icon icon icon
icon icon icon

పాత తీర్పా? మార్పా?

విభిన్న తెగల ప్రజలు.. మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం.. మైదాన, అటవీ ప్రాంతాల మేళవింపుతో భౌగోళికంగానూ ప్రత్యేకత ఉన్న లోక్‌సభ నియోజకవర్గం ఆదిలాబాద్‌.

Updated : 01 May 2024 06:00 IST

అభివృద్ధి మంత్రం.. చేరికల బలంపై కాంగ్రెస్‌ ఆశలు
అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లే బలంగా భారాస పోరు
నాలుగు అసెంబ్లీ సీట్లతో కమలం క్యాడర్‌లో ఉత్సాహం
 ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ‘ఈనాడు ప్రతినిధి’

విభిన్న తెగల ప్రజలు.. మహారాష్ట్ర సరిహద్దు కారణంగా మిశ్రమ సంస్కృతి, సంప్రదాయాల ప్రభావం.. మైదాన, అటవీ ప్రాంతాల మేళవింపుతో భౌగోళికంగానూ ప్రత్యేకత ఉన్న లోక్‌సభ నియోజకవర్గం ఆదిలాబాద్‌. ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గమైన ఈ స్థానంలో మే 13వ తేదీన జరగనున్న ఎంపీ ఎన్నికల్లో  16.44 లక్షల మంది ఓటర్ల మనసు గెలుచుకునేందుకు కాంగ్రెస్‌, భారాస, భాజపా ప్రచార పోరాటం చేస్తున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, భారాస నుంచి ఆత్రం సక్కు, భాజపా తరఫున గోడం నగేష్‌ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురూ గోండు తెగకు చెందినవారే. ఇక్కడ కాంగ్రెస్‌, భారాస, భాజపాల మధ్య కీలక పోరు నెలకొంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతో సరిపుచ్చుకుని అతి తక్కువ ఓట్లు పొందిన కాంగ్రెస్‌.. ఎంపీ సీటును దక్కించుకునేందుకు పోరాడుతోంది. భారాసకు రెండు శాసనసభ సెగ్మెంట్లలో మాత్రమే విజయం దక్కింది. కానీ లోక్‌సభ పరిధిలో ఇతర పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు సాధించామన్న గణాంక బలంతో తన అభ్యర్థే ఎంపీ కావాలన్న లక్ష్యంతో గులాబీ పార్టీ పావులు కదుపుతోంది. భాజపాకు ఇది సిటింగ్‌ స్థానం కావడం, మొన్నటి ఎన్నికల్లో నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు గెలుచుకున్న ఉత్సాహంతో భాజపా ఈ సీటును మళ్లీ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది.  మరి ఓటర్లు మరోసారి పాత తీర్పే ఇస్తారా? మార్పు కోరుతున్నారా?


పోటాపోటీ

  •  ఈ స్థానంలో గతంలో ఎన్నడూ పోటీ ఇవ్వలేకపోయిన భాజపా.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా విజయపతాకం ఎగురవేసింది. అంతకు కొన్ని నెలల ముందు.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని 10 శాసనసభ స్థానాల్లో తొమ్మిదింట భారాస పాగా వేసినా.. కొన్ని నెలలకే ఓటర్లను ఆకట్టుకుని భాజపా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలోని నాలుగు సెగ్మెంట్లలో విజయం సాధించింది.
  •  2019 లోక్‌సభ ఎన్నికల్లో విజేత అయిన భాజపా అభ్యర్థి సోయం బాపురావు కంటే.. భారాస అభ్యర్థికి 58 వేల ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థికి 63 వేల ఓట్లు తక్కువగా వచ్చాయి.

అధికార బలంతో కాంగ్రెస్‌ గురి

ఆదివాసీ గోండు గిరిజనుల హక్కుల కోసం పోరాటం చేసిన నేపథ్యం ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఆయా వర్గాల నుంచి ఆదరణ లభిస్తోంది. ప్రచారంలో సుగుణ తరఫున మంత్రి సీతక్క పాల్గొని ఆదివాసీ గిరిజనులను, మహిళలను ఆకర్షిస్తున్నారు. పలు ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు కూడా కాంగ్రెస్‌ తరఫున స్వచ్ఛందంగా ప్రచారం నిర్వహిస్తుండటం కనిపించింది. 2018, 2023 శాసనసభ ఎన్నికల్లో ఈ లోక్‌సభ స్థానం పరిధిలో కాంగ్రెస్‌కు ఒక్కొక్క నియోజకవర్గం మాత్రమే దక్కింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ప్రత్యర్థి పార్టీల నాయకులు చేరుతుండటం కలిసి వస్తుందని కాంగ్రెస్‌ నాయకులు చెబుతున్నారు. మిగిలిన వారి కన్నా తమ అభ్యర్థికి ప్రజాదరణ అధికంగా ఉన్నందున విజయం సాధిస్తామని కాంగ్రెస్‌ శ్రేణులు విశ్వసిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ముథోల్‌, సిర్పూర్‌ల నుంచి భారాస తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన మాజీ ఎమ్మెల్యేలు గడ్డిగారి విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప కాంగ్రెస్‌లో చేరారు. నిర్మల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌, ఆదిలాబాద్‌ మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌తోపాటు లోక్‌సభ నియోజకవర్గంలోని పలువురు కౌన్సిలర్లు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు కాంగ్రెస్‌లో చేరడంతో బలం పెరిగిందని నాయకులు అభిప్రాయపడుతున్నారు.  


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే ప్రచారాస్త్రాలు

భారాస మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఓట్ల పరంగా భాజపా, కాంగ్రెస్‌ల కన్నా ముందుంది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో మొత్తం 4.64 లక్షల ఓట్లు గులాబీ పార్టీ ఖాతాలో పడ్డాయి. 2018లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున గెలిచి భారాసలో చేరిన ఆత్రం సక్కు.. ఇప్పుడు లోక్‌సభకు పోటీపడుతున్నారు. నాటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో ఆసిఫాబాద్‌ మినహా ఆరు చోట్ల గులాబీకి విజయం దక్కింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అనూహ్యంగా విజయం సాధించి భారాస ఆశలకు గండి కొట్టింది. భారాస రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌, బోథ్‌ సెగ్మెంట్లలో మాత్రమే విజయం సాధించింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో విఫలమైందని భారాస విమర్శిస్తోంది. భారాస పాలనలో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని ఠంచనుగా అందించామని.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అలా ఇవ్వడంలో విఫలమైందని ఓటర్లలో ప్రచారం చేస్తోంది. మరోవైపు పార్టీ నుంచి వివిధ స్థాయుల నాయకులు ప్రత్యర్థి పార్టీల్లో చేరుతుండటం కొంత ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ ఉద్యమం నుంచి ఉన్నవారే నిజమైన నాయకులంటూ శ్రేణులు మండలాల్లో ప్రచారం చేస్తున్నాయి.


సంప్రదాయ ఓట్లపై భాజపా నిశిత దృష్టి

సిటింగ్‌ స్థానంలో రెండోసారి విజయకేతనం ఎగురవేసే లక్ష్యంతో భాజపా క్షేత్రస్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆదిలాబాద్‌, ముథోల్‌, నిర్మల్‌, బోథ్‌ శాసనసభ నియోజకవర్గాల్లో భారాస, కాంగ్రెస్‌ల కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన భాజపా ఆ ఊపుతోనే మొన్నటి శానసభ ఎన్నికల్లో బోథ్‌ మినహా మిగిలిన మూడుచోట్ల గెలుపొందింది. సిర్పూర్‌లో మొదటిసారి విజయం సాధించి.. మొత్తం నాలుగు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. యువత ఎక్కువగా భాజపాపై ఆదరణ చూపుతుండటం కనిపించింది. మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న మండలాల్లో అయోధ్య రామ మందిర నిర్మాణం, మోదీ నాయకత్వ ప్రాధాన్యం వంటి అంశాలను ప్రచారం చేస్తున్నారు. బోథ్‌, ముథోల్‌, నిర్మల్‌లో మైనార్టీయేతర ఓటర్లను ఒక్కటి చేయడమే లక్ష్యంగా కార్యాచరణ చేపట్టినట్లు స్థానిక నాయకులు తెలిపారు. ఆసిఫాబాద్‌లో స్థానికంగా పట్టున్న పలువురు నాయకులు ప్రత్యర్థి పార్టీల నుంచి భాజపాలో చేరడం బలాన్ని పెంచిందని భాజపా శ్రేణులు చెబుతున్నాయి. మోదీయే తమ ఎజెండా అని, అవినీతికి పాల్పడిన భారాస, కుటుంబ ఆధిపత్య రాజకీయాలు చేసే కాంగ్రెస్‌లను నమ్మొద్దంటూ ప్రత్యర్థులపై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు.

 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. సిర్పూర్‌లో భారాస అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన కోనేరు కోనప్ప.. కాంగ్రెస్‌లో చేరారు. మూడో స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భారాసలో చేరారు. వీరిద్దరూ సాధించిన ఓట్లు లక్షకు పైగా ఉన్నాయి. ఇవి ఎటువైపు మళ్లుతాయన్నది కీలకం.


ఓటరు నాడి
ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలు..

కాంగ్రెస్‌ ప్రధానంగా ఆదివాసీలు, ముస్లిం మైనార్టీలపై దృష్టి సారించింది. ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఆదిలాబాద్‌ శాసనసభ నియోజకవర్గాల్లో ఆదివాసీ గోండ్ల జనాభా అధికం. ఆదివాసీ హక్కులపై సుగుణ కుటుంబం సుదీర్ఘకాలం నుంచి పోరాటం చేస్తున్నారన్న సానుభూతి వారిలో కనిపించింది. ‘మా తరఫున నిలబడే వ్యక్తి కోసం ఇన్నాళ్లూ ఎదురు చూశాం. ఇప్పుడు సుగుణమ్మ వచ్చింది’ అంటూ గోండు వర్గాలకు చెందిన ఓటర్లు అభిప్రాయపడుతున్నారు. గతంలో తమ కోసం పోరాటం చేస్తామని చెప్పిన నాయకులు గెలిచాక పట్టించుకోలేదని ఇంద్రవెల్లి మండలం ముత్నూరు, ఉట్నూరు ప్రాంతాలకు చెందిన పలువురు గిరిజనులు తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల్లో వేరే పార్టీకి ఓటు వేసినా.. ఈసారి లౌకిక పార్టీ రావాల్సిన అవసరం ఉండటంతో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని భైంసా, ఆసిఫాబాద్‌, ఆదిలాబాద్‌ (మావల), నిర్మల్‌ ప్రాంతాల్లోని కొందరు ముస్లిం యువత పేర్కొన్నారు.

మోదీ ఆకర్షణ..

మోదీపై వివిధ వర్గాల ప్రజలు.. ముఖ్యంగా యువతలో ఉన్న అభిమానం తమకు కలిసివస్తుందని భాజపా ఆశిస్తోంది. దేశ రక్షణను దృష్టిలో పెట్టుకుని తాము భాజపాకే ఓటేస్తామని.. భైంసా, కుబీర్‌, ముథోల్‌, దిలావర్‌పూర్‌ మండలాల్లో కొందరు ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే ధోరణి బోథ్‌లోనూ వ్యక్తమైంది. చిన్న, మధ్యతరహా వ్యాపారులు ఎక్కువ శాతం భాజపాకు మద్దతు పలుకుతున్నారు. సిర్పూర్‌ నియోజకవర్గానికి బెంగాల్‌ నుంచి వలస వచ్చి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న నాలుగు క్యాంపుల్లో ఒకటైన కాగజ్‌నగర్‌ మండలంలోని ఈస్‌గాంలో 16 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ప్రాంతంలో భాజపా హవా ఎక్కువని స్థానిక యువకులు తెలిపారు. సరిహద్దు గ్రామాల్లోని మహారాష్ట్రీయులు, బంజారాల్లో కొన్ని వర్గాలు, వర్తకసంఘాలు భాజపాకు అండగా ఉన్నాయి. గత ఎన్నికల్లో భారాస నుంచి పోటీ చేసి ఓటమిపాలైన నగేష్‌ ఈసారి భాజపా అభ్యర్థిగా బరిలో నిలవడంతో.. పార్టీ ఓటుబ్యాంకుకు తోడు నగేష్‌కు ఉన్న సొంత బలమూ లాభిస్తుందని భాజపా అంచనా.

గత ప్రభుత్వ పథకాలు..

కేసీఆర్‌ హయాంలో అమలు చేసిన పథకాలను భారాస తన ప్రచారంలో గుర్తుచేస్తోంది. వాటిని, ఇప్పటి ప్రభుత్వ పథకాల అమలు తీరును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలంటూ గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా, రుణమాఫీ తదితర హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చకపోవడం తమను నిరాశకు గురిచేస్తోందంటూ ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, ఉట్నూరు, ఇంద్రవెల్లిలలో పలువురు ఓటర్లు చెప్పారు. ‘కేసీఆర్‌ హయాంలో రైతుబంధు బాగానే అందింది. ఇప్పుడు రావడం లేద’ని ఇంద్రవెల్లి మండలంలో కొందరు గిరిజనులు తెలిపారు. ‘పోయిన ఎన్నికల్లో భారాసకు ఓటు వేశాం. ఇప్పుడు జాతీయ స్థాయి పార్టీకి వేయాలని అనుకుంటున్నాం. కానీ కేసీఆర్‌ ఇటీవల చేస్తున్న ప్రచారం చూస్తుంటే పునరాలోచన కలుగుతోంది’ అంటూ ఆదిలాబాద్‌, సిర్పూర్‌ ప్రాంతాల్లో పలువురు తెలిపారు. కాంగ్రెస్‌, భాజపాల వ్యతిరేక ఓటు భారాసకు తప్పకుండా కలిసి వస్తుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img