icon icon icon
icon icon icon

కాంగ్రెస్‌కే సవాల్‌!

గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది.

Published : 01 May 2024 04:23 IST

కొన్నైనా గెలవాలని గట్టి ప్రయత్నం 
పట్టు నిలుపుకోవాలని కమలదళం
7న ఛత్తీస్‌గఢ్‌లో చివరి విడత పోలింగ్‌

గత ఏడాది చివర్లో జరిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్‌ పార్టీ.. లోక్‌సభ ఎన్నికల్లో కొన్ని చోట్లయినా గెలిచి ప్రతిష్ఠను కాపాడుకోవాలని చూస్తోంది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో పెద్దగా విజయాలు సాధించని ఆ పార్టీ ఈసారి గట్టిగా పోరాడాలని నిర్ణయించుకుంది. మరోవైపు గత వైభవాన్ని కొనసాగించాలని భాజపా తలపోస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 11 నియోజకవర్గాల్లో ఇప్పటికే 4 చోట్ల పోలింగ్‌ పూర్తయింది. మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన 7 చోట్ల పోలింగ్‌ జరగనుంది.

  • మూడో విడతలోని 7 నియోజకవర్గాల బరిలో మొత్తం 168 మంది నిలిచారు. వారిలో 142 మంది పురుషులు, 26 మంది మహిళలు.
  • ఈసారి పోటీ పడుతున్న వారిలో సంపన్న నేతల సతీమణులు ఉన్నారు. వారివద్ద కిలోల కొద్దీ బంగారం ఉన్నట్లు అఫిడవిట్ల ద్వారా వెల్లడైంది.
  • అభ్యర్థుల్లో భారీగా అప్పులు ఉన్నవారూ ఉన్నారు.
  • ఛత్తీస్‌గఢ్‌లో మోదీ, అమిత్‌ షాతోపాటు రాహుల్‌ గాంధీ ఉద్ధృతంగా ప్రచారం చేస్తున్నారు.
  • మూడో విడత పోలింగ్‌లో వీఐపీ నియోజకవర్గాలైన రాయ్‌పుర్‌, దుర్గ్‌, కోర్బా వంటివి ఉన్నాయి.
  • ఛత్తీస్‌గఢ్‌లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌, భాజపాల మధ్యే నేరుగా పోరాటం సాగుతోంది. ఒక్క కోర్బాలోనే గోండ్వానా గోమంతక్‌ పార్టీ అభ్యర్థి గట్టి పోటీ ఇస్తున్నారు.
  •  2004, 2009, 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 11 సీట్లలో 10 స్థానాలను భాజపా గెలుచుకుంది. మూడు సార్లు ఒక సీటుకే కాంగ్రెస్‌ పరిమితమైంది.
  •  2019లో భాజపా 9 చోట్ల గెలిచింది. కాంగ్రెస్‌ 2 స్థానాల్లో విజయం సాధించింది.
  • అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే జాంజ్‌గీర్‌, బిలాస్‌పుర్‌, కోర్బా, రాయ్‌గఢ్‌ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్‌ బలంగా ఉంది.

కమలదళ ‘రాజధాని’

రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన నియోజకవర్గం రాయ్‌పుర్‌. గతంలో ఇక్కడ కాంగ్రెస్‌ హవా కొనసాగేది. 1989 నుంచి భాజపా గెలుస్తూ వస్తోంది. మధ్యలో 1991లో ఒకసారి కాంగ్రెస్‌ గెలిచింది. ఈ సారి ఛత్తీస్‌గఢ్‌ చాణక్యుడిగా పేరుగాంచిన సీనియర్‌ నేత, 35ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బ్రిజ్‌మోహన్‌ అగర్వాల్‌ను భాజపా నిలిపింది. ఆయనపై యువ సంచలనం వికాస్‌ ఉపాధ్యాయ్‌ను కాంగ్రెస్‌ బరిలోకి దింపింది. 2018 ఎన్నికల్లో వికాస్‌.. భాజపా సీనియర్‌ నేతను ఓడించారు. ఖనిజాలకు ఆలవాలమైన రాయ్‌పుర్‌ ఒకప్పుడు కుగ్రామం. క్రమంగా రాజధానిగా ఎదిగింది. రాయ్‌పుర్‌లో స్టీల్‌ పరిశ్రమ కార్మికులు అధికంగా ఉంటారు. ఇక్కడ 200 స్టీల్‌ రోలింగ్‌, 195 స్పాంజ్‌ ఐరన్‌, 6 స్టీల్‌ ప్లాంట్లు ఉన్నాయి.

ఇక్కడ 3,63,000 మంది ఎస్సీలు, 1.28 లక్షల మంది ఎస్టీలు ఉన్నారు. గ్రామీణ ఓటర్లు 9.81 లక్షల మంది ఉన్నారు. పట్టణ ఓటర్లు 11.29 లక్షల మంది ఉన్నారు. పట్టణ ప్రాంత ఓటర్లే విజేతను నిర్ణయిస్తారు.


అటోసారి.. ఇటోసారి

దుర్గ్‌ లోక్‌సభ సీట్లో విచిత్ర పరిస్థితి నెలకొంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయాలు సాధించినా లోక్‌సభ ఎన్నికలకు వచ్చేసరికి చతికిలపడుతోంది. మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘెల్‌ సొంత జిల్లా అయిన దుర్గ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 9 సీట్లకుగానూ కాంగ్రెస్‌ 8 గెలుచుకుంది. భాజపాకు ఒక్క సీటే దక్కింది. జాతీయ రాజకీయాలకు వచ్చేసరికి మోదీ ప్రభావం కనిపిస్తోంది. ఈసారీ కాంగ్రెస్‌కు విజయం అంత సులువుగా లేదు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నా గెలవలేదు. ఈసారి దుర్గ్‌లో భాజపా తరఫున సిటింగ్‌ ఎంపీ విజయ్‌ బఘెల్‌, కాంగ్రెస్‌ తరఫున రాజేంద్ర సాహు పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 20,72,643 మంది ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో భాజపాకు 61 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 32 శాతం ఓట్లే దక్కాయి. గత ఎంపీ చిన్న చిన్న పనులు మాత్రమే చేయగలిగారు.


పోటాపోటీగా జాంజ్‌గీర్‌

ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన జాంజ్‌గీర్‌లో ఈసారి పోటీ గట్టిగానే ఉంది. గత ఎన్నికల్లో భాజపా 80,000కుపైగా ఓట్లతో గెలిచింది. ఈసారి భాజపా నుంచి కమలేశ్‌ జాంగడే, కాంగ్రెస్‌ నుంచి శివ్‌ కుమార్‌ డహ్రియా తలపడుతున్నారు. ఇక్కడ 20,44,411 ఓట్లున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రాహుల్‌ జోడో యాత్ర జాంజ్‌గీర్‌ నుంచే ప్రారంభమైంది. దీంతో ఈ సీటుపై కాంగ్రెస్‌ ప్రత్యేక దృష్టి సారించింది. దళితులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.


గిరిజన ప్రాబల్య సర్గుజా

గిరిజనులు అధికంగా ఉన్న సర్గుజా భాజపాకు సంద్రాయంగా అండగా నిలుస్తోంది. ఇది ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. ఈసారి ఇక్కడి నుంచి భాజపా తరఫున చింతామణి మహారాజ్‌, కాంగ్రెస్‌ తరఫున శశి సింగ్‌ బరిలో నిలిచారు. చింతామణి రంగంలోకి దిగడంతో కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఆయన 2023లో కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరారు. శశి సింగ్‌ యువ నాయకురాలు. క్షేత్ర స్థాయి నుంచి పని చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ 18,12,901 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ప్రతిసారీ భాజపా, కాంగ్రెస్‌ నువ్వా నేనా అన్నట్లు తలపడతాయి.

చివరకు భాజపాను విజయం వరిస్తుంది. ఈ సారి గతానికి భిన్నంగా గట్టి పోటీ ఉంది. ఇక్కడ భాజపా కన్వర్‌ వర్గానికి టికెట్‌ ఇస్తుంటుంది. గత ఎన్నికల్లో గోండ్‌ వర్గానికి చెందిన రేణుకా సింగ్‌కు టికెట్‌ ఇచ్చింది. అయినా భాజపా గెలిచింది. ఇక్కడ గోండ్‌ వర్గానికి చెందిన ప్రజలు అధికంగా ఉంటారు. ఈసారి కాంగ్రెస్‌ గోండ్‌ వర్గానికి చెందిన శశి సింగ్‌ను నిలిపింది.


భాజపాదే పైచేయి

రాష్ట్రంలో ముఖ్యమైన నియోజకవర్గమైన బిలాస్‌పుర్‌లో భాజపాదే పైచేయి. ఈసారి భాజపా నుంచి తోఖన్‌ సాహు, కాంగ్రెస్‌ నుంచి దేవేంద్ర యాదవ్‌ తలపడుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన భాజపా నేత అరుణ్‌ సావో ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేవేంద్ర యాదవ్‌ దేశంలోనే అతి పిన్న వయసులో (25ఏళ్లకే) మేయరుగా ఎన్నికయ్యారు. బిలాస్‌పుర్‌లో 18,11,606 మంది ఓటర్లున్నారు. అరుణ్‌ సావో ఎంపీగా తానిచ్చిన హామీలను అమలు చేశారు. నియోజకవర్గాన్ని తరచూ సందర్శించేవారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేవు. ఉన్నత పాఠశాలల కోసం కొన్ని గ్రామాలు విద్యార్థులు కిలోమీటర్ల కొద్దీ వెళ్లాల్సి వస్తోంది.


పోటాపోటీ

ఛత్తీస్‌గఢ్‌లోని కీలక నియోజకవర్గాల్లో రాయ్‌గఢ్‌ ఒకటి. ఇది ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గం. గత ఏడు లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి నుంచి భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి రాధేశ్యాం రాఠియా, కాంగ్రెస్‌ నుంచి మనేకా దేవీ సింగ్‌ పోటీ చేస్తున్నారు. మనేకా రాజ కుటుంబం నుంచి వచ్చారు. దీంతో ఈ సారి గట్టి పోటీ నెలకొంది. ఇక్కడ 18,29,038 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం రెండు పార్టీలు సమాన బలంతో ఉన్నాయి.


కాంగ్రెస్‌ కోట కోర్బా

కాంగ్రెస్‌కు పట్టున్న నియోజకవర్గం కోర్బా. డీలిమిటేషన్‌ తర్వాత ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2014 మినహా అన్నిసార్లు కాంగ్రెస్‌ గెలుస్తూ వస్తోంది. ఈసారి భాజపా నుంచి సరోజ్‌ పాండే, కాంగ్రెస్‌ నుంచి జ్యోత్స్న మహంత్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ 13,40,544 ఓట్లు ఉన్నాయి.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img