icon icon icon
icon icon icon

మెతుకు సీమలో మెరిసేదెవరో..?

మంజీర నీటితో రాజధాని గొంతులో అమృతాన్ని నింపిన సింగూరు డ్యాం.. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్‌చెరు.. ప్రఖ్యాత చర్చి.. ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలుస్తూ.. ‘మెతుకు సీమ’గా పేరొందిన మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.

Published : 04 May 2024 06:20 IST

సంక్షేమ పథకాలే ఓట్లు రాబడతాయంటున్న కాంగ్రెస్‌
ఉద్యమాల పురిటిగడ్డ గెలిపిస్తుందంటున్న భారాస
మోదీ ఆకర్షణ మంత్రం గట్టెక్కిస్తుందన్న ధీమాతో భాజపా
మెదక్‌ లోక్‌సభ బరిలో ప్రధాన పార్టీల హోరాహోరీ
మెదక్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

మంజీర నీటితో రాజధాని గొంతులో అమృతాన్ని నింపిన సింగూరు డ్యాం.. అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం పటాన్‌చెరు.. ప్రఖ్యాత చర్చి.. ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.. ఇలా ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిలుస్తూ.. ‘మెతుకు సీమ’గా పేరొందిన మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గంలో ఈ సారి ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో సికింద్రాబాద్‌ తర్వాత అత్యధికంగా 44 మంది అభ్యర్థులు ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. అయితే, ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్‌, భాజపా, భారాస అభ్యర్థుల మధ్యే నెలకొంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్‌.. భాజపా తరఫున రఘునందన్‌రావు.. భారాస నుంచి ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

రాష్ట్రంలో ఇటీవలే అధికారాన్ని దక్కించుకోవడంతోపాటు సంక్షేమ పథకాలపై ధీమాతో కాంగ్రెస్‌.. మోదీ ఆకర్షణ మంత్రంపై నమ్మకంతో భాజపా.. ఈ ప్రాంతంలో అప్రతిహతంగా పట్టు నిలుపుకొంటుండటంతోపాటు ఉద్యమాల పురిటిగడ్డ తమకు అండగా నిలుస్తుందన్న విశ్వాసంతో భారాస.. విజయం కోసం పోటీ పడుతున్నాయి. లోక్‌సభ స్థానం పరిధిలో కాంగ్రెస్‌కు ఒకే ఎమ్మెల్యే ఉండగా.. భాజపాకు ఒక్కరూ లేరు. అయితే, అసెంబ్లీ ఎన్నికలకూ.. ఇప్పటికీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందని.. గ్యారంటీలు అమలు చేస్తున్నామంటూ కాంగ్రెస్‌.. మోదీ కరిష్మాపై నమ్మకంతో భాజపా ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రాష్ట్రంలో అధికారంలో లేకపోయినా ఆరుగురు ఎమ్మెల్యేలు ఈ స్థానం నుంచే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో భారాస శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రచారాస్త్రాలుగా చేసుకొని ముందుకు సాగుతున్నాయి.


కాంగ్రెస్‌.. బీసీ మంత్రం

కాంగ్రెస్‌ అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్‌ బరిలోకి దిగారు. పటాన్‌చెరు మండలం చిట్కుల్‌లో వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన సర్పంచిగా పనిచేశారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడటంతో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసి సుమారు 40 వేల ఓట్లు సాధించారు. అనంతరం తిరిగి కాంగ్రెస్‌లో చేరి లోక్‌సభ బరిలో నిలిచారు. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులిద్దరూ అగ్రవర్ణాలకు చెందినవారని.. తమ అభ్యర్థి బీసీ అని.. ఈ అంశం తమకు కలిసి వస్తుందనే ధీమాతో పార్టీ వర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో అధికారం అండగా సంక్షేమ పథకాలు బాసటగా ఈ సారి విజయంపై కాంగ్రెస్‌ కన్నేసింది. నర్సాపూర్‌ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీసీబీ ఛైర్మన్‌ దేవేందర్‌రెడ్డితోపాటు పలువురు భారాస ద్వితీయశ్రేణి నేతలు కాంగ్రెస్‌లో చేరడం బలాన్ని పెంచే అంశమని భావిస్తోంది. లోక్‌సభ స్థానం పరిధిలో మధు సొంత నియోజకవర్గమైన పటాన్‌చెరులో ఏకంగా 4 లక్షలపైచిలుకు ఓట్లున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఒక్క మెదక్‌లోనే కాంగ్రెస్‌ గెలిచింది. సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, సిద్దిపేట నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో.. గజ్వేల్‌, దుబ్బాకల్లో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ‘అధికారం చేపట్టి అయిదు నెలలైనా కాలేదు. అప్పుడే హామీల అమలు గురించి నిలదీయడం సరికాదు. ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామంటున్నారు. అందుకే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం..’ అని మెదక్‌ జిల్లా హవేళి ఘనపురం మండలం ఔరంగాబాద్‌ తండాకు చెందిన రైతులు వెల్లడించారు.


భారాస.. వరుస విజయాలపై భరోసా

రాష్ట్రంలో భారాసకు గట్టి పట్టున్న లోక్‌సభ నియోజకవర్గం మెదక్‌. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచీ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రాంతమిది. 2004 నుంచి ఆ పార్టీ ఇక్కడ వరుసగా ఐదుసార్లు గెలిచి సత్తా చాటింది. పార్టీ అభ్యర్థిగా విశ్రాంత కలెక్టర్‌, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని బరిలో దింపి విజయం కోసం గట్టిగా కృషిచేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సిద్దిపేట కలెక్టర్‌గా ఆయన సుదీర్ఘ కాలం పనిచేశారు. లోక్‌సభ స్థానం పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు భారాసకు చెందినవారే కావడంతోపాటు కేసీఆర్‌, హరీశ్‌రావు స్థానబలం పార్టీకి కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. కానీ, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన అనంతరం భారాస నుంచి ద్వితీయ శ్రేణి నాయకులు వలస వెళ్తున్నారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ అంశంలో కొంతమేర నిరసన ఎదుర్కోవలసి రావడం ప్రతికూల అంశంగా భావిస్తున్నారు. అయితే, రూ.100 కోట్లతో ట్రస్ట్‌ ఏర్పాటు చేసి సేవాకార్యక్రమాలు చేస్తానని వెంకట్రామిరెడ్డి చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కావడంతో తప్పక విజయం సాధిస్తామని ఆ పార్టీశ్రేణులు ధీమాతో ఉన్నారు. ‘హరీశ్‌రావు సిద్దిపేటను బాగా అభివృద్ధి చేశారు. ఎప్పుడైనా మాకు అందుబాటులో ఉంటారు. ఏ అవసరంపై వెళ్లినా వీలైనంత సాయం చేస్తారు. ఎంపీ అభ్యర్థి ఎవరనేది ముఖ్యం కాదు. మేం భారాసకే ఓటేస్తాం..’ అని సిద్దిపేటలో బ్యాటరీల వ్యాపారం నిర్వహించే వ్యక్తి స్పష్టంచేశారు.


భాజపా.. ఎలాగైనా పాగా వేస్తామన్న ధీమా

భాజపా అభ్యర్థిగా రఘునందన్‌రావు బరిలో ఉన్నారు. 2019 ఎంపీ ఎన్నికల్లోనూ ఈయన ఈ పార్టీ తరఫున పోటీ చేసి 2 లక్షలపైచిలుకు ఓట్లు సాధించారు. ఇదే లోక్‌సభ స్థానంలోని దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. 2020 నవంబరులో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో గెలిచిన ఆయన 2023 ఎన్నికల్లో మాత్రం రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. తాజా లోక్‌సభ పోరులో మోదీ ఆకర్షణమంత్రంతోపాటు కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమా తమకు కలిసివస్తుందని భాజపా శ్రేణులు భావిస్తున్నాయి. ప్రధానిగా మోదీ ఉండాలనే ఆకాంక్షతో ఓటర్లు భాజపాకు పట్టం కడతారని గట్టి నమ్మకంతో నేతలు ఉన్నారు. ఈ లోక్‌సభ స్థానంలో 1999లో ఒక్కసారే భాజపా గెలుపొందింది. అప్పుడు ఆలె నరేంద్ర విజయం సాధించారు. పాతికేళ్ల తర్వాత ఈ సారి సానుకూల వాతావరణం ఉందని.. ఎలాగైనా పాగా వేస్తామని పేర్కొంటున్న భాజపా శ్రేణులు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. మోదీ కరిష్మాను నమ్ముకుని ఆ పార్టీ ప్రచారం సాగిస్తోంది. గతంతో పోల్చితే ఈ సారి ఏడు సెగ్మెంట్లలోనూ తొలి రెండు స్థానాల్లోనే తాముంటామని ధీమా వ్యక్తం చేస్తోంది. ‘లోక్‌సభ ఎన్నికలు కావడంతో భాజపాకు ఓటేయాలనుకుంటున్నాం. మోదీ వచ్చాకే దేశ ప్రతిష్ఠ పెరిగింది. దేశ ప్రధానిగా ఆయన ఉండటం అవసరం..’ అని సంగారెడ్డికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఒకరు పేర్కొన్నారు.


ప్రధాన పార్టీలకు సమస్యల సవాళ్లు

మెదక్‌ నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలు రాజకీయ పార్టీలకు సవాళ్లు విసురుతున్నాయి. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం పరిధిలోని రైల్వేలైన్లకు సంబంధించిన పనులపై డిమాండ్లు వినిపిస్తున్నాయి.

  • మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ మీదుగా సిద్దిపేట వరకు నిర్మించిన కొత్తపల్లి - మనోహరాబాద్‌ రైల్వే ప్రాజెక్టులో రైళ్లు ప్రస్తుతం డీజిల్‌ ఇంజిన్‌తో మాత్రమే నడుస్తున్నాయి. దీన్ని విద్యుత్‌ లైన్‌గా మార్చి రెండు వరుసలకు విస్తరించాలన్న డిమాండ్‌ ఉంది.  
  • చేగుంట - మెదక్‌ రైల్వే మార్గంలో చేగుంట సమీపంలో 228 రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఉపరితల వంతెన నిర్మాణం చేపట్టడం. గజ్వేల్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వంతెన నిర్మించడం. చేగుంట మండలం వడియారం రైల్వేస్టేషన్లో రిజర్వేషన్‌ కౌంటర్‌ మంజూరు చేయడంతోపాటు అక్కడ రాయలసీమ, దేవగిరి, కృష్ణ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిలపాలన్న డిమాండ్లు ఉన్నాయి.  
  • మెదక్‌ రైల్వేస్టేషన్‌ను జంక్షన్‌గా చేసి జోగిపేట, సంగారెడ్డి, మీదుగా పటాన్‌చెరు సమీపంలోని వట్టినాగులపల్లి వరకు రైల్వేలైన్‌ నిర్మించడం. అక్కన్నపేటలో అజంతా ఎక్స్‌ప్రెస్‌ను నిలపడం.
  • మెదక్‌ జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయడం. మెదక్‌ నుంచి పాపన్నపేట, బొడ్మట్‌పల్లి, వట్‌పల్లి మీదుగా బీదర్‌ వరకు జాతీయరహదారి నిర్మించడం.
  •  సంగారెడ్డి - నర్సాపూర్‌ - తూప్రాన్‌ రోడ్డును రహదారుల ప్రాధికార సంస్థ పరిధిలో చేర్చినా విస్తరణను విస్మరించారు. మూడు జిల్లాలను కలిపే ఈ ప్రధాన రహదారిని విస్తరించాలన్న డిమాండ్‌ ఉంది.

ఇందిరాగాంధీ సహా హేమాహేమీల బరి

1952 నుంచి ఇప్పటివరకు 18 సార్లు జరిగిన మెదక్‌ లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా కాంగ్రెస్‌ 8 సార్లు  గెలుపొందింది. ఐదుసార్లు భారాస(2014 ఉపఎన్నికతో కలిపి) విజయం సాధించింది. కాంగ్రెస్‌ చివరిసారిగా 1998లో ఇక్కడ విజయం సాధించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1980లో మెదక్‌ ఎంపీగా పోటీ చేసి జనతాదళ్‌ అభ్యర్థి జైపాల్‌రెడ్డిపై 2 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. అదే సమయంలో ఆమె రాయ్‌బరేలీ నుంచీ గెలిచినా అక్కడ రాజీనామా చేసి మెదక్‌ ఎంపీగానే కొనసాగారు. ఇక్కడ ఎంపీగా ఉన్న సమయంలోనే ఆమె హత్యకు గురయ్యారు. కేసీఆర్‌, మల్లికార్జున్‌, బాగారెడ్డి, ఆలె నరేంద్ర.. వంటి ప్రముఖులు సైతం ఇక్కడ ఎంపీగా పనిచేశారు. ఎక్కువసార్లు గెలిచిన ఎంపీగా బాగారెడ్డి రికార్డులకెక్కారు. 1989-1999 కాలంలో ఆయన నాలుగుసార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.

మినీ ఇండియాలో కార్మికుల ఓట్లపై గురి

మెదక్‌ లోక్‌సభ స్థానంలో పటాన్‌చెరు అసెంబ్లీ నియోజకవర్గం ఓట్లే ఏకంగా 25 శాతం వరకు ఉంటాయి. పటాన్‌చెరులోని మొత్తం ఓట్లలో 40-45 శాతం వరకు కార్మికులవే. మినీఇండియాగా పిలిచే ఈ ప్రాంతంలోని కర్మాగారాల్లో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల ఓటర్లనూ ప్రసన్నం చేసుకునే దిశగా ప్రధాన పార్టీల నేతలు దృష్టి సారిస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చే కాంట్రాక్టర్లతో సంప్రదింపులు జరుపుతూ గంపగుత్తగా ఓట్లను రాబట్టుకోవడంలో నిమగ్నమవుతున్నారు.

మహిళా ఓటర్లే అధికం

మెదక్‌ లోక్‌సభ స్థానంలో మొత్తం 18,28,210 మంది ఓటర్లు ప్రస్తుతం ఓటుహక్కు కలిగిఉన్నారు. వీరిలో పురుషులకంటే  మహిళలే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లు గెలుపోటములను ప్రభావితం చేసే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img