icon icon icon
icon icon icon

Revanth Reddy: ఆగస్టు 15 తర్వాత సిద్దిపేటకు శని వదిలిపోతుంది: సీఎం రేవంత్

పార్టీ నాయకులు, ప్రజలకు కాంగ్రెస్‌ (Congress) సోషల్‌ మీడియా కార్యకర్తలు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు.

Updated : 26 Apr 2024 18:09 IST

హైదరాబాద్‌: పార్టీ నాయకులు, ప్రజలకు కాంగ్రెస్‌ (Congress) సోషల్‌ మీడియా కార్యకర్తలు అనుసంధానకర్తలుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో (Telangana Lok Sabha Elections) రాష్ట్రంలో 14 సీట్లలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి నిమిషం అలర్ట్‌గా ఉండాలన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కార్యకర్తలతో జరిగిన సమావేశంలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపా, భారాసపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా కార్యకర్తల రెక్కల కష్టంతో ఏర్పడిన ప్రభుత్వమిదని.. దాన్ని వారే కాపాడుకోవాలన్నారు. 

రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర

‘‘రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ సెమీఫైనల్స్‌ మాత్రమే. ఇప్పుడు ఫైనల్స్‌ ఆడుతున్నాం. సెమీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టు లాంటి కేసీఆర్‌ను ఓడించాం. ఇప్పుడు పాకిస్థాన్‌ జట్టు లాంటి మోదీతో కొట్లాడాలి. భాజపా నేతలు అమిత్‌షా, జేపీ నడ్డా సహా ముఖ్యనేతలు తెలంగాణపై ముప్పేట దాడి చేస్తున్నారు. ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగిస్తున్నారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి అంశాలను సమయస్ఫూర్తితో తిప్పికొట్టాలి. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలి. భాజపాది ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం.. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు. 

కష్టపడి తెచ్చిన ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నారు. రేవంత్‌ లేకపోతే చాలు.. ఎవరైనా ఫర్వాలేదు అనే పరిస్థితికి భారాస నేతలు వచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో 12 సీట్లలో గెలిపిస్తే ఏడాదిలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ అంటున్నారు.. అదెలా సాధ్యం?ఇక్కడ అల్లాటప్పాగా కూర్చున్నామా? తండ్రి పేరు చెప్పుకొని కుర్చీలోకి వచ్చామా? ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉంటూ కుట్రలను తిప్పికొట్టాలి. ఈ ఎన్నికలు దేశానికి అత్యంత అవసరం. రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఉద్దేశంతోనే 400 సీట్ల నినాదాన్ని భాజపా చేస్తోంది. రిజర్వేషన్లు రద్దు చేసి ప్రభుత్వరంగ సంస్థలను అదానీ, అంబానీలకు అమ్మేసే కుట్ర జరుగుతోంది. 

కాళేశ్వరంలో దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువా?

హరీశ్‌రావు మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. మోసం చేయాలనుకున్న ప్రతిసారీ ఆయనకు స్తూపం గుర్తొస్తుంది. హరీశ్‌ సవాల్‌ను స్వీకరించా.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పా. ఆ తేదీ తర్వాత సిద్దిపేటకు ఆయన శని వదిలిపోతుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా అమరవీరుల స్తూపం వద్దకు వెళ్లారా? రైతు రుణమాఫీతో పాటు మిగతా అంశాలను పేర్కొంటూ తన మామ చెప్పిన సీస పద్యమంతా రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా చెల్లుతుందా? మళ్లీ చెప్తున్నా.. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తా. హరీశ్‌రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలి. రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు?దానికి రూ.30-40వేల కోట్లు అవుతుంది. కాళేశ్వరంలో మీరు దోచుకున్న రూ.లక్ష కోట్ల కంటే అది ఎక్కువా? హైదరాబాద్‌ చుట్టూ ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువా?’’ అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img