icon icon icon
icon icon icon

నాగర్‌కర్నూల్‌లో ఎవరి ధీమా వారిదే

నాగర్‌కర్నూల్‌.. దక్షిణ తెలంగాణలో కీలకమైన లోక్‌సభ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. అతిపెద్ద నల్లమల అటవీ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోనిదే. సరిహద్దు నుంచి కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి.

Updated : 06 May 2024 06:37 IST

ప్రజల మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్‌ భరోసా
మోదీ కరిష్మా, యువత అండదండలపై భాజపా విశ్వాసం
కేంద్ర, రాష్ట్ర వైఫల్యాలపై భారాస నమ్మకం

నాగర్‌కర్నూల్‌.. దక్షిణ తెలంగాణలో కీలకమైన లోక్‌సభ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దులు ఉన్నాయి. అతిపెద్ద నల్లమల అటవీ ప్రాంతం ఈ నియోజకవర్గం పరిధిలోనిదే. సరిహద్దు నుంచి కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తున్నాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాన కేంద్రం ఇదే. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో సీఎం రేవంత్‌రెడ్డి పుట్టిన ఊరైన కొండారెడ్డిపల్లి ఉంది. ఇది అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్‌ పరిధిలోకి వస్తుంది.

నాగర్‌కర్నూల్‌ నుంచి ఈనాడు ప్రత్యేక ప్రతినిధి

ఈ ఎంపీ స్థానంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ నుంచి మల్లు రవి, భాజపా తరఫున భరత్‌ ప్రసాద్‌, భారాస పక్షాన ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ తలపడుతున్నారు. ముగ్గురూ గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవడం, ఈ స్థానం పరిధిలోని 5 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్‌లో ధీమా నెలకొంది. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. ప్రధానిగా నరేంద్రమోదీ కొనసాగాల్సిన ఆవశ్యకతను, గత ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి వైఫల్యాలను ఎత్తిచూపుతూ భాజపా ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్‌ విఫలమైందని, రైతు సమస్యలు అధికమయ్యాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపక్షంగా లేవని పేర్కొంటూ భారాస ప్రచారం చేస్తోంది.


కాంగ్రెస్‌...

కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవి.. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2019లో ఓడిపోయిన ఆయన ఈసారి మళ్లీ బరిలోకి దిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదింటిని  గెలుచుకోవడం, ఆరు గ్యారంటీలు, సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ భరోసా పెట్టుకుంది. మంచి మెజారిటీ వస్తుందని, తమ అభ్యర్థికే పట్టం కడతారని పార్టీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గతంలో రెండుసార్లు ఎంపీగా గెలవడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇతర పార్టీలకు చెందిన ద్వితీయ, కిందిస్థాయి నాయకులు పార్టీలో చేరుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున గ్రామాల్లో పనులు కావాలంటే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి పార్టీకి అత్యధిక మెజారిటీ తీసుకురావాలని నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌, వనపర్తి ఎమ్మెల్యేలు; అలంపూర్‌, గద్వాలలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ‘ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదని విపక్షాల వారు అంటున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలే అవుతోంది. సొంత ఇల్లు సర్దుకోవడానికే సమయం పడుతుంది. ఇప్పుడే అన్నీ పూర్తిచేయాలనడం సరికాదు’ అని అలంపూర్‌, గద్వాలకు చెందిన కొందరు రైతులు చెబుతున్నారు. ‘సీఎం రేవంత్‌ సొంతూరు మా లోక్‌సభ స్థానం పరిధిలోనే ఉంది.. ఇక్కడ ఏమైనా అభివృద్ధి పనులు జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవాలి’ అని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల్లో పలువురు పేర్కొన్నారు.


భారాస...

భారాస అభ్యర్థిగా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ బరిలో ఉన్నారు. తొలుత బహుజన్‌ సమాజ్‌ పార్టీలో చేరిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో సిర్పూర్‌ నుంచి పోటీ చేసి 19వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతరం భారత రాష్ట్ర సమితిలో  చేరి తొలిసారిగా నాగర్‌కర్నూల్‌  పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, వ్యతిరేక ఓటు భారాసకు అనుకూలంగా ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. రేవంత్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని, రైతులకు రుణమాఫీలో విఫలమైందని, రైతు సమస్యలు అధికమయ్యాయని పేర్కొంటూ ప్రచారం చేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అలంపూర్‌, గద్వాలలో భారాస విజయం సాధించిందని, కల్వకుర్తి మినహా మిగతా నాలుగు సెగ్మెంట్లలో భారాస రెండో స్థానంలో నిలిచిందని..ఆ ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో గెలుస్తామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ‘స్వేరోస్‌’ ప్రతినిధులు గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్లను సంఘటితం చేస్తున్నారు. ‘ప్రవీణ్‌కుమార్‌ చదువుకున్న వ్యక్తి... పెద్దగా డబ్బు లేదు.. మంచివారు.. మా పిల్లల చదువు కోసం కృషిచేశారు. అలాంటి వ్యక్తి గెలిస్తే, మా సమస్యల్ని లోక్‌సభలో ప్రస్తావిస్తారు’ అని నాగర్‌కర్నూల్‌ మండలానికి చెందిన పలువురు తెలిపారు. ‘మా పొలాలకు నీళ్లులేవు. ఈసారి పంట వేయలేదు. రైతుబంధు పూర్తిగా రాలేదు. ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదు’ అని అలంపూర్‌ సెగ్మెంట్‌లోని శాంతినగర్‌కు చెందిన కొందరు పేర్కొన్నారు.


భాజపా...

పోతుగంటి భరత్‌ప్రసాద్‌  తొలిసారి పోటీచేస్తున్నారు. తండ్రి రాములు ప్రస్తుతం సిటింగ్‌ ఎంపీగా ఉన్నారు. లోక్‌సభ స్థానంలోని అన్ని సెగ్మెంట్లలో మంచి పేరు, పట్టు ఉంది. ఇటీవల ఆయన భారాస నుంచి భాజపాలోకి మారారు. దీంతో ఆయన కుమారుణ్ని భాజపా ఎంపీ అభ్యర్థిగా నిలిపింది. భరత్‌ తండ్రి రాములు గత ఎన్నికల్లో దాదాపు 1.9లక్షల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లు రవిపై గెలుపొందారు. ఈ ఎన్నికల్లో భాజపా యువతపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పరంగా భాజపా ప్రభావం తక్కువే. ఇటీవల గ్రామస్థాయిలోనూ కేడర్‌ బలపడటం పార్టీ సానుకూల అంశంగా భావిస్తోంది. నియోజకవర్గ పరిధిలో మాదిగ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామంటూ ప్రధాని చేసిన ప్రకటన సానుకూలంగా మారిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దేశరక్షణకు గట్టి చర్యల కోసం కమలం గుర్తుకు ఓటు వేయాలని యువత ప్రచారం చేస్తోంది. పార్టీకి చెందిన కింది స్థాయి నాయకులు గ్రామాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ కోసం భాజపా ఏం చేసిందో వివరిస్తున్నారు. ‘కాంగ్రెసోళ్లను చూశాం... కేసీఆర్‌ను చూశాం... ఈసారి నరేంద్రమోదీని చూసి ఓటు వేస్తాం. ఆయన మంచిగా చేస్తున్నారు’ అని నాగర్‌కర్నూల్‌ పట్టణ యువకులు పలువురు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గంపగుత్తగా కాంగ్రెస్‌కు పడిన ఓట్లు ఇసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా భాజపాకు వస్తాయని పార్టీ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. యువత తమ కుటుంబాల్ని కూడా ప్రభావితం చేస్తే నియోజకవర్గంలో గెలుపు తథ్యమని భాజపా నేతలు భావిస్తున్నారు.


ఎక్కువ సార్లు కాంగ్రెస్‌ విజయం..

నాగర్‌కర్నూల్‌ ఎంపీ స్థానం కాంగ్రెస్‌పార్టీకి తొలి నుంచి కంచుకోటగా ఉంది. ఇప్పటివరకు జరిగిన 15 లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిదిసార్లు గెలిచింది. నాలుగుసార్లు తెదేపా, ఒకసారి తెలంగాణ ప్రజాసమితి గెలుపొందాయి. 2019 ఎన్నికల్లో భారాస విజయం సాధించింది.


ప్రచార రథాలే ఎక్కువ...

ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచార రథాలే గ్రామాల్లో ఎక్కువగా తిరుగుతున్నాయి. ఓటింగ్‌కు సమయం సమీపిస్తున్నప్పటికీ మండల కేంద్రాల్లో కూడా అభ్యర్థులు నేరుగా ప్రచారం నిర్వహించడంలేదు. కొన్నిచోట్ల ఎవరు పోటీచేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఉదయం పది దాటితేచాలు ప్రచార రథాలూ నీడన చేరుతున్నాయి. గ్రామాల్లో ఇంటి నుంచి ఎవరూ బయటకు రావడం లేదు. సాయంత్రం 6 తరువాతే గ్రామాల్లో కిందిస్థాయి నాయకులు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారు. ఏ పార్టీకి ఓటు వేస్తే ఎవరు కేంద్రంలో అధికారంలోకి వస్తారో వివరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img