icon icon icon
icon icon icon

పట్టు కోల్పోతున్న వారసత్వం?

కీలక నియోజకవర్గాల్లో వారసత్వం పట్టు కోల్పోతుందా? దశాబ్దాలుగా కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట పోటీకి వారసులు దూరంగా జరగడం దేనికి సంకేతం?

Published : 08 May 2024 05:35 IST

కుటుంబ నియోజకవర్గాల్లో పోటీకి దూరం
కొన్నిచోట్ల సవాల్‌గా తీసుకుని బరిలోకి..

కీలక నియోజకవర్గాల్లో వారసత్వం పట్టు కోల్పోతుందా? దశాబ్దాలుగా కుటుంబాలకు కంచుకోటలుగా ఉన్న చోట పోటీకి వారసులు దూరంగా జరగడం దేనికి సంకేతం? మారుతున్న రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వాస్తవాలు వారిని భయపెడుతున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. తమ కుటుంబాల నుంచి ఎవరో ఒకరు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఈసారి వారసులు బరిలోకి దిగడం లేదు. అందులో ఉత్తర్‌ ప్రదేశ్‌లోని అమేఠీ, బాగ్‌పత్‌, పీలీభీత్‌, ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌ వంటి నియోజకవర్గాలున్నాయి. ఇందులో రాహుల్‌ గాంధీ, జయంత్‌ చౌధరి స్వచ్ఛందంగా సీట్లను వదులుకోగా.. వరుణ్‌ గాంధీ, జయంత్‌ సిన్హాలకు భాజపా టికెట్లు ఇవ్వలేదు.


ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీ గత 25 ఏళ్లలో తొలిసారిగా గాంధీ, నెహ్రూ కుటుంబ సభ్యుల్లేకుండా ఎన్నికలకు వెళ్తోంది. 2004 నుంచి 2014 వరకూ ఇక్కడ గెలుస్తూ వచ్చిన రాహుల్‌ గాంధీ 2019లో ఓడిపోయారు. దీంతో ఈసారి ఆయన తన తల్లి ఖాళీ చేసిన రాయ్‌బరేలీకి మారారు. తమ కుటుంబానికి సన్నిహితుడైన కిశోరీలాల్‌ శర్మను అమేఠీలో బరిలోకి దించారు.


మాజీ ప్రధాని చరణ్‌ సింగ్‌ మనవడు, రాష్ట్రీయ లోక్‌ దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) అధినేత జయంత్‌ చౌధరి బాగ్‌పత్‌ నుంచి ఈసారి పోటీ చేయడం లేదు. తన తాత, తండ్రి అజిత్‌ సింగ్‌ గెలిచిన ఈ నియోజకవర్గాన్ని ఆయన వదులుకున్నారు. గత ఎన్నికల్లో ఆయన భాజపా అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.


హజారీబాగ్‌కు భాజపా మాజీ సీనియర్‌ నేత యశ్వంత్‌ సిన్హా ప్రాతినిధ్యం వహించేవారు. ఆ తరువాత ఆయన కుమారుడు జయంత్‌ సిన్హా అక్కడి నుంచి గెలిచారు. ఈసారి ఆయనకూ పార్టీ టికెట్‌ ఇవ్వలేదు. దీంతో ఈ నియోజకవర్గంపై ఆ కుటుంబానికి పట్టు తప్పింది.


పీలీభీత్‌ మేనకా గాంధీ, వరుణ్‌ గాంధీలకు కంచుకోట. ఈసారి భాజపా ఆయనకు టికెట్‌ ఇవ్వలేదు. దీంతో 3 దశాబ్దాల్లో వారు పోటీ చేయకపోవడం ఇదే తొలిసారి.


మళ్లీ నిలిచిన నేతలు

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌లది మరో తీరు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనే ఉద్దేశంతో తమ కంచుకోటల్లో మళ్లీ బరిలోకి దిగారు. 2019లో దిగ్విజయ్‌ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి తమ సొంత నియోజకవర్గం రాజ్‌గఢ్‌లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆయన కుటుంబ సభ్యులే చాలాకాలంపాటు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఈ సీటును పోగొట్టుకున్నారు. మళ్లీ ఇప్పుడు దిగ్విజయ్‌ బరిలో నిలిచి పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కన్నౌజ్‌లో 2019 ఎన్నికల్లో డింపుల్‌ యాదవ్‌ ఓటమి పాలయ్యారు. అది సమాజ్‌వాదీకి కంచుకోట. 1999 వరకూ అక్కడ ములాయం కుటుంబ సభ్యులే గెలిచారు. ఆ తర్వాత భాజపా వశమైంది. మళ్లీ ఇప్పుడు పట్టు సాధించేందుకు స్వయంగా అఖిలేశ్‌ రంగంలోకి దిగారు.


తమ కుటుంబానికి పెట్టని కోట అయిన మధ్యప్రదేశ్‌లోని గుణలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా 2019లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. ఈసారి ఆయన భాజపా తరఫున అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకుని పట్టు నిలబెట్టుకోవాలనేది ఆయన లక్ష్యం.

హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో విక్రమాదిత్య సింగ్‌ పోటీకి దిగారు. రాష్ట్ర మంత్రిగా ఉన్న ఆయన తమ కుటుంబానికి ఆ నియోజకవర్గంపై ఉన్న పట్టును కాపాడుకోవాలని తలపోస్తున్నారు. ఇక్కడ భాజపా తరఫున సినీ నటి కంగనా రనౌత్‌ పోటీలో ఉన్నారు.


ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో పట్టు కోసం కుటుంబ సభ్యుల మధ్యే పోటీ నెలకొంది. ఇక్కడ కాంగ్రెస్‌ నుంచి షర్మిల, వైకాపా నుంచి అవినాశ్‌ రెడ్డి తలపడుతున్నారు. ఈ సీటుకు గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రాతినిధ్యం వహించారు.

మహారాష్ట్రలోని బారామతిలో కుటుంబ సభ్యుల మధ్యే పోరు సాగుతోంది. శరద్‌ పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, అజిత్‌ పవార్‌ భార్య సునేత్రా పవార్‌ మధ్య తీవ్ర పోటీ సాగుతోంది.


ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img