపట్టి తుది దశకు తెచ్చిందని, దాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డుకునేందుకు యత్నించిందని, కేంద్రంలోని భాజపా ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వలేదని భారాస నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఎత్తిపోతల నిర్మాణంలో భారాస విఫలమైందని, భాజపా సైతం సహకరించలేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ పథకానికి నాంది పలికింది తానేనని, ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో కొట్లాడి మరీ సర్వే కోసం జీవో తెచ్చానని భాజపా అభ్యర్థి డీకే అరుణ పేర్కొంటున్నారు.


ఓటరు నాడి

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆశతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేశామని, ఇప్పటికి నాలుగున్నర నెలలే అయిందని.. ఇంకా నాలుగున్నర సంవత్సరాలకు పైగా సమయం ఉన్నందువల్ల తమకు మంచి చేస్తుందని నమ్ముతున్నామని మక్తల్‌ మండలం గుడిగండ్లకు చెందిన పాల వ్యాపారి రాజయ్య తెలిపారు. ధాన్యం అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నామని, ఇది ప్రభుత్వ వైఫల్యమేనని దేవరకద్ర రైతు మల్లికార్జున్‌ చెప్పారు. మోదీ వచ్చాకే దేశ ప్రతిష్ఠ పెరిగిందని, ఇవి జాతీయస్థాయి ఎన్నికలైనందువల్ల ఆ కోణంలో ఆలోచిస్తున్నామని మహబూబ్‌నగర్‌ యువకుడు శశిధర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img