icon icon icon
icon icon icon

పీవోకేను దేశం వదులుకోదు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను భారత్‌ ఎప్పటికీ వదులుకోబోదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం భాజపాకు లేదన్నారు.

Updated : 06 May 2024 06:36 IST

రాజ్యాంగాన్ని, పీఠికను మార్చబోం
రిజర్వేషన్లూ తొలగించం
పీటీఐ ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను భారత్‌ ఎప్పటికీ వదులుకోబోదని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పునరుద్ఘాటించారు. అలాగే భారత రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం భాజపాకు లేదన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్‌ అనేక దుష్ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన అనేక అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు..

జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు మెరుగు

పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. కశ్మీర్‌ అభివృద్ధిని చూసి అక్కడి ప్రజలే తమంతట తాముగా భారత్‌లో భాగం కావాలని కోరుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో పరిస్థితులు గణనీయంగా మెరుగయ్యాయి. త్వరలోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తాం.

కాంగ్రెస్‌ది అసత్య ప్రచారం

భాజపా ప్రభుత్వం ఎప్పటికీ రిజర్వేషన్లను తొలగించబోదు. రాజ్యాంగాన్ని కూడా మార్చబోదు. రాజ్యాంగ పీఠికను సైతం సవరించేది లేదు. ఓట్ల కోసం ఈ అంశాల్లో కాంగ్రెస్‌ అసత్యాలు ప్రచారం చేస్తోంది.

రాహుల్‌పై పాక్‌ ప్రశంస ఆందోళనకరం..

ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం రాహుల్‌ గాంధీకి లేదు. దీంతో హిందూ-ముస్లింల మధ్య విభజనకు కాంగ్రెస్‌ యత్నిస్తోంది. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోంది. మూడోసారి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం-ఒకే ఎన్నికల వంటి విధానాలను అమలు చేస్తాం. రాహుల్‌ గాంధీని పాక్‌ మాజీ మంత్రి ఫవాద్‌ హుస్సేన్‌ ప్రశంసించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం.

400 సీట్లు పక్కా..

ఈసారి ఎన్‌డీయే కూటమి కచ్చితంగా 400 సీట్లు గెలుచుకుంటుంది. భాజపా సొంతంగా 370 స్థానాల్లో విజయం సాధిస్తుంది..

నౌకాదళానిది అద్భుత ప్రదర్శన

అంతర్జాతీయ సముద్ర జలాల్లో పలు రవాణా నౌకలకు ఎదురవుతున్న సముద్ర దొంగల బెడద నివారణలో భారత నౌకాదళం అనేక విజయవంతమైన ఆపరేషన్లు అద్భుతంగా నిర్వహించింది. రూ.40 వేల కోట్ల విలువైన 45 వేల టన్నుల బరువైన విమాన వాహక రెండో యుద్ధనౌకను నేవీ సమకూర్చుకుంటోంది. భారత్‌-చైనాల మధ్య నెలకొన్న సైనిక ప్రతిష్ఠంభన నివారణకు ఆ దేశంతో కొనసాగుతున్న చర్చలు సుహృద్భావ వాతావరణంలో సానుకూలంగా సాగుతున్నాయి. సరిహద్దు సమస్య పరిష్కారంపై ఆశాభావంగా ఉన్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img