icon icon icon
icon icon icon

Jambur: గుజరాత్‌లోని మినీ ఆఫ్రికా గ్రామంలో ఉత్సాహంగా పోలింగ్‌..!

గుజరాత్‌ ఎన్నికలకు జంబుర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆఫ్రికా నుంచి వలస వచ్చినవారు ఇక్కడ ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకొన్నారు.

Published : 07 May 2024 15:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గుజరాత్‌(Gujarat)లో పోలింగ్‌ ఉత్సాహంగా జరుగుతోంది. దేశంలో అత్యంత అరుదుగా ఉన్న మినీ-ఆఫ్రికా గ్రామంలో కూడా పోలింగ్‌ హడావుడి కనిపిస్తోంది. జునాఘడ్‌ ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉండే జంబుర్‌ (Jambur)లో ఆఫ్రికాలోని సిద్దీ తెగకు చెందిన ఐదు వేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరి తాతలు ఆఫ్రికా ఖండం నుంచి భారత్‌కు వలస వచ్చారు. వారి సంతానమే ఇప్పటికీ ఇక్కడ జీవిస్తోంది.

2022లో తొలిసారిగా వీరికి ప్రభుత్వం ఓటుహక్కును కల్పించింది. మొత్తం 1,500 మందికి ఓటు హక్కు ఉంది. ప్రత్యేకంగా వీరి కోసం ఓ పోలింగ్‌ బూత్‌ కూడా ఏర్పాటుచేశారు. నేడు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా డాన్స్‌లు చేస్తూ వీరు పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకొన్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో కూడా మినీ-ఆఫ్రికన్‌ గ్రామాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా వీరి జనాభా 0.25 మిలియన్లు ఉండొచ్చని అంచనా.

తొలిసారి 7వ శతాబ్దంలో..

సిద్దీ తెగ ప్రజలు తొలిసారి 7వ శతాబ్దంలో భారత్‌లో అడుగుపెట్టినట్లు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత అరబ్బుల దండయాత్రల సమయంలో, నావికులు, కిరాయి సైనికులు, బానిసలుగా వీరిని భారత్‌కు తీసుకొచ్చారు. నాటినుంచి వారు ఈ గడ్డ పైనే స్థిరనివాసం ఏర్పాటుచేసుకొన్నారు. ఇక గుజరాత్‌లో మాత్రం జునాఘడ్‌ కోట నిర్మాణం నిమిత్తం పలువురు ఆఫ్రికన్లను తీసుకొచ్చారు. 

వీరంతా తొలుత రత్నపుర్‌ అనే గ్రామంలో ఉండేవారు. ఆ తర్వాత క్రమంగా అందరూ జంబూర్‌లోకి వచ్చి స్థిరపడ్డారు. ఇది గిర్‌కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మూలాలు ఆఫ్రికాలో ఉన్నా.. గుజరాతీ, భారతీయ సంప్రదాయాలనే పాటిస్తున్నారు. కొన్నిట్లో మాత్రం చాలా కచ్చితమైన నియమాలను అనుసరిస్తున్నారు. తమలో తాము మాత్రమే పెళ్లిళ్లు చేసుకొవాల్సి ఉంటుంది. వీరిని చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి సందర్శకులు వస్తుంటారు. ఈనేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు ఇవ్వడంతో వచ్చే ఆదాయంతో జీవిస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img