icon icon icon
icon icon icon

ప్రతిష్ఠాత్మకం మల్కాజిగిరి!

ఓట్లపరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం.. 37 లక్షల మందికి పైగా ఓటర్లు.. 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 లక్షలకు పైగా ఓట్లు.. వెరసి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం.

Published : 09 May 2024 05:29 IST

హాట్‌ సీట్‌పై కన్నేసిన ప్రధాన పార్టీలు
ఆరు గ్యారంటీలే గెలిపిస్తాయంటున్న కాంగ్రెస్‌
ఎమ్మెల్యేల బలంతో విజయంపై భారాస భరోసా
మోదీ కరిష్మాతో పాగా వేస్తామంటున్న భాజపా
ఈనాడు - హైదరాబాద్‌

ఓట్లపరంగా దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం.. 37 లక్షల మందికి పైగా ఓటర్లు.. 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5 లక్షలకు పైగా ఓట్లు.. వెరసి మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం. రాజకీయ పార్టీలకు హాట్‌సీట్‌గా చెప్పుకునే ఈ స్థానంలో ఈసారి పోరు ఆసక్తికరంగా మారింది. 22 మంది బరిలో నిలిచినా భాజపా, కాంగ్రెస్‌, భారాసల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ నుంచి వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌ పట్నం సునీతా మహేందర్‌రెడ్డి.. భారాస అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి.. భాజపా తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పోటీలో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పాటు ఆరు గ్యారంటీల అమలుతో ప్రజలు తమకు పట్టం కడతారని కాంగ్రెస్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. లోక్‌సభ స్థానంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో తమ పార్టీ గెలవడంతో ఎమ్మెల్యేల బలంతో విజయం తమదేనని భారాస భరోసాతో ఉంది. మోదీ కరిష్మాకు తోడు కేంద్రంలో తమ పార్టీకి అధికారం కట్టబెట్టేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారనే ధీమా భాజపాలో కనిపిస్తోంది. ఇలా మూడు ప్రధాన పార్టీలు గెలుపుపై ఆశతో ముమ్మర ప్రచారం చేస్తున్నాయి. తరచూ ఇతర ప్రాంతాల నేతలు ఇక్కడి నుంచి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఈ సీటుకు రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. మినీఇండియాగా పిలుస్తున్న ఈ స్థానం పరిధిలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులతో పాటు ఉత్తరాదికి చెందిన ఓటర్లు అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. లోక్‌సభ పరిధిలోనే అత్యధికంగా 7 లక్షల మందికి పైగా ఓటర్లు కుత్బుల్లాపూర్‌ సెగ్మెంట్‌లో ఉండటంతో 3 ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నాయి. ర్యాలీలు, రోడ్‌షోలు, కార్నర్‌మీటింగ్‌లతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. సామాజికవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ విజయానికి బాటలు వేసుకుంటున్నారు.


కాంగ్రెస్‌ పార్టీకి  ప్రతిష్ఠాత్మకం

కాంగ్రెస్‌ అభ్యర్థి పట్నం సునీతామహేందర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ ఛైర్‌పర్సన్‌గా మూడుసార్లు చేసిన అనుభవముంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల తరువాత భారాస నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. ఆమె భర్త మహేందర్‌రెడ్డికి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో తలపండిన నేతగా పేరుంది. కిందటిసారి లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన రేవంత్‌రెడ్డి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి కావడంతో రాజీనామా చేశారు. ఇప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం కావడంతో కాంగ్రెస్‌ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారింది. సునీత మహేందర్‌రెడ్డిని గెలుపు బాధ్యతను రేవంత్‌రెడ్డి స్వయంగా భుజానెత్తుకోవడం ఆమెకు కలిసివచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక్కడి శ్రేణులను సమన్వయం చేసే బాధ్యతను తన కీలక అనుచరుడికి అప్పగించి నిరంతరం పర్యవేక్షణ చేయిస్తున్నారు.

7 సెగ్మెంట్లలో పార్టీ తరఫున ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ఇటీవలే చాలామంది ద్వితీయశ్రేణి నాయకుల చేరికతో పార్టీలో జోష్‌ నెలకొంది. మరోవైపు త్వరలో కాంగ్రెస్‌లో చేరే ఉద్దేశంతో ఇతర పార్టీల్లో ఉన్న కీలక ప్రజాప్రతినిధులూ అంతర్గతంగా తమ క్యాడర్‌ను కాంగ్రెస్‌ వైపు పురమాయిస్తుండటంతో జోష్‌ పెరిగింది. మరోవైపు ముస్లిం, మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్‌ పార్టీ నమ్మకం పెట్టుకుంది. తమను గెలిపిస్తే నియోజకవర్గానికి ప్రత్యేక మ్యానిఫెస్టో అమలు చేస్తామని సునీతామహేందర్‌రెడ్డి చెబుతున్నారు. మహిళగా తనకు అవకాశం కల్పించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు.


భారాసకు  ఎమ్మెల్యేల దన్ను

భారాస అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. తనతల్లి మధురమ్మ పేరిట ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటుచేసి సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. 2009 నుంచి కాంగ్రెస్‌ తరఫున ఉప్పల్‌ అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతో ఇటీవల శాసనసభ ఎన్నికలకు ముందు భారాసలో చేరారు. అప్పటికే ఉప్పల్‌ ఎమ్మెల్యే టికెట్‌ బండారి లక్ష్మారెడ్డికి ఖరారవ్వడంతో తాజాగా ఎంపీ టికెట్‌ ఇచ్చారు. మల్కాజిగిరి లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో భారాస అభ్యర్థులే గెలుపొందడంతో ఆ పార్టీ బలంగా కనిపిస్తోంది. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేకానంద 85,400 ఓట్ల మెజారిటీతో గెలిచి ఆధిక్యంలో రాష్ట్రంలోనే తొలిస్థానంలో నిలవడం గమనార్హం. శాసనసభ ఎన్నికలతో పోల్చితే తాజాగా జరుగుతున్న ఎంపీ ఎన్నికల్లో వాతావరణం మారినట్లు కనిపిస్తుండటం భారాసను కలవరపెట్టే అంశంగా మారింది.

2018 శాసనసభ ఎన్నికల్లోనూ అంతా భారాస ఎమ్మెల్యేలే ఉన్నా కాంగ్రెస్‌ తరఫున రేవంత్‌రెడ్డి గెలుపొందారు. ఈనేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాను.. రాష్ట్రంలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ను నిలువరించి గెలుపొందడం ఆషామాషీ విషయం కాదని ఆ పార్టీశ్రేణులు భావిస్తున్నాయి. భారాస అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులతో పాటు గ్యారంటీల అమల్లో కాంగ్రెస్‌ విఫలమైందని చెబుతున్నాయి. కేటీఆర్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉండగా.. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఎమ్మెల్యేలే ప్రచార బాధ్యతను భుజాన వేసుకున్నారు.


మోదీ ఆకర్షణమంత్రంపై భాజపా ధీమా

భాజపా అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈటల రాజేందర్‌కు రాజకీయంగా అపార అనుభవముంది. సుదీర్ఘకాలం భారాసలో పనిచేసి రెండేళ్ల కిందట భాజపాలో చేరారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హుజురాబాద్‌, గజ్వేల్‌ల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం భాజపా కీలకమైన స్థానంలో ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించింది. ఈ లోక్‌సభ స్థానం పరిధిలో భాజపాకు ఒక్కరైనా ఎమ్మెల్యే లేరు. గత లోక్‌సభ ఎన్నికల్లోనూ మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ ఈసారి గెలుపుపై ఆ పార్టీశ్రేణుల్లో విశ్వాసం వ్యక్తమవుతోంది. రాజేందర్‌ అభ్యర్థి కావడం పార్టీకి కలిసివచ్చే అంశంగా మారింది.

రాజేందర్‌ ప్రస్తుతం మేడ్చల్‌లోని దేవరయాంజల్‌వాసి కావడం.. అంతకుముందు అల్వాల్‌లో ఉండటం.. పౌల్ట్రీవ్యాపారంలో భాగంగా స్థానికంగా మంచి సంబంధాలు కలిగిఉండటం.. తెలంగాణ ఉద్యమంలో మమేకమవ్వడం లాంటి సొంత ఇమేజ్‌కు తోడు మోదీ ఆకర్షణ మంత్రం కలిసి వస్తుందనే ధీమా ఆ పార్టీశ్రేణుల్లో కనిపిస్తోంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చి రాజేందర్‌ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు. హిందుత్వవాదం కూడా విజయానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు. నగర వాతావరణానికి తోడు ఉత్తరాది ఓట్లు అధికంగా ఉండటం తమకు కలిసివస్తుందని భాజపా అంచనా వేస్తోంది. కేంద్రప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతోంది.


కేంద్ర మంత్రి.. రాష్ట్ర మంత్రి.. ముఖ్యమంత్రి

2008లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఈ లోక్‌సభ స్థానం ఏర్పడింది. రాజకీయాలపరంగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి రాష్ట్రంలోనే హాట్‌సీట్‌గా పేరుంది. 2009లో తొలిసారి జరిగిన ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సర్వే సత్యనారాయణ గెలుపొందారు. 2012లో ఆయన కేంద్ర రవాణాశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. 2014లో అప్పుడే రాజకీయ అరంగేట్రం చేసిన చామకూర మల్లారెడ్డి తెదేపా టికెట్‌ సాధించి గెలుపొందారు. అప్పట్లో తెదేపా తరఫున తెలంగాణలో గెలిచిన ఏకైక ఎంపీ ఆయనే. 2016లో భారాస(అప్పటి తెరాస)లో చేరిన ఆయన.. 2018 ఎమ్మెల్యే ఎన్నికల్లో మేడ్చల్‌ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఇటీవలే రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా ఇక్కడ ఎంపీగా గెలిచిన ముగ్గురు ఉన్నతస్థానాలు సాధించడంతో లక్కీ సీటుగా చెబుతున్నారు.


కార్మికుల ఓట్లూ కీలకమే..

లోక్‌సభ స్థానంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌ మినహా మిగిలిన 5 సెగ్మెంట్లలో పారిశ్రామిక ప్రాంతాలు విస్తరించాయి. కూకట్‌పల్లి సెగ్మెంట్‌లో బాలానగర్‌.. కుత్బుల్లాపూర్‌ పరిధిలో జీడిమెట్ల.. ఉప్పల్‌ పరిధిలో నాచారం, ఈసీఐఎల్‌, చర్లపల్లి.. మేడ్చల్‌ పరిధిలో గుండ్లపోచంపల్లి.. మల్కాజిగిరి పరిధిలో మౌలాలి.. ఇలా పారిశ్రామికవాడల్లో ఉత్తరాదికి చెందిన కార్మికులు అధికసంఖ్యలో పనిచేస్తున్నారు. ఈనేపథ్యంలో ఆయా కుటుంబాల్లోని లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయిలో ఉండటం గమనార్హం.


పోలింగ్‌ క్రమేపీ తగ్గుముఖం

2009లో 51.46శాతం.. 2014లో 50.9శాతం పోలింగ్‌ నమోదైంది. 2019 ఎన్నికల్లో 31.5లక్షల ఓటర్లుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 37.79కి చేరింది. కిందటిసారి 49.61 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇలా క్రమేపీ పోలింగ్‌శాతం తగ్గుతూ వస్తోంది. ఈసారి ఎంతమేరకు నమోదవుతుందనేది ఫలితాన్ని నిర్ణయించే అంశాల్లో ఒకటిగా మారింది. కిందటిసారి ఎంపీగా గెలుపొందిన రేవంత్‌రెడ్డికి.. సమీప ప్రత్యర్థికి మధ్య తేడా కేవలం 11 వేల ఓట్లే కావడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.  ఈక్రమంలోనే ఓటర్లను పోలింగ్‌బూత్‌లకు రప్పించే పనిని ప్రత్యేక బృందాలకు అప్పగించే ప్రణాళికల్లో ఉన్నాయి.


‘కంటోన్మెంట్‌’ ఉపఎన్నిక హడావుడి

ఇదే లోక్‌సభ స్థానం పరిధిలోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం ఉపఎన్నిక పోలింగ్‌ జరుగుతోంది. 2023లో జరిగిన ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా గెలుపొందిన లాస్యనందిత రోడ్డుప్రమాదంలో చనిపోవడంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు. భారాస తరఫున ఆమె సోదరి నివేదిత బరిలో ఉండటంతో సానుభూతి పవనాలు వీస్తాయని పార్టీ భావిస్తోంది. నిన్నటివరకు భాజపాలో ఉన్న శ్రీగణేశ్‌ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి టి.ఎన్‌.వంశతిలక్‌ భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. ఎంపీ ఎన్నికతో పాటు ఎమ్మెల్యే ఉపఎన్నిక జరగనుండటంతో క్రాస్‌ఓటింగ్‌ భారీగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


5 సెగ్మెంట్లలో 5లక్షలకు పైగా ఓట్లు

దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్‌ నియోజకవర్గం కావడంతో పాటు 5 అసెంబ్లీ సెగ్మెంట్లలో 5లక్షలకు పైగా ఓట్లు ఉండటం ఈ నియోజకవర్గం ప్రత్యేకతగా నిలుస్తోంది. అత్యధికంగా కుత్బుల్లాపూర్‌ సెగ్మెంట్‌లో 7.2 లక్షల ఓట్లు.. మేడ్చల్‌లో 6.65 లక్షలు.. ఎల్బీనగర్‌లో 6.04 లక్షలు.. ఉప్పల్‌లో 5.4 లక్షలు.. మల్కాజిగిరిలో 5.08 లక్షల ఓట్లున్నాయి. కూకట్‌పల్లిలో 4.82 లక్షల ఓట్లుండగా.. కంటోన్మెంట్‌లో  అత్యల్పంగా 2.53 లక్షల ఓట్లున్నాయి. కుత్బుల్లాపూర్‌ సెగ్మెంట్‌పై ప్రధానపార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img