icon icon icon
icon icon icon

పునర్విభజనే ఫలితాల నిర్ణేత!

ఈశాన్య రాష్ట్రాల పెద్దన్న అస్సాంలోని 4 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Updated : 06 May 2024 06:33 IST

బంగ్లాదేశీ ముస్లింల ఓట్ల విభజనతో లబ్ధికి భాజపా యత్నం
7న అస్సాంలోని 4 నియోజకవర్గాల్లో పోలింగ్‌

ఈశాన్య రాష్ట్రాల పెద్దన్న అస్సాంలోని 4 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్‌ జరగనుంది. కోకరాఝార్‌, బర్పేటా, ధుబరీ, గువాహటిలలో జరగనున్న ఈ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనే (డీలిమిటేషన్‌) ఫలితాలను శాసించనుంది. పునర్విభజన తర్వాత జరగనున్న తొలి లోక్‌సభ ఎన్నికలు ఇవే కావడం గమనార్హం. ఈ విడతలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కోకరాఝార్‌లో 12 మంది, బర్పేటాలో 14 మంది, ధుబరీలో 13 మంది, గువాహటిలో 8 మంది బరిలో ఉన్నారు.

  • పునర్విభజనతోపాటు జాతీయ పౌర రిజిస్టరు (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), సంశయాత్మక ఓటర్లు (డి ఓటర్లు), నిర్బంధ శిబిరాలు, బెంగాలీల అంశాలు ఇక్కడ ప్రభావం చూపనున్నాయి.
  • నాలుగు చోట్లా ఎన్డీయే, ఇండియా కూటములు పోటీ చేస్తున్నాయి. గువాహటిలో రెండు పార్టీలూ మహిళలకు టికెట్లు ఇచ్చాయి.
  • బర్పేటా, ధుబరీలో భాజపా భాగస్వామి అస్సాం గణ పరిషత్‌ (ఏజీపీ) పోటీ చేస్తోంది.
  • యూపీపీఎల్‌ కోకరాఝార్‌లో బరిలోకి దిగింది.
  • ధుబరీ నుంచి ఆలిండియా యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) అధ్యక్షుడు బద్రుద్దీన్‌ అజ్మల్‌ పోటీ చేస్తున్నారు.
  • బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌, సీపీఎం కూడా మూడో విడతలో పోటీ చేస్తున్నాయి.


ధుబరీ

బంగ్లాదేశ్‌ వలస ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం ధుబరీ. ఇక్కడ ఏజీపీ పోటీ చేస్తోంది. ఏఐయూడీఎఫ్‌ అధినేత బద్రుద్దీన్‌ అజ్మల్‌ ఇక్కడ సిటింగ్‌ ఎంపీ. ఆయన మూడు దఫాలుగా ఇక్కడ గెలుస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ కూడా పోటీ చేస్తోంది. దీంతో ముక్కోణపు పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గంలో 26 లక్షల మంది ఓటర్లున్నారు. డీలిమిటేషన్‌ తర్వాతా ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది.

ఇక్కడ ప్రధాన పోటీ ఏఐయూడీఎఫ్‌, కాంగ్రెస్‌ మధ్య ఉండే అవకాశముంది.


చెల్లని సిటింగ్‌ ఎంపీ నామినేషన్‌

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో కోకరాఝార్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నబా సరానియా నామినేషన్‌ను చెల్లదని రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. ఆయన ఎస్టీ కాదని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ నిర్ణయం వెలువడింది. దీంతో మళ్లీ ఆయన కోర్టును ఆశ్రయించారు.


కోకరాఝార్‌

గత రెండు ఎన్నికల్లో ఎస్టీ నియోజకవర్గమైన కోకరాఝార్‌ నుంచి గెలిచిన నబా సరానియా అస్సాం రాజకీయాల్లో కీలక నేత. ఒకప్పుడు ఉల్ఫాలో కమాండర్‌గా ఉన్న ఆయన ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చి గెలిచి నిలిచారు. గణ సురక్ష పరిషత్‌ పేరుతో ఆయన పార్టీ స్థాపించారు. ఈ పార్టీ భాజపాతోగానీ, కాంగ్రెస్‌తోగానీ కలవలేదు. సరానియా ప్రస్తుతం తన ఎస్టీ హోదాపై కోర్టుల్లో పోరాడుతున్నారు.

ఇక్కడ భాజపాయేతర పార్టీలే బలంగా ఉన్నాయి.


గువాహటి

బంగ్లాదేశీ ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో గువాహటి కూడా ఒకటి. ఇక్కడ భాజపా, కాంగ్రెస్‌ మధ్య ద్విముఖ పోరు సాగుతోంది. డీలిమిటేషన్‌కు ముందు ఇది భాజపాకు అండగా నిలిచింది.


బర్పేటా

గతంలో బంగ్లాదేశీ వలస ముస్లింలు అధికంగా ఉన్న నియోజకవర్గం బర్పేటా. డీలిమిటేషన్‌తో ఇక్కడ హిందూ ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇక్కడ ఎన్డీయే నుంచి ఏజీపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌, సీపీఎం బరిలో ఉన్నాయి.

  • ముస్లింలు 70 శాతం నుంచి 80శాతందాకా ఉండే 3 అసెంబ్లీ నియోజకవర్గాలను బర్పేటా నుంచి తీసుకెళ్లి ధుబరీలో కలిపారు.
  • సహజంగా భాజపా-ఏజీపీలకు మద్దతుగా నిలిచే అస్సామీలు అధికంగా ఉండే రెండు నియోజకవర్గాలను తీసుకొచ్చి బర్పేటాలో విలీనం చేశారు.
  • ఈ మార్పులతోపాటు కాంగ్రెస్‌, ఏఐయూడీఎఫ్‌ల మధ్య ఓట్లు చీలి తమకు లాభం కలుగుతుందనేది భాజపా భావనగా ఉంది. అయితే భాజపాయేతర పార్టీలకే ఇది అనుకూలంగా ఉండే అవకాశముంది.

    భాజపాకు పరీక్షే

    తొలి, రెండో విడతల్లో తమకు అనుకూలంగానే పోలింగ్‌ జరిగిందని భావిస్తున్న భాజపా మూడో విడతలో గట్టి పరీక్షనే ఎదుర్కొంటోంది. బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన ముస్లింలు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గాలు ఏం చేస్తాయనే ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు కాంగ్రెస్‌ కంచుకోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాలు ఆ తరువాత ఏఐయూడీఎఫ్‌ అధినేత బద్రుద్దీన్‌ అజ్మల్‌కు మద్దతుగా నిలిచాయి. అయితే భాజపా వాటిని వదులు కోవడం లేదు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఈ ప్రాంతాల్లో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. బాల్య వివాహాలపై నిషేధం వంటి అంశాలద్వారా వలస ముస్లిం మహిళలు తమకు మద్దతిస్తారని ఆయన ఆశాభావంతో ఉన్నారు.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img