icon icon icon
icon icon icon

ప్రచార భాగస్వాములు

‘ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది..’ అంటారు. ఈ నానుడిని నిజం చేస్తూ ఎన్నికల సమరాంగణంలో మేము సైతం అంటూ అతివలు భాగస్వాములవుతున్నారు.

Updated : 21 Nov 2023 13:44 IST
అభ్యర్థుల తరఫున  ఓట్లు అభ్యర్థిస్తున్న సతీమణులు
పార్టీ శ్రేణులతో కలిసి క్షేత్ర స్థాయి పర్యటనలు

న్యూస్‌టుడే, మేడిపల్లి, జగిత్యాల: ‘ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది..’ అంటారు. ఈ నానుడిని నిజం చేస్తూ ఎన్నికల సమరాంగణంలో మేము సైతం అంటూ అతివలు భాగస్వాములవుతున్నారు. సభలు, సమావేశాల్లో పాల్గొనడమే కాకుండా, ఇంటింటి ప్రచారంలో ముందుంటున్నారు. తోటి మహిళలతో కలిసి బొట్టు పెట్టి మరీ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భర్త విజయం కోసం అలుపెరగకుండా నిత్యం ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ తరహా ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువైంది. పార్టీ తరఫున నిర్వహించే వేదికలపైనా అభ్యర్థుల సతీమణులు మాట్లాడుతూ ఓటర్లను   ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.

మా ఆయనకే ఓటేయండి

  • కరీంనగర్‌లో మంత్రి, భారాస అభ్యర్థి గంగుల కమలాకర్‌ సతీమణి రజిత, కాంగ్రెస్‌ అభ్యర్థి పురమల్ల శ్రీనివాస్‌ భార్య, జడ్పీటీసీ సభ్యురాలు లలిత ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
  • కోరుట్ల భారాస అభ్యర్థి డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌ భార్య దీప్తి, సోదరి సమత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జువ్వాడి నర్సింగరావు తరపున ఆయన భార్య రజని, భాజపా అభ్యర్థి అర్వింద్‌ సతీమణి ప్రియాంకలు ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
  • పెద్దపల్లిలో భారాస అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి భార్య పుష్పలత, రామగుండంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ సతీమణి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
  • జగిత్యాలలో భారాస అభ్యర్థి సంజయ్‌కుమార్‌ గెలుపు కోసం సతీమణి రాధిక శ్రమిస్తున్నారు. చొప్పదండిలో సుంకె రవిశంకర్‌ భార్య దీవెన సమావేశాలు, ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు.

జగిత్యాల భారాస అభ్యర్థి డా.సంజయ్‌ సతీమణి రాధిక

కొంగు పట్టి అడుగుతున్నా..

‘ఈ ప్రాంత ఆడబిడ్డనై మీ అందరి ముందు కొంగు పట్టి అడుగుతున్నా.. ఓటు భిక్ష వేయండి’ అంటూ హుజూరాబాద్‌ భారాస అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి భార్య శాలినిరెడ్డి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి సభలోనూ ఆమె ఇలాగే అడిగారు. ఎన్నికల కంటే ముందే వినాయక నవరాత్రి ఉత్సవాలు, దసరా, బతుకమ్మ వేడుకల్లోనూ శాలినిరెడ్డి అతివలతో కలిసి పాల్గొన్నారు. వీరి కూతురు శ్రీనికరెడ్డి కూడా ముఖ్యమంత్రి సభ సహా పలు కార్యక్రమాల్లో మాట్లాడుతూ ఓట్లు అడిగింది.

ప్రజాప్రతినిధిగా పర్యవేక్షణ

మంథని భారాస అభ్యర్థి పుట్ట మధూకర్‌ భార్య, పురపాలక ఛైర్‌పర్సన్‌ శైలజ ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. పట్టణంలో విస్తృతంగా పర్యటిస్తూ భారాస ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు భర్త గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిపై ప్రచారం చేస్తున్నారు. స్థానిక మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ కార్యక్రమాల నిర్వహణ, సమీక్షలతో పాటు రోజువారీ ప్రచారంపై ఆమె తెలుసుకుంటున్నారు. అతిరథుల సభల సమయంలోనూ సూచనలు చేస్తున్నారు.

అక్కడ రాజేందర్‌.. ఇక్కడ జమున

భాజపా నేత ఈటల రాజేందర్‌ ఈసారి రెండు చోట్లా పోటీ చేస్తుండగా గజ్వేల్‌లో ప్రచారానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. దీంతో హుజూరాబాద్‌ స్థానంలో ప్రచార బాధ్యతలను ఆయన సతీమణి జమున మోయాల్సి వస్తోంది. ప్రతి ఎన్నికతో పాటు గతంలో పార్టీ మారిన సందర్భంలోనూ ఆయన తరఫున మాట్లాడిన జమున హుజూరాబాద్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ పార్టీ మ్యానిఫెస్టోపై ప్రచారం చేస్తున్నారు.

వికాస్‌ వెన్నంటే దీప

చెన్నమనేని వికాస్‌రావు సతీమణి దీప

వేములవాడ భాజపా అభ్యర్థి చెన్నమనేని వికాస్‌ భార్య డాక్టర్‌ దీప భర్త వెన్నంటే ఉంటూ ఎన్నికల ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సామాజిక సేవలో పాల్గొన్నప్పటి నుంచే ఇద్దరూ కలిసే వివిధ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఎన్నికల ప్రకటన అనంతరం ఆమె వేములవాడ నియోజకవర్గంలోని భాజపా నేతలు, కార్యకర్తలు తదితర వివరాలను కంప్యూటరీకరించి నేరుగా కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల నిర్వహణలపై బాధ్యులతో మాట్లాడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img